pyla narasimhaiah
-
‘జగన్ రియల్ హీరో.. పవన్ రీల్ హీరో’
సాక్షి, అనంతపురం : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రీల్ హీరో మాత్రమేనని, తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రియల్ హీరో అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నరసింహయ్య వ్యాఖ్యానించారు. ఆదివారం పామిడి వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌ను సీఎం చంద్రబాబు వదిలిన బాణంగా పేర్కొన్నారు. చంద్రబాబు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారని అన్నారు. పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే రాబోయే ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. -
పైలా నర్సింహయ్యకు వైద్య పరీక్షలు
అనంతపురం మెడికల్ : అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని ప్రిజెనర్ వార్డులో చికిత్స పొందుతున్న తాడిపత్రి నేత పైలా నర్సింహయ్యకు శుక్రవారం పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావుతో పాటు సర్జికల్ డాక్టర్లు వార్డుకు వెళ్లి పైలాకు పరీక్షలు జరిపారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, శనివారం ఎక్స్‌రే, ఎండోస్కోపి ఇతరత్రా పరీక్షలు చేయనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ తెలిపారు. కాగా మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు రెఫర్ చేసిన వైద్యులు.. ఆ తర్వాత పంపకుండా ఇక్కడే ఉంచడంపై పైలా ఆందోళన చెందుతున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి ఆయన ఆహారం తీసుకోవడం లేదు. శుక్రవారం ఉదయం కూడా ఆర్ఎంఓ లలిత పైలాను కలిసి ఆహారం తీసుకోవాలని సూచించారు. వైద్య సేవల్లో జరుగుతున్న జాప్యంపై పైలా కుటుంబీకులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించనున్నట్లు తెలిసింది. -
ఇలా ‘జేసి’రి!
దాడి కేసులో పైలా నరసింహయ్య లొంగుబాటు – అనారోగ్యంతో ఏడ్రోజులుగా సర్వజనాస్పత్రిలో చికిత్స – మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు రెఫర్ – ఓ పోలీస్ ద్వారా విషయం తెలుసుకున్న జేసీపీఆర్! – నిమ్స్‌కు పంపకుండా సూపరింటెండెంట్‌పై ఒత్తిడి? – ‘మరోసారి’ పరీక్షల పేరుతో ప్రాణంతో చెలగాటం – తనకు ప్రాణహాని ఉందంటూ ఆర్ఎంఓ ఎదుట పైలా కన్నీరు అనంతపురం మెడికల్ : తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సరికొత్త రాజకీయానికి తెరలేపారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగా వైద్యులను పావుగా వాడుకున్నారు. ఇందుకు అధికారులు కూడా తలూపడం విమర్శలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే.. పైలా నరసింహయ్య తాడిపత్రి నియోజకవర్గంలో కీలక నేత. గతంలో ప్రజారాజ్యం, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తర్వాత సీపీఐలో చేరిన ఆయన ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడు దీపక్‌రెడ్డికి పోటీగా నామినేషన్ కూడా వేశారు. ఈ క్రమంలో రాజకీయ ఒత్తిడి, ఇతర కారణాలతో విత్‌డ్రా చేసుకున్నారు. ముందు నుంచి జేసీ సోదరులకు, పైలా నరసింహయ్యకు మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గత నెల 15న జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయుడైన ఓ వ్యక్తిపై పైలా నర్సింహయ్య