చైనాలో చంద్రబాబు నాలుగో రోజు పర్యటన
గియాన్: చైనాలో చంద్రబాబు నాయుడు పర్యటన నాలుగో రోజుకు చేరింది. బుధవారం ఉదయం ఆయన గిజో ప్రావిన్స్‌లోని గియాన్ నగరంలో సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన వివిధ కార్యక్రమాల్లో తన బృందంతో కలసి పాల్గొన్నారు. ముందుగా చంద్రబాబు గిజో ప్రావిన్స్ వైస్ గవర్నర్ క్విన్ రు పీ తో భేటీ అయ్యారు. అనంతరం చైనా దేశ పర్యటనలో భాగంగా గిజో ప్రావిన్స్ సెక్రటరి సన్జిగాంగ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. తమ రాష్ట్రంలో అడుగుపెట్టిన చంద్రబాబు బృందానికి....సన్జిగాంగ్ ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇరు నేతలు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా అమరావతి నిర్మాణానికి సహకరించాలని చంద్రబాబు అభ్యర్ధించారు. ఏపీలో ఉన్న వనరులు, పారిశ్రామిక అవకాశాల గురించి వివరించారు. భారత్ పర్యటనకొచ్చినప్పుడు తప్పనిసరిగా తమ రాజధానిని సందర్శించాలని కోరారు. ఐటీ, ఫార్మా రంగాల్లో గిజో ప్రావిన్స్‌కు సహకారం అందిస్తామని పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనలో తమతో భాగస్వామ్యం కావాలని చంద్రబాబు ప్రతిపాదించారు.
గిజో ప్రావిన్స్, ఏపీ మధ్య సోదర సంబంధాల కోసం రెండు ప్రభుత్వాలు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. తర్వాత వైస్ గవర్నర్ గిజో ప్రావిన్స్ ప్రభుత్వ నిర్మాణం, పాలనా విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు పడుతున్న తపన తమ దృష్టిని ఆకర్షించిందని, ఏపీ అభివృద్ధిలో తమవంతు సహకారం అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.