హుషార్
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : ఈ ఏడాది జనవరి 5న అత్యంత ప్రతిష్టాత్మకమైన జీఎస్ఎల్వీ డీ5, శుక్రవారం పీఎస్ఎల్వీ విజయాలతో ఈ ఏడాది ప్రథమార్థంలో రెండు ప్రయోగాలు విజయవంతం కావడంతో షార్ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు. శ్రీహరికోటలోని అన్ని భవనాల మీద నుంచి షార్ ఉద్యోగుల కుటుంబాలు, పిల్లలు రాకెట్ ప్రయోగాన్ని వీక్షించారు.
ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంలో రెండో ఉపగ్రహాన్ని ప్రయోగించడంతో రాకెట్ నింగికి ఎగుస్తున్నంత సేపు కరతాళధ్వనులతో వారి ఆనందాన్ని తెలియజేస్తూ దేశభక్తిని చాటుకున్నారు. షార్‌లో బందోబస్తులో ఉన్న పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది మీడియా సెంటర్లోని టీవీల్లో ప్రయోగాన్ని ఆద్యంతమూ వీక్షించి తమ ఆనందాన్ని ఒకరినొకరు పంచుకున్నారు.
2011లో నాలుగు విజయాలు, 2012లో రెండు విజయాలు, 2013లో ఐదు విజయాలు, ఈ ఏడాది రెండో విజయం నమోదు కావడంతో షార్ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే రెండో విజయాన్ని సాధించడం, పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రెండోసారి తయారు చేసిన శాటిలైట్ ప్రయోగం కావడంతో షార్ ఉద్యోగుల్లో పట్టలేనంత సంతోషాన్ని వ్యక్తమైంది.
ఈ ఏడాది ప్రథమార్థంలోనే విజయాల ఖాతా తెరవడంతో షార్ ఉద్యోగులు ఉత్సాహంతో ఉన్నారు. సూళ్లూరుపేట, తడ ప్రాంతాల్లోని గ్రామీణులు సైతం మిద్దెలపై నుంచి రాకెట్ ప్రయోగాన్ని వీక్షించారు. ప్రయోగం విజయవంతంగా నిర్వహించడంతో ఈ ప్రాంత ప్రజల్లో కూడా విజయగర్వం తొణికిసలాడింది. భవిష్యత్తులో కూడా మరిన్ని పెద్ద ప్రయోగాలు చేసి మన శాస్త్రవేత్తలు ప్రపంచం గర్వించదగిన విజయాలు సాధించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. గత ఏడాదితో వంద ప్రయోగాలు పూర్తి చేసి సెంచరీ మైలురాయిని దాటి 113వ ప్రయోగాన్ని కూడా విజయవంతం చేయడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.