
ఇలా ‘జేసి’రి!
దాడి కేసులో పైలా నరసింహయ్య లొంగుబాటు
– అనారోగ్యంతో ఏడ్రోజులుగా సర్వజనాస్పత్రిలో చికిత్స
– మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు రెఫర్
– ఓ పోలీస్ ద్వారా విషయం తెలుసుకున్న జేసీపీఆర్!
– నిమ్స్‌కు పంపకుండా సూపరింటెండెంట్‌పై ఒత్తిడి?
– ‘మరోసారి’ పరీక్షల పేరుతో ప్రాణంతో చెలగాటం
– తనకు ప్రాణహాని ఉందంటూ ఆర్‌ఎంఓ ఎదుట పైలా కన్నీరు
అనంతపురం మెడికల్ : తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సరికొత్త రాజకీయానికి తెరలేపారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగా వైద్యులను పావుగా వాడుకున్నారు. ఇందుకు అధికారులు కూడా తలూపడం విమర్శలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే.. పైలా నరసింహయ్య తాడిపత్రి నియోజకవర్గంలో కీలక నేత. గతంలో ప్రజారాజ్యం, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తర్వాత సీపీఐలో చేరిన ఆయన ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడు దీపక్‌రెడ్డికి పోటీగా నామినేషన్ కూడా వేశారు.
ఈ క్రమంలో రాజకీయ ఒత్తిడి, ఇతర కారణాలతో విత్‌డ్రా చేసుకున్నారు. ముందు నుంచి జేసీ సోదరులకు, పైలా నరసింహయ్యకు మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గత నెల 15న జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయుడైన ఓ వ్యక్తిపై పైలా నర్సింహయ్య దాడి చేసినట్లు తాడిపత్రి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఈనెల 21న పైలా లొంగిపోయారు. అప్పటికే అనారోగ్యంగా ఉండడంతో కోర్టు ఆదేశాల మేరకు తాడిపత్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సౌకర్యాలు లేవన్న కారణంతో 22వ తేదీన అనంతపురం సర్వజనాస్పత్రిలోని ప్రిజనర్ వార్డుకు తీసుకొచ్చారు. వారం రోజుల పాటు పలు పరీక్షలు నిర్వహించారు. ఈయనకు గుండె స్పందన సరిగా లేకపోవడంతో పాటు అపెండిసైటిస్‌కు సంబంధించి తీవ్ర లక్షణాలున్నాయి. ఈ విషయాన్ని పైలాను పరీక్షించిన డాక్టర్ మహేష్ ధ్రువీకరించారు. దీంతో గురువారం ఆయన్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించాలని రాసిచ్చారు.
సూపరింటెండెంట్‌కు జేసీపీఆర్ ఫోన్?
పైలాను నిమ్స్‌కు తరలించాలని డాక్టర్ మహేశ్ రాసిచ్చిన లేఖను ఓ కానిస్టేబుల్ తన వాట్సప్ ద్వారా తాడిపత్రిలోని ఓ పోలీస్ ఉన్నతాధికారికి పంపినట్లు సమాచారం. ఆయన ద్వారా విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి వెంటనే సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్‌కు ఫోన్ చేసినట్లు తెలిసింది. దీంతో పైలాను నిమ్స్‌కు తరలించొద్దని ఆయన ఆదేశాలిచ్చారు. ఈ విషయం తెలియగానే పైలా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తనకు మెరుగైన వైద్యం అవసరమని చెప్పి ఇప్పుడు ఇలా చేయడం ఏంటని ప్రశ్నించారు.
ఆర్‌ఎంఓ ఎదుట పైలా కన్నీరు :
ఆస్పత్రి అధికారుల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన పైలా నర్సింహయ్య మధ్యాహ్నం నుంచి ఆహారం తీసుకోలేదు. సాయంత్రం ఐదు గంటలకు ఆర్‌ఎంఓ లలిత, డిప్యూటీ ఆర్‌ఎంఓలు డాక్టర్ విజయమ్మ, జమాల్‌బాషాలు ప్రిజనర్ వార్డుకు చేరుకుని పైలాతో మాట్లాడారు. ఆహారం తీసుకోవాలని కోరగా ససేమిరా అన్నారు. ఓ వైపు తనకు అనారోగ్యంగా ఉన్నా ఎందుకు పంపించడం లేదని ప్రశ్నిస్తూ కన్నీరుమున్నీరయ్యారు. పక్కా ప్లాన్‌తోనే ఇలా చేస్తున్నారని, తనకు జేసీ ప్రభాకర్‌రెడ్డితో ప్రాణహాని ఉందని ఆరోపించారు. తనను ఇక్కడే ఉంచి ఏదో చేయాలని అనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ ఏమన్నారంటే..
‘పైలా నర్సింహయ్య కడుపునొప్పితో అడ్మిట్ అయ్యారు. ఆయన్ను ఎవరూ నిమ్స్‌కు రెఫర్ చేయలేదు. లెటర్ కూడా ఇవ్వలేదు. రియల్‌గా ప్రాబ్లం ఉంటే పంపిస్తాం. నాకు ఎవరూ ఫోన్ చేయలేదు’ అని అన్నారు. దీంతో రెఫర్ చేసిన లెటర్ తన వద్ద ఉందని ‘సాక్షి’ ప్రస్తావించగా మాటమార్చారు. ‘పైలాను అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్షించారు. హెచ్‌ఓడీతో చూపించి డెసిషన్ తీసుకుంటాం. రేపు (శుక్రవారం) డిటైల్‌గా పరీక్ష చేస్తాం’ అని తెలిపారు.