నాణ్యత కొరవడితే క్రిమినల్ చర్యలు
► విత్తన పంపిణీ డీలర్లు, దుకాణదారులను హెచ్చరించిన జేడీఏ
► అన్ని వివరాలతో బిల్లులు తీసుకోవాలని రైతులకు సూచన
అనంతపురం అగ్రికల్చర్ :
విత్తన చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నాణ్యమైన విత్తనాలు అందుబాటులో పెట్టాలని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి, ఉద్యానశాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు విత్తన పంపిణీ డీలర్లు, దుకాణదారులను ఆదేశించారు. నాసిరకం, కల్తీలు అంటగట్టినట్లు రైతుల నుంచి ఫిర్యాదుల వస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖరీఫ్ సమీపిస్తుండటంతో విత్తన డీలర్లు, దుకాణాదారులతో బుధవారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జేడీఏ, డీడీఏలు మాట్లాడుతూ ఖరీఫ్‌లో రైతులకు అవసరమైన బీటీ పత్తి, నాన్ బీటీ పత్తి, ఆముదం, కందులు, పెసలు, పొద్దుతిరుగుడు, అలసంద, కొర్ర, జొన్న, మొక్కజొన్న, సజ్జ తదితర వ్యవసాయ పంటల విత్తనాలతోపాటు కర్భూజ, కళింగర, దోస, వివిధ రకాల కూరగాయల విత్తనాలు ధృవీకరణ కలిగిన కంపెనీలవే అమ్మాలన్నారు.
వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తారని, నిబంధనలకు విరుద్ధంగా పేరూ ఊరు లేని కంపెనీల విత్తనాలను రైతులకు ఇస్తే చర్యలు తప్పవన్నారు. విత్తన చట్టం కింద జరిమానాతోపాటు ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల జైలుశిక్ష కూడా ఉంటుందని హెచ్చరించారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించి కంపెనీ, లాట్, బ్యాచ్‌నెంబర్, గడువు తేదీ, చెల్లించిన డబ్బులకు సంబంధించి అన్ని వివరాలతో బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. దీంతోపాటు ఆ విత్తనాలను ఎలా సాగు చేయాలో వివరిస్తూ తెలుగులో ముద్రించిన కరపత్రం కూడా ఇవ్వాలని ఆదేశించారు. రైతులు కూడా అన్ని వివరాలతో బిల్లులు తీసుకుంటే భవిష్యత్తులో సమస్య వస్తే వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతోపాటు శాస్త్రవేత్తల ద్వారా పరిశీలించి నివేదిక తయారు చేయడం ద్వారా కంపెనీల నుంచి నష్టపరిహారం పొందే వీలుంటుందన్నారు. సమావేశంలో ఏడీఏ(పీపీ) విద్యావతి, సీడ్‌సెల్ ఏవో వెంకటేశ్వరప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ ఫల్గుణ పాల్గొన్నారు.