దుబ్బాకలో అమ్మకానికి సిద్ధంగా విత్తనాలు
దుబ్బాక(సిద్ధిపేట జిల్లా): తొలకరి చినుకులు పలుకరించాయి. అన్నదాతలు వానాకాలం సాగుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆరుగాలం శ్రమకు ఫలితం దక్కాలంటే ఆది నుంచి వేసే పంట విషయంలో అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి. దుక్కి దున్నింది మొదలుకొని పంట చేతికొచ్చే వరకు జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ అంటున్నారు. ముఖ్యంగా విత్తనాలు, ఎరువుల కొనుగోలులో జాగ్రత్తలు పాటించడం అవసరం.
చదవండి: సికింద్రాబాద్ అల్లర్లు: ‘సాక్షి’ చేతిలో రిమాండ్ రిపోర్ట్.. కీలక అంశాలు వెలుగులోకి..
కొందరు డీలర్లు నకిలీ విత్తనాలను విక్రయిస్తూ ఏటా అన్నదాతలను నట్టేట ముంచుతున్నారు. వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. విత్తనాల ఎంపిక నుంచి పంట దిగుబడి వరకు శాస్త్రీయ సాగు పద్ధతులను అవలంభించడంతో పాటు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో ముందుకు సాగాలంటున్నారు. జిల్లాలో అధికారులు నకిలీ విత్తన విక్రయాలపై నిఘా పెంచారు. ప్రభుత్వం సైతం నకిలీ విత్తలనాలను విక్రయిస్తున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించింది. అయినా రైతుల అమాయకత్వాన్ని కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు.
విత్తనాల కొనుగోలుకు ముందు..
♦వ్యవసాయ శాఖ లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయాలి.
♦విత్తన ప్యాకెట్లు, బస్తాలపై పేరు, గడువు తేదీ వివరాలు తప్పకుండా గమనించాలి.
♦సరిగా సీల్ చేసి ఉన్న బస్తాలు, ధ్రువీకరణ పత్రం ఉన్న విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. రశీదు తీసుకోవాలి
♦రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత రశీదు తప్పకుండా తీసుకోవాలి. రశీదుపై విత్తన రకం, గడువు తేదీ, డీలర్ సంతకం తీసుకోవాలి. రైతు సంతకం కూడా ఉండేలా చూసుకోవాలి.
♦విత్తనాలను కొనుగోలు చేసేముందు వ్యవసాయ శాఖ అధికారి, శాస్త్ర వేత్తల సూచనలు తీసుకోవడం మంచిది.
♦రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ధ్రువీకరించిన విత్తనాలు విక్రయిస్తాయి. వీటిని కొనుగోలు చేసే సమయంలో బస్తా పై నీలి వర్ణం ట్యాగ్ ఉందో లేదో గమనించాలి.
♦లేబుల్ విత్తనాలు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. జిల్లాలో ఈ రకం విత్తనాలు అధికంగా కొనుగోలు చేస్తున్నారు. వీటి కొనుగోలు చేసే ముందు విత్తన సంచిపై ఆకుపచ్చ ♦ట్యాగ్ కట్టి ఉంటుంది. దీనిపై విత్తన ప్రమాణాలు ముద్రించి విక్రయిస్తారు. ఈ విత్త్తనాలను రైతులు కేవలం ఆయా కంపెనీల నమ్మకంపై మాత్రమే కొనుగోలు చేయాలి. పూర్తి వివరాలు తీసుకుని డీలర్ల నుంచి సరైన బిల్లు తీసుకోవాలి
♦బ్రిడిల్ విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు విత్తన సంచికి పసుపు రంగు ట్యాగ్ ఉందో లేదో గమనించాలి
♦ఎలాంటి విత్తనాలు కొనుగోలు చేసిన పంట సాగు వరకు రశీదులను రైతులు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఎరువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పంటల అధిక దిగుబడికి ఎరువులు ఎంతో మేలు చేస్తాయి. కానీ కొందరు దళారుల, వ్యాపారుల నాసి రకం ఎరువులు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. ఫలితంగా అమాయక రైతులు నష్టపోతున్నారు. ఈ మేరకు కొన్ని మెలకువలు పాటిస్తే నకిలీలను నివారించే అవకాశం ఉంది.
♦లైసెన్స్ ఉన్న దుకాణాల్లో మాత్రమే ఎరువులను కొనుగోలు చేయాలి.
♦కొనుగోలు చేసిన ఎరువులకు సరైన బిల్లును తీసుకోవాలి. వాటిని జాగ్రత్తగా దాచుకోవాలి.
♦డీలర్ బుక్‌లో రైతులు తప్పకుండా సంతకం చేయాలి.
కఠిన చర్యలు తీసుకుంటాం
జిల్లాలో ఎవరైన నకిలీ విత్తనాలను విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారి లైసెన్స్ రద్దు చేస్తాం. ఎక్కడైన నకిలీ విత్తనాలను విక్రయిస్తే రైతులు వెంటనే దగ్గరలో వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసిన రైతుల వివరాలు గోప్యంగా ఉంచుతాం.
– శివప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి
Comments
Please login to add a commentAdd a comment