బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం 5% డౌన్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ కాలానికి(క్యూ2) ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) రూ. 1,104 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 1,168 కోట్లతో పోలిస్తే ఇది 5%పైగా క్షీణత. పన్ను వ్యయాలు పెరగడం ఇందుకు ప్రధానంగా కారణమైనట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పి.శ్రీనివాస్ చెప్పారు.
ఈ పద్దుకింద రూ. 410 కోట్లను కేటాయించగా, గతంలో ఇవి రూ. 80 కోట్లు మాత్రమేనని తెలియజేశారు. ఇక మొండిబకాయిలు, తదితరాలకు కేటాయింపులు రూ. 861 కోట్ల నుంచి రూ. 888 కోట్లకు పెరిగాయి. నికర మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.86% నుంచి 1.74%కు తగ్గాయి. ఇదే కాలానికి బ్యాంక్ మొత్తం ఆదాయం మాత్రం 13% పుంజుకుని రూ. 11,817 కోట్లకు చేరింది.
ఇందుకు 17% ఎగసి రూ. 3,401 కోట్లను తాకిన నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) సహకరించింది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 2.85% నుంచి 3.02%కు బలపడ్డాయి. ప్రభుత్వం నుంచి రూ. 500 కోట్ల పెట్టుబడులను కోరినట్లు శ్రీనివాస్ చెప్పారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బీవోబీ షేరు 1% లాభంతో రూ. 961 వద్ద ముగిసింది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాభం హైజంప్
ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ కాలం(క్యూ2)లో రూ. 163 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 47 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్ల వృద్ధి. మొండి బకాయిలకు ప్రొవిజన్లు రూ. 323 కోట్ల నుంచి రూ. 293 కోట్లకు తగ్గాయి. మొత్తం ఆదాయం రూ. 3,197 కోట్ల నుంచి రూ. 3,420 కోట్లకు స్వల్పంగా పెరిగింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.77% నుంచి 4.83%కు పెరిగాయి. నికర మొండిబకాయిలు కూడా 1.76% నుంచి 3.29%కు ఎగశాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ షేరు 0.2% బలపడి రూ. 45 వద్ద ముగిసింది.
విజయా బ్యాంక్ లాభం 5.5% అప్
సాక్షి,బెంగళూరు: ఈ ఆర్థిక సంవత్సరం జూ లై-సెప్టెంబర్ (క్యూ2) లో విజయా బ్యాంక్ నిరక లాభం 5.5% వృద్ధితో రూ. 144 కోట్లకు చేరింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో రూ. 136 కోట్లను ఆర్జించింది. ప్రొవిజన్లు రూ. 132 కోట్ల నుంచి రూ. 152 కోట్లకు పెరిగాయి.
మొత్తం ఆదాయం రూ. 2,814 కోట్ల నుంచి రూ. 3,254 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.77% నుంచి 2.85%కు ఎగశాయి. నికర ఎన్పీఏలు కూడా 1.75% నుంచి 1.88%కు పెరిగాయి. జన ధన యోజన కింద ఇప్పటి వరకూ 6.96 లక్షల నూతన ఖాతాలు ప్రారంభించినట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రామారావు తెలిపారు. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు 0.3% తగ్గి రూ. 49 వద్ద ముగిసింది.
74% జారిన యూకో బ్యాంక్ లాభం
ప్రభుత్వ రంగ సంస్థ యూకో బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ కాలం(క్యూ2)లో 74% క్షీణించి రూ. 103.5 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2013-14) ఇదే కాలంలో బ్యాంక్ రూ. 400 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అయితే వడ్డీ ఆదాయం రూ. 4,444 కోట్ల నుంచి రూ. 4,897 కోట్లకు పుంజుకోగా, మొత్తం ఆదాయం కూడా రూ. 4,653 కోట్ల నుంచి రూ. 5,257 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 5.32% నుంచి 5.2%కు స్వల్పంగా తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ షేరు 4.6% పతనమై రూ. 83.5 వద్ద ముగిసింది.
కార్పొరేషన్ బ్యాంక్ లాభం జూమ్
ప్రభుత్వ రంగ సంస్థ కార్పొరేషన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ కాలానికి(క్యూ2) 10 రెట్లు అధికంగా రూ. 161 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో కేవలం రూ. 15.5 కోట్ల లాభం ఆర్జించింది. బ్యాంక్ వడ్డీ ఆదాయం 11% పెరిగి రూ. 4,940 కోట్లకు చేరగా, మొత్తం ఆదాయం కూడా రూ. 4,774 కోట్ల నుంచి రూ. 5,229 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.17% నుంచి 4.45%కు పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ షేరు 1% నష్టంతో రూ. 334 వద్ద ముగిసింది.
లాభాల్లో యునెటైడ్ బ్యాంక్
ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ కాలానికి(క్యూ2) ప్రభుత్వ రంగ సంస్థ యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 44 కోట్ల నికర లాభాన్ని సంపాదించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో బ్యాంక్ రూ. 489 కోట్లకుపైగా నష్టాలను నమోదు చేసింది. కాగా, ఇదే కాలానికి మొత్తం ఆదాయం మాత్రం రూ. 2,877 కోట్ల నుంచి రూ. 2,835 కోట్లకు స్వల్పంగా తగ్గింది. నికర మొండి బకాయిలు(ఎన్పీఏలు) 5.39% నుంచి 7.19%కు పెరిగాయి. బ్యాంక్లో ప్రభుత్వానికి 88% వాటా ఉంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో యునెటైడ్ బ్యాంక్ షేరు 5% లాభంతో రూ. 45 వద్ద ముగిసింది.