purohit priest
-
ఫేస్బుక్ చాటింగ్ ప్రాణం తీసింది!
కృష్ణలంక (విజయవాడ తూర్పు) : ఫేస్బుక్ పరిచయం ఓ నిండు ప్రాణాన్ని బలికొనగా.. భార్య బిడ్డలను అనాథలను చేసింది. వివరాల్లోకి వెళితే..కృష్ణలంక మెట్లబజార్‌కు చెందిన లంక రామాంజనేయులుశర్మ(35) పౌరోహిత్యం చేస్తుంటాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అతనికి బాలాజీనగర్‌కు చెందిన ఒక వివాహితతో ఫేస్బుక్లో పరిచయం అవ్వడంతో.. చాటింగ్ చేసుకుంటూ.. ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లో ఎలాక్ట్రానిక్ షాపు నిర్వహిస్తున్న వివాహిత భర్త సాయిశ్రీనివాస్‌కు తన భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో ఫోన్‌ను పరిశీలించి రామాంజేయులుశర్మతో చాటింగ్ చేస్తున్నట్లు నిర్ధారించుకున్నాడు. దీంతో అతను రామాంజనేయులుశర్మను ఎలాగైనా మట్టుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 15వతేదీన అతనికి ఫోన్‌చేసి గవర్నరుపేటలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లోని తన షాపునకు రావాలని పిలవడంతో రామాంజేనేయులు శర్మ వెళ్లాడు. అప్పటికే అక్కడ సెల్లారులో తన ఐదుగురు స్నేహితులతో కలసి సాయిశ్రీనివాస్ ఇష్టానుసారం కొట్టసాగాడు. దీంతో చుట్టుపక్కల వారు అడ్డుకోవడంతో స్నేహితుల మధ్య చిన్న గొడవ అని చెప్పి ద్విచక్రవాహనంపై రామాంజనేయులుశర్మను ఎక్కించుకుని తేలప్రోలు పరిసరాల్లోని పంటపోలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడే వారు మద్యం సేవించి అతన్ని ఇష్టానుసారంగా కొట్టారు. వారి దెబ్బలకు స్పృహ తప్పడంతో అక్కడ నుంచి వారు ద్విచక్ర వాహనంపై అతన్ని తీసుకుని విజయవాడ వైపు వస్తుండగా.. గన్నవరం బిస్మిల్లా హోటల్ సమీపంలోకి రాగానే రామాంజనేయులుశర్మ మృతిచెందినట్లు గమనించి రోడ్డుపక్కన పడేసి 108కి ఫోన్‌చేసి పరారాయ్యారు. దీంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. పక్కన ఎవరూ లేకపోవడంతో 108 సిబ్బంది సైతం వెళ్లిపోయారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు ఈ నెల 16న గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా ఈ నెల 15వతేదీ మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భర్త కనిపించడం లేదని భార్య స్వరూప కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గన్నవరంలో మృతిచెందిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం.. అదృశ్యమైన రామాంజనేయులు శర్మదేనని నిర్ధారించుకుని విచారణ చేపట్టారు. మృతుడి కాల్‌డేటాలో సాయిశ్రీనివాస్‌తో చివరిసారిగా మాట్లాడినట్లు ఉండడంతో అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా హత్య తామే చేసినట్లు అంగీకరించాడు. హత్యకు సహకరించిన స్నేహితులు ఎన్టీఆర్, మున్నా, సాయి, ఫరూక్, సతీష్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
పౌరోహిత్యంలో రాణిస్తున్న లక్ష్మి
పరిగి: ఆమె పేరు తిరుపతిగారి లక్ష్మిఆర్య.. పుట్టింది మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండలం ఎదిరె గ్రామం. నాలుగో తరగతి వరకు అక్కడే చదువుకుంది. తన మామగారైన మర్రి కృష్ణారెడ్డి ప్రోత్బలంతో సంస్కృతంపై మక్కువ పెంచుకుంది. ఐదో తరగతి మొదలుకుని పీజీ వరకు కాశిబెనారస్ విశ్వవిద్యాలయంలో సంస్కృతంలో చదువుకుంది. అనంతరం ఎంఈడీ, ఎంఫిల్ పూర్తి చేసి ప్రస్తుతం తిరుపతి సంస్కృత విద్యాపీఠ్‌లో పీహెచ్డీ చేస్తోంది. ఈ క్రమంలోనే వేదాలు..ఉపనిషత్తులు, పౌరోహిత్య గ్రంథాలను ఒంటబట్టించుకున్న ఆమె ప్రస్తుతం తీరిక సమయంలో పౌరోహిత్యం కూడా చేస్తోంది. అవలీలగా యజ్ఞాలు, యాగాలు, హోమాలు, వ్రతాలు, పెళ్లిళ్లు కూడా జరిపిస్తూ ఔరా అనిపిస్తోంది. ఆమె భర్త ప్రభాకర్‌రెడ్డి వృత్తిరీత్యా సంస్కృత అధ్యాపకునిగా పని చేస్తూ ఆమెకు తోడ్పాటునందిస్తున్నాడు. ఈ కుటుంబం కొన్నేళ్ల క్రితమే పరిగిలో స్థిరపడింది. కొనసాగిస్తా.. మహిళలకూ వేదం చదివే హక్కు, అధికారం ఉన్నాయి. ఈ విషయం వేదాల్లోనే రాసి ఉంది. పీహెచ్డీ పూర్తి చేశాక ఏ ఉద్యోగంలో స్థిరపడినా.. ప్రవృత్తిగా పౌరోహిత్యం కొనసాగించాలనుకుంటున్నాను. ఇప్పటికే ప్రభుత్వం కోరిక మేరకు ఏషియా వీక్ కార్యక్రమంలో భాగంగా 45 రోజులపాటు జర్మనీ, పోలాండ్ తదితర దేశాలు పర్యటించాను. మంగళచ్చరణ, వేదపఠనం తదితర కార్యక్రమాల్లో దేశం తరపున పాల్గొన్నాను. - తిరుపతిగారి లక్ష్మి ఆర్య ప్రభాకర్‌రెడ్డి..