దాడి చేసినట్లు తాడిపత్రి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఈనెల 21న పైలా లొంగిపోయారు. అప్పటికే అనారోగ్యంగా ఉండడంతో కోర్టు ఆదేశాల మేరకు తాడిపత్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సౌకర్యాలు లేవన్న కారణంతో 22వ తేదీన అనంతపురం సర్వజనాస్పత్రిలోని ప్రిజనర్ వార్డుకు తీసుకొచ్చారు. వారం రోజుల పాటు పలు పరీక్షలు నిర్వహించారు. ఈయనకు గుండె స్పందన సరిగా లేకపోవడంతో పాటు అపెండిసైటిస్‌కు సంబంధించి తీవ్ర లక్షణాలున్నాయి. ఈ విషయాన్ని పైలాను పరీక్షించిన డాక్టర్ మహేష్ ధ్రువీకరించారు. దీంతో గురువారం ఆయన్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించాలని రాసిచ్చారు. సూపరింటెండెంట్‌కు జేసీపీఆర్ ఫోన్? పైలాను నిమ్స్‌కు తరలించాలని డాక్టర్ మహేశ్ రాసిచ్చిన లేఖను ఓ కానిస్టేబుల్ తన వాట్సప్ ద్వారా తాడిపత్రిలోని ఓ పోలీస్ ఉన్నతాధికారికి పంపినట్లు సమాచారం. ఆయన ద్వారా విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి వెంటనే సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్‌కు ఫోన్ చేసినట్లు తెలిసింది. దీంతో పైలాను నిమ్స్‌కు తరలించొద్దని ఆయన ఆదేశాలిచ్చారు. ఈ విషయం తెలియగానే పైలా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తనకు మెరుగైన వైద్యం అవసరమని చెప్పి ఇప్పుడు ఇలా చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆర్ఎంఓ ఎదుట పైలా కన్నీరు : ఆస్పత్రి అధికారుల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన పైలా నర్సింహయ్య మధ్యాహ్నం నుంచి ఆహారం తీసుకోలేదు. సాయంత్రం ఐదు గంటలకు ఆర్ఎంఓ లలిత, డిప్యూటీ ఆర్‌ఎంఓలు డాక్టర్ విజయమ్మ, జమాల్‌బాషాలు ప్రిజనర్ వార్డుకు చేరుకుని పైలాతో మాట్లాడారు. ఆహారం తీసుకోవాలని కోరగా ససేమిరా అన్నారు. ఓ వైపు తనకు అనారోగ్యంగా ఉన్నా ఎందుకు పంపించడం లేదని ప్రశ్నిస్తూ కన్నీరుమున్నీరయ్యారు. పక్కా ప్లాన్‌తోనే ఇలా చేస్తున్నారని, తనకు జేసీ ప్రభాకర్‌రెడ్డితో ప్రాణహాని ఉందని ఆరోపించారు. తనను ఇక్కడే ఉంచి ఏదో చేయాలని అనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ ఏమన్నారంటే.. ‘పైలా నర్సింహయ్య కడుపునొప్పితో అడ్మిట్ అయ్యారు. ఆయన్ను ఎవరూ నిమ్స్‌కు రెఫర్ చేయలేదు. లెటర్ కూడా ఇవ్వలేదు. రియల్‌గా ప్రాబ్లం ఉంటే పంపిస్తాం. నాకు ఎవరూ ఫోన్ చేయలేదు’ అని అన్నారు. దీంతో రెఫర్ చేసిన లెటర్ తన వద్ద ఉందని ‘సాక్షి’ ప్రస్తావించగా మాటమార్చారు. ‘పైలాను అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్షించారు. హెచ్ఓడీతో చూపించి డెసిషన్ తీసుకుంటాం. రేపు (శుక్రవారం) డిటైల్‌గా పరీక్ష చేస్తాం’ అని తెలిపారు. -
సీపీఐ ప్రాథమిక సభ్యత్వానికి పైలా రాజీనామా!
తాడిపత్రి రూరల్ : సీపీఐ నియోజకవర్గ ఇన్చార్జ్ పైలా నరసింహయ్య ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన సొంత నిర్ణయంతోనే నామినేషన్ వేశానని, పార్టీకి సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకే నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నట్లు తెలిపారు. పార్టీ ప్రమేయం లేకుండా నామినేషన్ వేయడం తప్పుగా భావించి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. -
ఏకగ్రీవమా? పోటీనా?
