అనంతపురం మెడికల్ : అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని ప్రిజెనర్ వార్డులో చికిత్స పొందుతున్న తాడిపత్రి నేత పైలా నర్సింహయ్యకు శుక్రవారం పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. జనరల్ మెడిసిన్ హెచ్‌ఓడీ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావుతో పాటు సర్జికల్ డాక్టర్లు వార్డుకు వెళ్లి పైలాకు పరీక్షలు జరిపారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, శనివారం ఎక్స్‌రే, ఎండోస్కోపి ఇతరత్రా పరీక్షలు చేయనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ తెలిపారు. కాగా మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు రెఫర్ చేసిన వైద్యులు.. ఆ తర్వాత పంపకుండా ఇక్కడే ఉంచడంపై పైలా ఆందోళన చెందుతున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి ఆయన ఆహారం తీసుకోవడం లేదు. శుక్రవారం ఉదయం కూడా ఆర్‌ఎంఓ లలిత పైలాను కలిసి ఆహారం తీసుకోవాలని సూచించారు. వైద్య సేవల్లో జరుగుతున్న జాప్యంపై పైలా కుటుంబీకులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించనున్నట్లు తెలిసింది.