PV sriramamurthy
-
‘ఎరువుల దుకాణాల్లో బయోమెట్రిక్ తప్పనిసరి’
అనంతపురం అగ్రికల్చర్ : ఎరువుల దుకాణాల్లో బయోమెట్రిక్ మిషన్లు, స్వైపింగ్ యంత్రాలు తప్పనిసరిగా అందుబాటులో పెట్టుకోవాలని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి ఆదేశించారు. ఈమేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూలై నుంచి డైరెక్ట్ టు బెనిఫిషర్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానం అమలులోకి వస్తుండటంతో కొత్త పద్ధతిలో ఎరువుల అమ్మకాలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. మొదట ఎరువులు తర్వాత విత్తనాలు, పురుగు మందులు, ఇతరత్రా ఇన్పుట్స్ అమ్మకాలు ఉంటాయన్నారు. ప్రస్తుతానికి ఎరువులు డీబీటీ పద్ధతిలో విక్రయించాల్సి ఉండటంతో బయోమెట్రిక్, స్వైపింగ్ పరికరాలు మూడు రోజుల్లోగా ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఆదేశించారు. రైతు ఆధార్ నెంబర్ ఆధారంగా ఎరువుల పంపిణీ ఉంటుందన్నారు. -
అన్ని మండలాల్లో సూక్ష్మపోషకాలు
అనంతపురం అగ్రికల్చర్ : అన్ని మండలాల్లో సూక్ష్మపోషకాల (మైక్రో న్యూట్రియంట్స్) ఎరువులు నిల్వ ఉన్నందున ఏవోలను సంప్రదించి వాటిని రాయితీతో తీసుకోవాలని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి తెలిపారు. ప్రస్తుత 2017–18 సంవత్సరంలో ఖరీఫ్, రబీ పంట కాలానికి జిల్లాకు 25 వేల టన్నుల జిప్సం, 826 టన్నుల జింక్‌సల్ఫేట్, 138 టన్నుల బోరాన్ కేటాయించారన్నారు. 50 శాతం రాయితీ వర్తింపజేస్తూ టన్ను జిప్సంకు రైతు వాటాగా రూ.1,918 ప్రకారం, క్వింటా జింక్ సల్ఫేట్కు రూ.1,925 ప్రకారం, కిలో బోరాన్‌కు రూ.45 ప్రకారం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. జిప్సం, జింక్ సల్ఫేట్, బోరాన్ లాంటి సూక్ష్మపోషకాల విలువ తెలుసుకుని వేరుశనగ పంటలో వాడితే ప్రయోజనాలు పొందవచ్చన్నారు. భూసార పరీక్షల ఫలితాలను బట్టి సిఫారసు మేరకు వీటిని పంటలకు వేస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు. ప్రధానంగా పూత దశలో ఎకరా వేరుశనగకు 200 కిలోలు జిప్సం వేయడం వల్ల అధిక దిగుబడులు తప్పకుండా ఉంటాయన్నారు. -
నాణ్యత కొరవడితే క్రిమినల్ చర్యలు
► విత్తన పంపిణీ డీలర్లు, దుకాణదారులను హెచ్చరించిన జేడీఏ ► అన్ని వివరాలతో బిల్లులు తీసుకోవాలని రైతులకు సూచన అనంతపురం అగ్రికల్చర్ : విత్తన చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నాణ్యమైన విత్తనాలు అందుబాటులో పెట్టాలని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి, ఉద్యానశాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు విత్తన పంపిణీ డీలర్లు, దుకాణదారులను ఆదేశించారు. నాసిరకం, కల్తీలు అంటగట్టినట్లు రైతుల నుంచి ఫిర్యాదుల వస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖరీఫ్ సమీపిస్తుండటంతో విత్తన డీలర్లు, దుకాణాదారులతో బుధవారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జేడీఏ, డీడీఏలు మాట్లాడుతూ ఖరీఫ్‌లో రైతులకు అవసరమైన బీటీ పత్తి, నాన్ బీటీ పత్తి, ఆముదం, కందులు, పెసలు, పొద్దుతిరుగుడు, అలసంద, కొర్ర, జొన్న, మొక్కజొన్న, సజ్జ తదితర వ్యవసాయ పంటల విత్తనాలతోపాటు కర్భూజ, కళింగర, దోస, వివిధ రకాల కూరగాయల విత్తనాలు ధృవీకరణ కలిగిన కంపెనీలవే అమ్మాలన్నారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తారని, నిబంధనలకు విరుద్ధంగా పేరూ ఊరు లేని కంపెనీల విత్తనాలను రైతులకు ఇస్తే చర్యలు తప్పవన్నారు. విత్తన చట్టం కింద జరిమానాతోపాటు ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల జైలుశిక్ష కూడా ఉంటుందని హెచ్చరించారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించి కంపెనీ, లాట్, బ్యాచ్‌నెంబర్, గడువు తేదీ, చెల్లించిన డబ్బులకు సంబంధించి అన్ని వివరాలతో బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. దీంతోపాటు ఆ విత్తనాలను ఎలా సాగు చేయాలో వివరిస్తూ తెలుగులో ముద్రించిన కరపత్రం కూడా ఇవ్వాలని ఆదేశించారు. రైతులు కూడా అన్ని వివరాలతో బిల్లులు తీసుకుంటే భవిష్యత్తులో సమస్య వస్తే వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతోపాటు శాస్త్రవేత్తల ద్వారా పరిశీలించి నివేదిక తయారు చేయడం ద్వారా కంపెనీల నుంచి నష్టపరిహారం పొందే వీలుంటుందన్నారు. సమావేశంలో ఏడీఏ(పీపీ) విద్యావతి, సీడ్సెల్ ఏవో వెంకటేశ్వరప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ ఫల్గుణ పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయవిధానాలు ఆచరణలో రావాలి
