pv narsimha rao veterinary university
-
ఆవుకు ‘డిజిటల్’ కృత్రిమ గర్భధారణ
సాక్షి, హైదరాబాద్: పశువుల కృత్రిమ గర్భధారణ విధానంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పశువైద్య నిపుణులు ముందడుగు వేశారు. ఇప్పటివరకు నాటు పద్ధతిలో (జననాంగంలోకి చేయి పెట్టడం ద్వారా) జరుపుతున్న ఈ ప్రక్రియను తొలిసారి డిజిటల్ పద్ధతిలో నిర్వహించారు. ఇందుకు పీవీ నరసింహా రావు పశువైద్య విశ్వవిద్యాలయం వేదిక అయింది. ఈ ప్రయోగంలో భాగంగా లేజర్ కిరణాలతో కూడిన ఎండోస్కోపీ ట్యూబ్ ఇచ్చే డిస్ప్లే సమా చారం ఆధారంగా వీర్యాన్ని ఓ ఆవు గర్భాశయంలోకి పంపారు. ఎండోస్కోపీ ట్యూబ్‌తోపాటు వచ్చే పెన్‌డ్రైవ్‌ను కాలర్ హ్యాంగింగ్ మొబైల్ ఫోన్‌కు అటాచ్ చేయడం ద్వారా గర్భాశయ ముఖద్వారం, వీర్యం వెళుతున్న విధానం కనిపించేలా ఏర్పాట్లు చేసుకొని ఈ ప్రయోగం నిర్వహించారు. అలా పంపిన వీర్యం పూర్తిస్థాయిలో పశువు గర్భాశయం లోకి వెళ్లినట్లు నిర్ధారణ అయింది. ఈ ప్రయోగంలో పశువైద్య విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాంసింగ్ లకావత్‌తోపాటు ఇంటర్న్‌షిప్, ఫైనలియర్ విద్యార్థులు పాల్గొన్నారు. సర్జరీ విభాగం హెచ్‌వోడీ ప్రొఫెసర్ ఇ.ఎల్. చంద్రశేఖర్ సమక్షంలో ఈ ప్రయోగం నిర్వహించారు. నాటు పద్ధతి వల్ల 30–40% ఫలదీకరణే జరుగుతుండగా డిజిటల్ గర్భధారణ విధానంలో 60–70 శాతం వరకు ఫలదీకరణ అవకాశం ఉందని పశువైద్య నిపుణులంటున్నారు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ విధానం అమలవుతోందని పేర్కొన్నారు. -
మూలకణ చికిత్సపై పరిశోధనలు చేయాలి
రాజేంద్రనగర్: పశువులు, పెంపుడు జంతువులలో మూలకణ చికిత్స, క్యాన్సర్, లేజర్ సర్జరీ, ఆక్యుపంక్చర్ విధానాలపై పరిశోధనలు జరగాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. సాధారణ డాక్టర్లు మనుషులకు వైద్యం అందిస్తారని, పశువైద్యులు మాత్రం మూగ జీవాలకు వైద్యం అందిస్తారని, ఇది ఎంతో కఠినమైనదన్నారు. పీవీ నర్సింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం రెండవ స్నాతకోత్సవాన్ని శుక్రవారం రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో పాటు రాజస్తాన్ పశువైద్య విశ్వవిద్యాలయ మాజీ వీసీ ప్రొఫెసర్ ఎ.కె.గెహ్లాట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ.. పశు వైద్య పట్టాలు అందుకున్న వారంతా గ్రామాలకు వెళ్లి విస్తృతంగా సేవలు అందించాలని సూచించారు. శ్రీకృష్ణుడు పశువులతో ఉండేవాడని, ఏసు ప్రభువు గొర్రెల కాపరని గుర్తుచేశారు. పశువుల పేడతో వాకిట్లో కల్లాపి చల్లితే వైరస్, బ్యాక్టీరియా నశిస్తుందని గుర్తుచేశారు. ప్రొఫెసర్ ఎ.కె.గెహ్లాట్ మాట్లాడుతూ.. ఇటీవల హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ దిశ ఆత్మకు శాంతి కలగాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పతకాల ప్రదానం జరిగింది. బోధన, పరిశోధన, విస్తరణ రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన డాక్టర్ అరుణకుమారికి మెరిటోరియస్ టీచర్ అవార్డు అందజేశారు. -
పశువైద్య కళాశాలకు గ్రీన్‌సిగ్నల్
మామునూరులో ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి ఎఫెక్ట్ సాక్షి, హన్మకొండ : వరంగల్‌లో పశువైద్య కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కాలేజీ ఏర్పాటుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా పీవీ నర్సింహరావు వెటర్నరీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు సూచించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హన్మకొండ మండలం మామూనూరు సమీపంలో వెటర్నరీ కాలేజీని ఈ విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేయనున్నారు. నిర్వాహణ కోసం 87 మంది టీచింగ్ స్టాఫ్, 205 మంది నాన్ టీచింగ్ స్టాఫ్‌తో పాటు రూ.208 కోట్లు కేటాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. సిబ్బంది, నిధులకు సంబంధించి త్వరలో నిర్ణయం వెలువరిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. వరంగల్ నగరాన్నిSఎడ్యుకేషన్ హబ్‌గా మార్చుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందులో భాగంగా వరంగల్ నగరంలో పశు వైద్య కళాశాలను నెలకొల్పుతామన్నారు. ఇచ్చిన హామీకి తగ్గట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మామునూరు సమీపంలో ఉన్న పశు పరిశోధన క్షేత్రం ప్రాంగణంలో వెటర్నరీ కాలేజీని నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఇక్కడ 128 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే గుర్తించారు.