పౌరోహిత్యంలో రాణిస్తున్న లక్ష్మి
పరిగి: ఆమె పేరు తిరుపతిగారి లక్ష్మిఆర్య.. పుట్టింది మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండలం ఎదిరె గ్రామం. నాలుగో తరగతి వరకు అక్కడే చదువుకుంది. తన మామగారైన మర్రి కృష్ణారెడ్డి ప్రోత్బలంతో సంస్కృతంపై మక్కువ పెంచుకుంది. ఐదో తరగతి మొదలుకుని పీజీ వరకు కాశిబెనారస్ విశ్వవిద్యాలయంలో సంస్కృతంలో చదువుకుంది. అనంతరం ఎంఈడీ, ఎంఫిల్ పూర్తి చేసి ప్రస్తుతం తిరుపతి సంస్కృత విద్యాపీఠ్‌లో పీహెచ్‌డీ చేస్తోంది. ఈ క్రమంలోనే వేదాలు..ఉపనిషత్తులు, పౌరోహిత్య గ్రంథాలను ఒంటబట్టించుకున్న ఆమె ప్రస్తుతం తీరిక సమయంలో పౌరోహిత్యం కూడా చేస్తోంది. అవలీలగా యజ్ఞాలు, యాగాలు, హోమాలు, వ్రతాలు, పెళ్లిళ్లు కూడా జరిపిస్తూ ఔరా అనిపిస్తోంది. ఆమె భర్త ప్రభాకర్‌రెడ్డి వృత్తిరీత్యా సంస్కృత అధ్యాపకునిగా పని చేస్తూ ఆమెకు తోడ్పాటునందిస్తున్నాడు. ఈ కుటుంబం కొన్నేళ్ల క్రితమే పరిగిలో స్థిరపడింది.
కొనసాగిస్తా..
మహిళలకూ వేదం చదివే హక్కు, అధికారం ఉన్నాయి. ఈ విషయం వేదాల్లోనే రాసి ఉంది. పీహెచ్‌డీ పూర్తి చేశాక ఏ ఉద్యోగంలో స్థిరపడినా.. ప్రవృత్తిగా పౌరోహిత్యం కొనసాగించాలనుకుంటున్నాను. ఇప్పటికే ప్రభుత్వం కోరిక మేరకు ఏషియా వీక్ కార్యక్రమంలో భాగంగా 45 రోజులపాటు జర్మనీ, పోలాండ్ తదితర దేశాలు పర్యటించాను. మంగళచ్చరణ, వేదపఠనం తదితర కార్యక్రమాల్లో దేశం తరపున పాల్గొన్నాను. - తిరుపతిగారి లక్ష్మి ఆర్య ప్రభాకర్‌రెడ్డి..