– వ్యవసాయ శాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి
అనంతపురం అగ్రికల్చర్ : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల డీలర్లు తప్పనిసరిగా స్వైప్‌మిషన్లు (పాయింట్ ఆఫ్ సేల్స్–పీవోఎస్) ఏర్పాటు చేసుకోవాలని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీఏ) పీవీ శ్రీరామమూర్తి ఆదేశించారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. త్వరితగతిన వాటిని ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఏవోలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. కరెంటు అకౌంట్లు కలిగిన బ్యాంకుల్లో రెండు రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇదిలావుండగా.. జేడీఏ ఆదేశాల మేరకు అనంతపురం రూరల్ వ్యవసాయాధికారి(ఏవో) జే.వాసుప్రకాష్ శనివారం నగరంలోని అన్ని దుకాణాలు తిరిగి స్వైప్‌మిషన్ల ఏర్పాటు, పనితీరు, సమస్యలపై డీలర్లకు వివరించారు. ఆధార్, పాన్, పిన్, అకౌంట్ నెంబర్ సమర్పించి తక్షణం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతరత్రా వాటిని రైతులకు అందజేయడానికి వీలుగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలన్నారు. కొన్ని రోజుల పాటు ఇబ్బందులు ఎదురైనా భవిష్యత్తులో డీలర్లకు, రైతులకు ఎలాంటి సమస్యా ఉండదన్నారు.
ఎరువుల అంగళ్లలో స్వైప్‌మిషన్లు తప్పనిసరి
Published Sat, Nov 19 2016 11:44 PM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM
Advertisement