ఈజిప్ట్ బస్సు బాంబుదాడిలో ఐదుగురికి గాయాలు
కైరో: ఈజిప్ట్ రాజధాని కైరోలో ఓ ప్రజా రవాణా బస్సుపై బాంబుదాడి జరిగింది. ఈ బాంబుదాడిలో భద్రతా అధికారులతో సహా ఐదుగురికి తీవ్ర గాయాలయినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఉత్తర కైరీ సమీప నగరమైన నాసర్ సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ బాంబును బస్సులో పెట్టారా ? లేక ఏ దుండగుడు అయినా బస్సుపై బాంబు విసిరిడా ? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
ఇస్లామిస్ట్ అధ్యక్షుడైన మెహ్మద్ మెర్సీ పదవీచ్యుత్తుడైన నాటి నుంచి తీవ్రవాదులు ఈ బాంబు దాడులకు తెగబడుతున్నట్టు సమాచారం. కానీ, తీవ్రవాదులు, జవానులనే తమ ప్రథమ లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులకు పాల్పడుతున్నట్టు ఆధారాలు వెల్లడిస్తున్నాయి. కాగా, సరిగ్గా రెండు రోజుల క్రితం జరిగిన కారు ఆత్మహుతి దాడిలో కూడా పోలీసులనే లక్ష్యంగా చేసుకున్న తీవ్రవాదులు 15మంది ప్రజలను పొట్టనపెట్టుకున్నారు. ఈ ఘటన నైల్ డెల్టా నగరంలోని ప్రధాన కార్యాలయం వద్ద చోటుచేసుకుంది.