సీటీఎల్ చాంప్ పంజాబ్ మార్షల్స్
- ఫైనల్లో హైదరాబాద్ ఏసెస్‌కు నిరాశ
సాక్షి, హైదరాబాద్: చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్) రెండో సీజన్లో పంజాబ్ మార్షల్స్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం ఇక్కడి ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో పంజాబ్ 5-4, 5-4, 2-5, 5-4, 5-4 (22-21 గేమ్‌ల) తేడాతో హైదరాబాద్ ఏసెస్‌పై విజయం సాధించింది. ఈ ఏడాది పంజాబ్ అజేయంగా నిలువడం విశేషం. ముందుగా లెజెండ్స్ మ్యాచ్‌లో గ్రెగ్ రుసెద్‌స్కీ 5-4తో థామస్ జొహన్సన్ను ఓడించి పంజాబ్‌కు ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత మహిళల సింగిల్స్‌లో ఎలీనా స్వితోలినా 5-4తో మార్టినా హింగిస్‌ను ఓడించింది.
మిక్స్డ్ డబుల్స్‌లో ఏసెస్ జోడి హింగిస్-కార్లోవిచ్ 5-2తో స్వితోలినా-బాగ్దాటిస్పై గెలిచి ఆధిక్యాన్ని 2-1కి తగ్గించారు. అయితే పురుషుల డబుల్స్‌లో మార్షల్స్ ద్వయం బాగ్దాటిస్-సాకేత్ మైనేని 5-4తో కార్లోవిచ్-జీవన్ జంటను చిత్తు చేశారు. అనంతరం టోర్నీ చివరి మ్యాచ్ పురుషుల సింగిల్స్‌లో బాగ్దాటిస్ 5-4తో కార్లోవిచ్‌ను ఓడించి పంజాబ్‌కు విజయం ఖాయం చేశాడు. హింగిస్‌కు మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్, సాకేత్‌కు బెస్ట్ ఇండియన్ ప్లేయర్ అవార్డు దక్కాయి. విజేత పంజాబ్ జట్టుకు రూ. కోటి, రన్నరప్ హైదరాబాద్ ఏసెస్‌కు రూ. 50 లక్షలు ప్రైజ్‌మనీగా లభించింది.