రక్షణశాఖ మాజీ అధికారులకు జైలు
న్యూఢిల్లీ: ఇద్దరు మాజీ రక్షణ శాఖ అధికారులతో పాటు ఓ మాజీ సైనికాధికారికి ఢిల్లీ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. సైన్యంలో డిప్యూటీ డెరైక్టర్ జనరల్‌గా పనిచేసిన మాజీ లెఫ్టినెంట్ కల్నల్ పీఆర్ఎస్ రావు, అసిస్టెంట్ ఆడిట్ అఫీసర్ ఏకే శర్మ, భారత సైన్యం నుంచి 1991లో పదవీ విరమణ పొందిన ఐబీ ఉప్పల్లు ప్రభుత్వానికి 7.3 కోట్ల రూపాయల నష్టం కలిగించారని అభియోగం. సరఫరా కాని సరుకులకు చెల్లింపులు చేసినట్లు బిల్లులు సృష్టించారనే అభియోగంతో సీబీఐ 1998లో 12 మందిని అరెస్టు చేసింది. విచారణ క్రమంలో 2005లో వీరిలో సీనియర్ ఆడిటర్, అకౌంట్స్ ఆఫీసర్, గుమస్తాలను ఈ కేసులోంచి మినహాయిం చింది. మోసపూరిత కుట్రతో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని రావు, శర్మలతో పాటు మరో ఇద్దరి మీద అభియోగ విచారణ కొనసాగింది. ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాలతో నేరం రుజువు కావడంతో సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి దోషులకు నాలుగేళ్ల పాటు జైలు శిక్ష విధించారు.