వేశ్యలకు బహిరంగ ఉరి
సియోల్: నది పరివాహక ప్రాంతాలు, పాఠశాలల క్రీడా ప్రాంగణాలు, మార్కెట్లు. ఒకదానికి మరొదానికి సంబంధం లేకుండా ఉన్నాయి అనుకుంటున్నారా?. ఇవన్నీ ఉత్తరకొరియా బహిరంగంగా ఉరి తీయడానికి వినియోగించే ప్రదేశాలు. అవును. అక్కడి పాఠశాలల్లో విద్యార్థులు ఉరి తీయడాన్ని ప్రత్యక్షంగా చూస్తారు.
వ్యభిచారులను, పరిశ్రమల నుంచి వస్తువులు దొంగిలించినవారిని, దక్షిణ కొరియాకు దేశ సమాచారాన్ని చేరవేసిన వారిని బహిరంగంగా ఉరి తీస్తారు. దీన్ని ఆ ప్రాంతంలోని ప్రజలందరూ చూస్తారని దక్షిణ కొరియాకు చెందిన ఓ సంస్ధ తన రిపోర్టులో పేర్కొంది. ఉత్తరకొరియా నుంచి పారిపోయి దక్షిణ కొరియాకు వచ్చి ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న 375 మంది ఈ విషయాన్ని చెప్పారని సదరు సంస్ధ వెల్లడించింది.
ఉత్తరకొరియా మ్యాప్‌లో బహిరంగ ఉరి తీసే ప్రదేశాలను గుర్తించి ప్రచురించింది కూడా. 2014లో నియంతగా కిమ్ జోంగ్ ఉన్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం హక్కుల ఉల్లంఘన మరింత పెరిగిందని యూనైటెడ్ నేషన్స్ కమిషన్ పేర్కొన్న విషయం తెలిసిందే. భారీ జైళ్లు, క్రమపద్దతిలో హింస, ఆకలితో మాడ్చి చంపడం, ఉరి తీయడం లాంటి శిక్షలు నాజీ కాలం కన్నా ఘోరంగా ఉత్తరకొరియాలో అమలు జరుగుతున్నాయని సంస్ధ తెలిపింది.