- స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ముగ్గురి నామినేషన్ - టీడీపీ తరఫున దీపక్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి - స్వతంత్ర అభ్యర్థిగా పైలా - పైలా నామినేషన్ ఉపసంహరించుకోకపోతే పోలింగ్ అనివార్యం అనంతపురం అర్బన్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని ఏకగ్రీవంగా దక్కించుకోవాలనుకున్న టీడీపీ ఆశలు అడియాసలయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా తాడిపత్రి పట్టణానికి చెందిన పైలా నరసింహయ్య నామినేషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. ఒకవేళ ఆయన నామినేషన్‌ను ఉపసంహరించుకోకపోతే పోటీ అనివార్యం కానుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ముగిసింది. చివరిరోజు టీడీపీ అభ్యర్థి గుణపాటి దీపక్‌రెడ్డి (మూడు సెట్లు), ఆయనకు సపోర్ట్‌గా ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు జూటూరు అస్మిత్‌రెడ్డి (ఒక సెట్టు) నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే పైలా నరసింహయ్య స్వతంత్ర అభ్యర్థిగా(రెండు సెట్లు) నామినేషన్ వేశారు. వీరు తమ నామినేషన్ పత్రాలను కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతంకు అందజేశారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు వైఎస్సార్సీపీ దూరంగా ఉంది. దీంతో ఎమ్మెల్సీ స్థానం ఏకగ్రీవంగా దక్కుతుందని టీడీపీ నాయకులు భావించారు. అయితే అనూహ్యంగా సీపీఐకి చెందిన పైలా నరసింహయ్య స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన ఫిబ్రవరి 21 నుంచి నుంచి 27వ తేదీ వరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. చివరిరోజు మాత్రం ముగ్గురు వేశారు. టీడీపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి ఒక్కరే నామినేషన్ వేసి ఉంటే ఎమ్మెల్సీ స్థానం ఏకగ్రీవమయ్యేది. పైలా కూడా నామినేషన్ వేయడంతో పోలింగ్ అనివార్యమయ్యేలా కన్పిస్తోంది. అయితే.. ఈ నెల మూడున నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంది. దీపక్‌రెడ్డికి సపోర్ట్‌గా వేసిన జూటూరు అస్మిత్‌రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకుంటారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఇక పైలా నరసింహయ్య తన నామినేషన్‌ను ఉపసంహరించుకోకపోతే టీడీపీ ‘ఏకగ్రీవ ఆశలు’ గల్లంతవుతాయి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగా – పైలా నరసింహయ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను విస్మరించి టీడీపీ సామాజిక న్యాయం పాటించడంలేదు. సరికదా ఎన్నికను ఏకగ్రీవం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని చూస్తోంది. ఇది జరగకూడదనే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశా. సామాజిక న్యాయాన్ని అనుసరించి టీడీపీ టికెట్ ఇచ్చి ఉంటే పోటీ చేసేవాడిని కాదు. తెలంగాణకు చెందిన దీపక్‌రెడ్డికి ఇక్కడ టికెట్ ఇవ్వడమేంటి? ఎన్నికల్లో పోటీ చేసేందుకు నా సమీకరణలు నాకున్నాయి. టీడీపీ అభ్యర్థిదే విజయం – మంత్రి కొల్లు రవీంద్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి విజయం సాధిస్తారని జిల్లా టీడీపీ ఇన్చార్జ్, మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దీపక్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఆయనతో పాటు మంత్రి పల్లెరఘునాథ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామినీబాల, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బి.కె.పార్థసారథి, జెడ్పీ చైర్మన్ చమన్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. నామినేషన్ ప్రక్రియ అనంతరం విలేకరులతో మంత్రులు, ఇతర నాయకులు, అభ్యర్థి మాట్లాడారు. స్థానిక సంస్థల్లో పూర్తి మెజారిటీ ఉన్న టీడీపీ ఈ ఎన్నికల్లో గెలుస్తుందన్నారు. ఏకగ్రీవ ఎన్నికకు అందరూ సహకరించాలని కోరారు. నేడు నామినేషన్ల పరిశీలన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన బుధవారం నిర్వహిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు మూడో తేదీ ఆఖరు. 17న పోలింగ్, 20వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఓటర్లుగా ఉంటారు. మునిసిపాలిటీల్లో ఎక్స్ అఫిషియో సభ్యులు కాని ఎమ్మెల్యేలకు మాత్రం ఓటు హక్కు ఉండదు. ఉరవకొండ, రాప్తాడు, పెనుకొండ, శింగనమల నియోజకవర్గాల పరిధిలో మునిసిపాలిటీలు లేనందున ఈ నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఓటు ఉండదు. ఈ ఎన్నికలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 1,278 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎంపీటీసీ సభ్యులు 832 మంది, జెడ్పీటీసీ సభ్యుడు 63 మంది, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు 367 మంది, ఎమ్మెల్యేలు 10 మంది, ఎమ్మెల్సీలు నలుగురు, ఇద్దరు ఎంపీలు ఓటర్లుగా ఉన్నారు.