అలిపిరిలో మారణాయుధం స్వాధీనం
- చెక్‌పాయింట్ వద్ద కారులో పిస్టల్, బుల్లెట్లు లభ్యం
- పోలీసుల అదుపులో నలుగురు పుణే వాసులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల కొండకు వెళ్లే వాహనాల తనిఖీ కోసం ఏర్పాటు చేసిన అలిపిరి చెక్ పాయింట్ వద్ద పిస్టల్, బుల్లెట్లు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. చెక్ పాయింట్ వద్ద బుధవారం ఉదయం విజిలెన్స్ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రావు, కానిస్టేబుల్ మౌలాలీ పుణేకి చెందిన ఓ నల్లరంగు కారును ఆపి తనిఖీ చేశారు. అందులో ఉన్న 14 రౌండ్ల బుల్లెట్లు, ఐఎన్ మోడల్ గ్లాక్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకు న్నారు. కారులో ప్రయాణిస్తున్న సౌరభ్ అనే యువకుడిని, మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఆయుధం గురించి ప్రశ్నించారు. పిస్టల్ తనది కాదని, కారు యజమాని విజయ్ మాణేది అని సమాధానమిచ్చారు.
లైసెన్స్‌ను పరిశీలించిన పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అది ఒరిజినల్ లైసెన్స్ కాదన్న అనుమానంతో పూర్తి వివరాలను సేకరించారు. ఒకవేళ ఒరిజినల్ లైసెన్స్ అయినప్పటికీ అది జారీ చేసిన రాష్ట్రం దాటి ఆయుధాలను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడం నేరం. దీన్ని గుర్తించిన పోలీసులు వెంటనే వారిని తిరుమలకు తీసుకెళ్లి విచారణ జరిపారు. మెట్ల మార్గంలో కొండపైకి చేరిన విజయ్ మాణేను తిరుమలలో పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
గంజాయి, మద్యం
సీసాలు లభ్యం: ఇదిలా ఉండగా బుధవారం అలిపిరి వద్ద తనిఖీల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బబ్లూ, బీరాన్ అనే ఇద్దరు వ్యక్తుల నుంచి 60 గ్రాముల గంజాయి, 9 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 100 గుట్కా ప్యాకెట్లు, 30 బీడీ కట్టలను కూడా గుర్తించినట్లు తెలిపారు.