తప్పించుకున్న సైకో కుమార్
కడప: తిరుమల నడకదారిలో భక్తులపై దాడి చేసిన సైకో కుమార్ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని పారిపోయాడు. కడప జైలుకు తరలిస్తుండగా అతడు తప్పించుకున్నాడు. పోలీసుల నుంచి తప్పించుకుని పక్కనే ఉన్న ఇళ్లలోకి చొరబడి మాయమైనట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అతడి ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం అందించాలని ప్రజలను పోలీసులు కోరారు. అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సూచించారు.
తిరుమల నడకదారిలో భక్తులపై శనివారం తెల్లవారుజామున కుమార్ దాడి చేశాడు. నరసింహ స్వామి ఆలయ సమీపంలో భక్తులపై రాళ్లు కర్రలతో దాడికి పాల్పడ్డాడు. తమిళనాడు అంబత్తూరుకు చెందిన కుమార్ న్ని రోజులుగా అలిపిరి నడకదారి పరిసరాల్లో తిరుగుతున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు గుర్తించారు. కడప జైలుకు తరలించే ముందు అతడికి రుయా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేశారు. కాగా, కుమార్ తప్పించుకోవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.