నేటి నుంచి ఉల్లి కొనుగోళ్లు బంద్
– సంచులు మార్చడంలో మొండికేసిన హమాలీలు
– బస్తాకు ఆదనంగా రూ.1.50 చెల్లించాలని డిమాండ్
కర్నూలు(అగ్రికల్చర్):
కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం నుంచి ఉల్లి క్రయ,విక్రయాలు బంద్ కానున్నాయి. హమాలీల సమస్య కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. సమస్య పరిష్కారం అయ్యే వరకు మార్కెట్లో ఉల్లి కొనుగోళ్లు జరుగవని మార్కెట్ కమిటీ అధికారులు ప్రకటించారు. సంచుల్లోనే ఉల్లి కొనుగోలు చేపట్టడం వల్ల హమాలీల సమస్య ఉత్పన్నమైంది. రైతులు తెచ్చిన బస్తాల్లోంచి మూడు,నాలుగు బస్తాలను కిందపోసి వాటి ఆధారంగా కొనుగోలు చేస్తారు. కొనుగోలు తర్వాత రైతులు తెచ్చిన బస్తాల్లోంచి ఉల్లిని కొనుగోలుదారు బస్తాల్లోకి మార్చి కాటా వేయాల్సిఉంది. రైతులు తెచ్చిన ఉల్లిని కొనుగోలు దారు బస్తాల్లోకి మార్చడం మా పని కాదంటే...మా పని కాదని కోత, పట్టుడు హమాలీలు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. దీంతో బుధవారం ఉల్లికొనుగోళ్లు జరగలేదు. అయితే గురువారం హమాలీలను ఒప్పించి కొంతవరకు ఉల్లికొనిపించారు. హమాలీలతో రాత్రి వరకు చర్చలు జరిగాయి. బస్తాకు రూ. 1.50 అదనంగా చెల్లిస్తే సంచులు మార్చడానికి సిద్ధమని హమాలీలు చెబుతున్నారు. దీన్ని భరించలేమని చెగుతున్న కొనుగోలుదారులు ఆ భారాన్ని రైతులపై వేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు మార్కెట్కు ఉల్లి తీసుకరాకూడదని అధికారులు రైతులకు సూచించారు.