అనంతపురం అగ్రికల్చర్ : పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రైతులు ఆచరించేలా చర్యలు తీసుకోవాలని జేసీ–2 ఖాజామొహిద్ధీన్, జేడీఏ పీవీ శ్రీరామమూర్తి ఆదేశించారు. స్థానిక టీటీడీసీ ఆవరణలోని సీఎల్ఆర్సీ హాలులో మంగళవారం జిల్లా స్థాయి ఎన్‌పీఎం శిక్షకులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు, తరచూ కరువు పరిస్థితులు ఏర్పడుతుండటంతో 'అనంత' లాంటి మెట్ట వ్యవసాయం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పెట్టుబడి లేని వ్యవసాయాన్ని (జెడ్బీఎన్ఎఫ్) విస్తృతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు రైతుల్లో చైతన్యం తీసుకురావడానికి శిక్షకులు, ఎన్‌పీఎం విభాగం సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఎన్‌పీఎం డీపీఎం రవీంద్రారెడ్డి, టెక్నికల్ ఏవో లక్ష్మానాయక్, ఎన్‌పీఎం క్లస్టర్ రీసోర్స్పర్సన్లు, ఎన్జీఓలు పాల్గొన్నారు. బుధ, గురువారం కూడా శిక్షణా కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. -
పక్కాగా ఈ–క్రాప్ బుకింగ్
అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్‌లో సాగైన పంటలకు సంబంధించి ఇప్పటికే చేసిన ఈ–క్రాప్ బుకింగ్ డేటాను మరోసారి పరిశీలించి పక్కాగా ఉండేలా చేసుకోవాలని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి ఆదేశించారు. గురువారం స్థానిక రైతు శిక్షణ కేంద్రంలో 11 వ్యవసాయ సబ్‌డివిజన్ ఏడీఏలు, డివిజన్‌కు ఇద్దరు చొప్పున ఏఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సిగ్నల్, ఇతరత్రా సాంకేతిక సమస్య కారణంగా ఈ–క్రాప్ బుకింగ్ డేటాలో పొరపాట్లు ఉంటే నాలుగు రోజుల్లోగా సవరించాలన్నారు. ప్రస్తుత రబీ పంటలకు కూడా తక్షణం బుకింగ్ చేపట్టాలని ఆదేశించారు. 2014 ఇన్‌పుట్‌సబ్సిడీకి సంబంధించి తలెత్తిన మిస్‌మ్యాచింగ్ జాబితాలను సాధ్యమైనంత తొందరగా సరిచేసి రైతులకు పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండో విడత రుణమాఫీకి సంబంధించి రుణ ఉపశమన పత్రాలు ఇంకా అక్కడక్కడ నిలిచిపోవడం, కొందరు రైతులకు అందలేదని వస్తున్న ఫిర్యాదులపై తక్షణం స్పందించి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఇకపోతే ఈ ఏడాది జిల్లాకు 67,500 మట్టి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా ఉండటంతో పక్కా ప్రణాళికతో ముందుకు పోవాలన్నారు. వచ్చే జూన్ ¯ðనెలాఖరులోగా మట్టి పరీక్షలను విశ్లేషించి వాటి ఫలితాలకు సంబంధించిన సాయిల్ హెల్త్‌కార్డులు రైతులకు అందజేయాలన్నారు. అగ్రానమీ డీడీఏ ఎం.క్రిష్ణమూర్తి, టెక్నికల్ ఏఓలు పాల్గొన్నారు. -
ఎరువుల అంగళ్లలో స్వైప్‌మిషన్లు తప్పనిసరి
– వ్యవసాయ శాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి అనంతపురం అగ్రికల్చర్ : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల డీలర్లు తప్పనిసరిగా స్వైప్‌మిషన్లు (పాయింట్ ఆఫ్ సేల్స్–పీవోఎస్) ఏర్పాటు చేసుకోవాలని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీఏ) పీవీ శ్రీరామమూర్తి ఆదేశించారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. త్వరితగతిన వాటిని ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఏవోలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. కరెంటు అకౌంట్లు కలిగిన బ్యాంకుల్లో రెండు రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇదిలావుండగా.. జేడీఏ ఆదేశాల మేరకు అనంతపురం రూరల్ వ్యవసాయాధికారి(ఏవో) జే.వాసుప్రకాష్ శనివారం నగరంలోని అన్ని దుకాణాలు తిరిగి స్వైప్మిషన్ల ఏర్పాటు, పనితీరు, సమస్యలపై డీలర్లకు వివరించారు. ఆధార్, పాన్, పిన్, అకౌంట్ నెంబర్ సమర్పించి తక్షణం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతరత్రా వాటిని రైతులకు అందజేయడానికి వీలుగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలన్నారు. కొన్ని రోజుల పాటు ఇబ్బందులు ఎదురైనా భవిష్యత్తులో డీలర్లకు, రైతులకు ఎలాంటి సమస్యా ఉండదన్నారు.