కొల్లాంలో మళ్లీ కలకలం
కొల్లాం: పుట్టింగళ్ ఆలయంలో చోటుచేసుకున్న పెను విషాదం నుంచి కోలుకోకముందే కొల్లాంలో మళ్లీ కలకలం చెలరేగింది. బాణాసంచా పేలి 106 మంది ప్రాణాలు కోల్పోయిన కాళికాదేవి ఆలయానికి అతి సమీపంలో మూడు గుర్తుతెలియని కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి నిండా భారీగా పేలుడు పదార్థాలు నింపిఉండటంతో అధికారులతోపాటు ప్రజల్లోనూ కలవరం మొదలైంది. ఈ కార్లు ఎవరివి? పేలుడు పదార్థాల ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? వాటిని ఆలయంలో జరిగే వేడుకల కోసం తెచ్చారా? లేక సంఘవిద్రోహుల పనా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ కొల్లాంకు వచ్చినప్పుడు కూడా ఆ కార్లు అక్కడే ఉన్నాయా? లేక ఆ తరువాత తీసుకొచ్చి నిలిపారా అనే విషయాలు కూడా ఇంకా వెల్లడికావాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కార్లలోని పేలుడు పదార్థాలను జాగ్రత్తగా వెలికి తీసేప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున బాణాసంచా కాల్చే వేడుకలో చెలరేగిన భారీ పేలుడు కారణంగా 106 మంది మరణించిన సంగతి తెలిసిందే. దాదాపు 400 మంది క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పేలుడు సమయంలో ఆలయంలో 15 వేల మంది భక్తులు ఉన్నారు.
ఇదిలా ఉంటే కేరళలోని అన్ని ఆలయాల్లో బాణాసంచా కాల్చడాన్నినిషేధించాలంటూ ఆందోళనలు మిన్నంటాయి. ఇప్పటికే దీనిపై పలువురు సామాజిక వేత్తలు, సంస్థలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఆలయాల్లో పటాకులను నిషేధించే విషయమై రేపు(మంగళవారం) కేరళ హైకోర్టులో వాదనలు ప్రారంభంకానున్నాయి. మరోవైపు ఆలయాల ధర్మకర్తల మండళ్లు మాత్రం పటాకుల వేడుకలను ఆపేదిలేదని ప్రకటించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాల్లో టపాకాయలు పేల్చడం ఏళ్లుగా వస్తోన్ ఆచారమని, ఎట్టిపరిస్థితుల్లో ఆపబోమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రేపటి విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది.