మెరుగైన ఉపాధికి అడ్డా.. ఖతార్
ఎన్.చంద్రశేఖర్, మోర్తాడ్ (నిజామాబాద్ జిల్లా) : గల్ఫ్ దేశాల్లో ఒకటైన ఖతార్ వలస కార్మికుల ఉపాధికి పెద్దపీట వేస్తోంది. ఒకప్పుడు వలస కార్మికులకు ఎంతో ఉపాధి కల్పించిన సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, దుబాయ్, ఒమన్, ఇరాక్ దేశాలు ఆర్థిక సంక్షోభం కారణంగా కార్మికులను క్రమంగా తిరుగు ముఖం పట్టిస్తున్నాయి. ఖతార్ మాత్రం ఆర్థిక సంక్షోభాన్ని దరిచేరనీయకుండా.. వలస కార్మికుల ఉపాధికి పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. 2022లో ఖతర్ వేదికగా నిర్వహించనున్న ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం అధునాతనమైన స్టేడియాలు, ఇతర సౌకర్యాల కోసం నిర్మాణాలు వేగవంతంగా సాగుతున్నాయి.
దీనికి తోడు యూరప్ దేశాల్లోని మాదిరిగా మెట్రో రైలు సర్వీసు కోసం జోరుగా పనులు సాగుతున్నాయి. ఖతార్‌లోని దోహా, అల్ రయ్యన్, అల్ వక్రా, అల్ ఖోర్, రస్ లఫన్ ఇండస్ట్రియల్ సిటీ(ఆర్ఎల్ఐసీ) తదితర పట్టణాల్లో జోరుగా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. దీంతో కార్మికులకు చేతినిండా పని ఉంది. స్టేడియంల నిర్మాణ పనులకు కార్మికులను సరఫరా చేసే లైసెన్స్‌లను పొందిన వారిలో తెలంగాణ జిల్లాలకు చెందినవారే ఉన్నారు. అయితే మనవారు ఈ పనుల కోసం బంగ్లాదేశ్, నేపాల్ కార్మికులను ఖతార్‌కు తరలిస్తుండటం గమనార్హం.
క్రూడ్ ఆయిల్ ప్రధాన వనరు...
ఖతార్‌కు ప్రధానమైన ఆదాయ వనరు క్రూడ్ ఆయిల్. ఇతర గల్ఫ్ దేశాల్లోనూ ఆయిల్ ఉత్పత్తి భారీగానే ఉన్నా ఖతార్‌లో పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉంది. తమ పొరుగు దేశాల మాదిరిగా కాకుండా క్రూడ్ ఆయిల్ విషయంలో ఖతార్ కొన్ని నియమాలను పాటిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌ను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ధరల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తుందనే పేరు ఉంది. దీనికి తోడు అక్కడి ప్రభుత్వం తమ దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా మొదటి నుంచీ పొదుపు మంత్రం పాటించడంతో గల్ఫ్ దేశాల్లో ఖతార్ ప్రత్యేకత సంతరించుకుంది.
పొరుగు దేశాలతో పేచీ ఉన్నా...
తీవ్రవాద దళాలకు సహకారం అందిస్తుందనే కారణంతో ఖతార్‌ను ఇతర గల్ఫ్ దేశాలు నిషేధించాయి. ఖతార్‌కు తమ దేశాల నుంచి ఎగుమతులు, దిగుమతులు లేకుండా కట్టడి విధించాయి. అంతేకాక తమ విమానాలను కూడా ఖతార్ గగనతలం నుంచి నడపకుండా, అలాగే ఖతార్ విమానాలు తమ దేశాల గగనతలంపై విహరించకుండా చర్యలను తీసుకున్నాయి. అయితే తమ భాగస్వామ్య దేశాలతో పేచీ ఉన్నా ఆ ప్రభావం ఏమాత్రం తమ దేశంలోని పౌరులు, విదేశీ కార్మికులపై పడకుండా ఖతార్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది. ఖతర్‌పై నిషేధం విధించిన తొలినాళ్లలో కొంత ఇబ్బందులు ఏర్ప డినా వేగవంతమైన ఏర్పాట్ల వల్ల నిషేధం వల్ల ఏర్పడిన ప్రభావం తొలగిపోవడం గమనార్హం.
వ్యాపారాలకు అనువైన దేశం...
సొంతంగా వ్యాపారం నిర్వహించుకోవాలనుకునే వారికి ఖతార్ మంచి అవకాశం కల్పిస్తోంది. గల్ఫ్ దేశాల్లో సొంత ఉపాధి కోసం లైసెన్స్‌లు విస్తృతంగా జారీచేసే దేశంగా దుబాయ్ ముం దుంది. అయితే దుబాయ్‌లో ఎక్కువగా సప్లయింగ్ కంపెనీలకే అవకాశం ఉంది. ఖతార్‌లో మాత్రం సూపర్ మార్కెట్ల నిర్వహణ, రైస్ అమ్మకాలు, ఇతర వ్యాపారాల నిర్వహణకు లైసెన్స్‌లను జారీచేస్తారు. ఇప్పటికే కోరుట్ల రైస్ పేరిట ఖతార్‌లో ఎంతో మంది బియ్యం అమ్మకాలను సాగిస్తున్నారు. కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్‌కు చెందిన పోలీసు విద్యాసాగర్ అతని సోదరులు రాధాకిషన్,
రమేష్‌లు బియ్యంతో పాటు ఖర్జూరం, చీపుర్లు, బుట్టలు, ఇతర గృహ అలంకరణ సామగ్రి వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. వీరు దాదాపు 15 సంవత్సరాల నుంచి ఖతార్‌లో సొంత వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. తాజాగా పశువుల దాణాను సొంతూళ్లో ఉత్పత్తి చేసి ఖతార్‌కు ఎగుమతి చేస్తున్నారు. అలాగే భీమ్‌గల్, నిజామాబాద్‌లకు చెందిన వారు కూడా వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. కరీంనగర్, జగిత్యాల జిల్లా కథలాపూర్, తాండ్రా వాసులు ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ఇతర దేశాలకంటే ఖతార్‌లో నిబంధనలు అంత కఠినంగా లేకపోవడం మనవారికి కలిసి వచ్చే ఆంశం.
మానసిక సమస్యలకు కౌన్సెలింగ్
దుబాయి, షార్జాలలోని ఇండియన్ వర్కర్స్ రీసోర్స్ సెంటర్ వారు వలస కార్మికుల మానసిక సమస్యలకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. యూఏఈ దేశంలో నివసిస్తున్న భారతీయులు మానసిక ఒత్తిడికి గురైన సందర్భంలో ‘ఐడబ్ల్యూఆర్సీ’ వారి 24 గంటల హాట్‌లైన్ నంబర్ 800 46342కు కాల్ చేసి ఉచితంగా నిపుణుల సహాయం పొందవచ్చు. తమ సమస్యలను ఇ–మెయిల్ ఐడి help@iwrcuae.inకు గానీ, మొబైల్ నంబర్ 00971 55 870 3725కు ఎస్ఎంఎస్ ద్వారా తెలుపుకోవచ్చు.
ఖతార్‌లో ఉద్యోగాలకు ఆటంకం లేదు
ఖతార్‌లో ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందీ లేదు. నేను డిప్లోమెట్ క్లబ్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఇతర గల్ఫ్ దేశాలతో పోల్చితే ఖతార్‌లో పరిస్థితి బాగుంది. 2022 ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం విస్తృతమైన ఏర్పాట్లు సాగుతున్నాయి. కార్మికులకు పని బాగుంది. ఆఫీస్ బాయ్స్, క్లీనింగ్ సెక్షన్లలో మాత్రం పాతవారే కొనసాగుతున్నారు.
– ఏశాల నర్సారెడ్డి, ఖతర్ (తొర్తి వాసి)
సొంత వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నాం
నేను ఎంబీఏ పూర్తి చేశాను. బంధు, మిత్రుల సహకారంతో ఖతార్‌లో సొంతంగా వ్యాపారం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. రెండు నెలల క్రితం ఆ దేశానికి వెళ్లి వచ్చాను. మిగతా గల్ఫ్ దేశాల కంటే ప్రస్తుతం ఖతార్‌లో ఉపాధి అవకాశాలు బాగున్నాయి. సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి ఖతార్ అనువైన ప్రదేశం.
– ఉప్పగండ్ల వెంకటేష్, వేంపేట్ (జగిత్యాల జిల్లా)
కంపెనీల్లో చేసే వారికి వేతనాలు బాగున్నాయి
ఖతార్‌లోని కంపెనీలలో పని చేసేవారికి వేతనాలు బాగున్నాయి. హౌస్ డ్రైవర్ చేసేవారికి పని బాగా లేదు. యజమాని ఆర్థిక స్థోమత బాగుంటేనే డ్రైవర్లకు మంచి వేతనాలు ఇస్తున్నారు. కొంత మందికి మెరుగైన వేతనం ఉంది. కొంత మందికి మాత్రం తక్కువ జీతం ఉంది. పొరుగు దేశాలతో పోల్చితే ఖతార్‌లో మాత్రం కార్మికులకు అనుకూలమైన వాతావరణం ఉంది.
– కొట్టూరి రాకేష్, ఖతార్ (తొర్తి వాసి)