రాయలసీమపై చంద్రబాబు కపట ప్రేమ
- కృష్ణా జలాలు రాయలసీమకుఎలా ఇస్తారు!
- చంద్రబాబు హామీలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు
- వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
మంగళం(తిరుపతి) : రాయలసీమ వాసులకు కృష్ణా, గోదావరి నుంచి వెయ్యి టీఎంసీల నీటిని అందిస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తుత్తి హామీలు ఇస్తూ రాయలసీమ ప్రజలపై కపట ప్రేమ ప్రద ర్శిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. తిరుపతిలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించాలన్న లక్ష్యంతో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోలవరం, హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టుల నిర్మాణాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కేవలం పదిహేను వందల కోట్లు ఖర్చు పెడితే చాలని, తద్వారా రాష్ట్ర ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీరు, సాగునీరు అందించవచ్చునని తెలిపారు. అయితే వాటిని పక్కన పెట్టి కమీషన్ల రూపంలో కోట్లు దండుకోవడానికి పట్టిసీమను నిర్మించేందుకు పూనుకోవడం దారుణమన్నారు. సంవత్సరంలో పూర్తి అయ్యే ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టడం దారుణమన్నారు.
ఆర్టీసీ సమ్మెకు వైఎస్ఆర్సీపీ మద్దతు
సమాజంలో సమ్మె చేసే హక్కు ప్రతి కార్మికుడికి ఉందని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిం చాలంటూ ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ఎ మ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. డిమాం డ్లను పరిష్కరించేందుకు సామరస్యంగా చర్చించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు వారిపై లాఠీచార్జ్ చేయించడం దారుణమన్నారు. రియల్ ఎస్టేట్ వ్యా పారిగా, కమీషన్లు పొందే దళారిగా మారి కోట్లు గడించేందుకు చూస్తున్నాడే తప్ప ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజలకు అం డగా వైఎస్ఆర్సీపి ఉంటుందని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ఉద్యమ, పోరాటాలు తప్పవని హెచ్చరించారు.
ఊహల్లో విహరిస్తున్న సీఎం
పీలేరు:ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను విస్మరించి ముఖ్యమంత్రి ఇంకా ఊహల్లో విహరిస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆయన పీలేరు ఏటీ.ఎర్రంరెడ్డి మిషన్‌లో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాబు మాయమాటలు నమ్మి ప్రజలు పట్టంకట్టారని, అయితే అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి జనం ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రైతులతోపాటు అక్కచెల్లెమ్మలను మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పుడేమో మళ్లీ డ్వాక్రా రుణాలు మాఫీ అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారని విమర్శించారు.
చంద్రబాబు పుంగనూరుకు హంద్రీనీవా నీరు తెప్పించడం మాని, కనీసం కుప్పంకైనా నీటిని తరలిస్తారా? అంటూ ప్రశ్నించారు. తాము పాద యాత్ర చేసినపుడు ఆరుబైటే పడుకునేవారమని, ఇప్పుడు సీఎం ఏమో ఏసీ బస్సుల్లో పడుకుంటూ ప్రజలను మరోరకంగా మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో మండల పార్టీ కన్వీనర్ నారే వెంకట్రమణారెడ్డి, పీలేరు ఎంపీపీ కే.మహితాఆనంద్, జెడ్పీటీసీలు ఎం.రెడ్డిబాష, జీ.జయరామచంద్రయ్య, కోఆప్షన్ సభ్యుడు ఎస్.హబీబ్‌బాష, పార్టీ నాయకులు భవనం వెంటక్రమణారెడ్డి, మహ్మద్‌షఫీ, జగన్మోహన్రెడ్డి, వీపీ.రమేష్, ఎస్.గౌస్‌బాష, కేశవరెడ్డి, భాస్కర్‌రెడ్డి, చక్రధర్, స్టాంపుల మస్తాన్, పెద్దోడు, యర్రంరెడ్డి, ఉదయ్, కుమార్ పాల్గొన్నారు.