రాజేంద్రనగర్: పశువులు, పెంపుడు జంతువులలో మూలకణ చికిత్స, క్యాన్సర్, లేజర్ సర్జరీ, ఆక్యుపంక్చర్ విధానాలపై పరిశోధనలు జరగాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. సాధారణ డాక్టర్లు మనుషులకు వైద్యం అందిస్తారని, పశువైద్యులు మాత్రం మూగ జీవాలకు వైద్యం అందిస్తారని, ఇది ఎంతో కఠినమైనదన్నారు. పీవీ నర్సింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం రెండవ స్నాతకోత్సవాన్ని శుక్రవారం రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో పాటు రాజస్తాన్ పశువైద్య విశ్వవిద్యాలయ మాజీ వీసీ ప్రొఫెసర్ ఎ.కె.గెహ్లాట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ.. పశు వైద్య పట్టాలు అందుకున్న వారంతా గ్రామాలకు వెళ్లి విస్తృతంగా సేవలు అందించాలని సూచించారు. శ్రీకృష్ణుడు పశువులతో ఉండేవాడని, ఏసు ప్రభువు గొర్రెల కాపరని గుర్తుచేశారు. పశువుల పేడతో వాకిట్లో కల్లాపి చల్లితే వైరస్, బ్యాక్టీరియా నశిస్తుందని గుర్తుచేశారు. ప్రొఫెసర్ ఎ.కె.గెహ్లాట్ మాట్లాడుతూ.. ఇటీవల హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ దిశ ఆత్మకు శాంతి కలగాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పతకాల ప్రదానం జరిగింది. బోధన, పరిశోధన, విస్తరణ రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన డాక్టర్ అరుణకుమారికి మెరిటోరియస్ టీచర్ అవార్డు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment