qualis
-
చదివింది తక్కువే అయినా చోరీల్లో మాత్రం..
సాక్షి, సిటీబ్యూరో: రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో మూడు ఇళ్లల్లో చోరీలు జరిగినా ప్రాంతానికి కూతవేటు దూరంలో జంక్షన్ వద్ద ఉన్న క్వాలిస్ వాహనం ముగ్గురు ఘరానా దొంగలతో పాటు వీరి బంగారం, వెండి ఆభరణాలను విక్రయించేందుకు సహకరిస్తున్న మరొకరిని సైబరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.30 లక్షల విలువైన 753 గ్రాముల బంగారం, మూడు కిలోల 550 గ్రాముల వెండి ఆభరణాలు, మూడు ఎల్ఈడీ టీవీలు, ఒక క్వాలిస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ జానకి షర్మిలా, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డిలతో కలిసి పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో మీడియాకు తెలిపారు. ఈ చోరీల ముఠాకు నేతృత్వం వహిస్తున్న మోయినాబాద్‌కు చెందిన మహమ్మద్ అయూబ్ తన పదోవ ఏటానే కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు మకాం మార్చారు. తెలుగు, ఉర్దూలో అనర్గళంగా మాట్లాడే అయూబ్ తొలినాళ్లలో పండ్లవ్యాపారంలో నాన్నకు సహకారంగా ఉండి ఆ తర్వాత ఆటోడ్రైవర్‌గా పనిచేశాడు. ఈ సమయంలోనే శివారు ప్రాంతాల్లో ఉన్న పశువులను చోరీ చేసిన కేసులో చందానగర్ పోలీసులు 2008లో అరెస్టు చేశారు. జైలుకు వెళ్లొచ్చిన అయూబ్ పంథా మార్చకుండా సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో 70 పశువుల దొంగతనాలు, 78 లారీల చోరీలు చేసి జైలుకెళ్లి వచ్చాడు. చివరిసారిగా ఈ ఏడాది జూన్‌లో చిలకలగూడ పోలీసులకు చిక్కిన అయూబ్ ఆగస్టు నెలలో జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే ఐదో తరగతి వరకు చదివిన మెహదీపట్నంకు చెందిన గుంజపోగు సుధాకర్ చిన్నతనంలోనే చెడు అలవాట్లకు బానిసై బైక్‌లు దొంగనతాలు చేస్తూ జైలుకెళ్లిన సమయంలో యాదగిరితో ఏర్పడిన పరిచయంతో రాత్రి సమయంలో ఇళ్లల్లో చోరీలు చేయడం మొదలెట్టాడు. ఇలా సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్లలో 62 చోరీలు చేసినా సుధాకర్‌పై అసిఫ్‌నగర్ పోలీసులు 2015లో పీడీయాక్ట్ నమోదుచేసినా మళ్లీ చోరీ కేసులో మీర్‌పేట పోలీసులకు చిక్కాడు. గతంలోనే జైల్లో ఏర్పడిన పరిచయంతో అయూబ్ సుధాకర్‌తో కలిసి చోరీలు చేయాలని ప్రణాళిక రచించాడు. తనకు పరిచయమున్న నవీన్‌కుమార్, మహేందర్‌లతో కలిసి ఆగస్టు నుంచి రాత్రి వేళ్లలో ఇళ్లలో చోరీలు చేయడం మొదలెట్టారు. క్వాలిస్‌లోనే వచ్చి రెక్కీ...చోరీ.. పాతబస్తీలో క్వాలిస్ అద్దెకు క్వాలిస్ తీసుకొని తాము ఎంచుకున్న ప్రాంతంలో రెక్కీ నిర్వహిస్తారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌గా చేసుకుంటారు. అయూబ్ వాహనాన్ని చోరీ చేసే ప్రాంతానికి కూతవేటు దూరంలో నిలిపేవాడు. ఆయన క్వాలిస్‌లోనే ఉండగా సుధాకర్, నవీన్‌కుమార్, మహేందర్ ఇళ్లలో చోరీలకు వెళ్లేవారు. తాళాలు పగులగొట్టడంలో దిట్ట అయిన సుధాకర్ చకచక పనిచేయగా మిగిలిన వారు ఇంట్లోకెళ్లి బీరువాలో నగదు, నగలు ఎత్తుకెళ్లేవారు. ఇలా సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో అయూబ్ గ్యాంగ్ తొమ్మిది దొంగతనాలు చేసింది. అయితే వరుస చోరీలు జరుగుతుండటంతో అప్రమత్తమైన క్రైమ్స్ డీసీపీ జానకి షర్మిలా మార్గదర్శనంలో శంషాబాద్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు, బాలానగర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం క్వాలిస్ కదలికలపై అనుమానం రావడంతో వాహన యజమానితో మాట్లాడారు. అయూబ్ అద్దెకు తీసుకెళ్లాడని చెప్పడంతో వీరి చోరీలకు చెక్‌పడింది. అయూబ్, సుధాకర్, మహేందర్‌లతో పాటు నగలు తీసుకొని నగదుకు మార్చి ఇచ్చే మహమ్మద్ బాబాను కూడా అరెస్టు చేశారు. నవీన్ కుమార్ పరారీలో ఉన్నాడు. దొంగలను పట్టుకున్న సిబ్బందిని సజ్జనార్ అభినందించారు. -
క్వాలిస్ కలకలం ?
వైఎస్ఆర్ జిల్లా , కమలాపురం : కమలాపురం రైల్వే స్టేషన్–చెరువు కట్ట మధ్యలో పంట పొలాల్లో క్వాలిస్ వాహనం కలకలం రేపింది. గత మూడు రోజులుగా రైల్వే స్టేషన్–చెరువు కట్ట మధ్యలోని పంట పొలాల్లో ఈ క్వాలిస్ (ఏపీ03–ఎక్యూ 4386) వాహనం ఉండటంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ వాహనం పంట పొలాల్లోకి ఎందుకు వచ్చింది? ప్రధాన రహదారిని వదిలేసి పట్టణ శివారులోని చెరువు కట్ట వైపు ఎవరు వచ్చారు? రోడ్డు లేదని తెలిసి కూడా పంట పొలాల్లోకి వాహనం ఎందుకు పోనిచ్చారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్థానికులైతే కాదని, కొత్త వ్యక్తులే ఈ వాహనాన్ని తీసుకు వచ్చి ఉంటారని తెలుస్తోంది. ఇటీవల వరి పైరు కోత కోసిన ప్రాంతం కావడంతో కారు బురదలో ఇరుక్కు పోయింది. కారును బయటకు లాగడానికి జాకీ సాయంతో కూడా ప్రయత్నం చేశారు. అయితే వాహనం రాక పోవడంతో వదిలి వెళ్లి పోయారు. రాత్రిళ్లు ఎర్ర చంద్రనం తరలించే స్మగ్లర్లు ఎవరైనా నైట్ బీట్ చేస్తున్న పోలీసులను చూసి వాహనాన్ని ఇష్టమొచ్చిన రూట్లలో తీసుకెళ్లి చివరకు పంట పొలాల్లో వదిలే శారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. వాహనం వదిలేసి మూడు రోజులైనా ఎవరూ రాకపోవడంతో ఈ పని ఎర్ర స్మగ్లర్లదే అయి ఉంటుందని స్థానికులకు అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఈ వాహనాన్ని బుధవారం స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయంపై ఎస్ఐ మహమ్మద్ రఫీని వివరణ కోరగా పంట పొలాల్లో క్వాలీస్ వాహనం ఉన్నది వాస్తవమేనని, దానిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
పుష్కరాలకు వెళ్లి వస్తూ..
► అనంతపురం జిల్లా గుత్తిలో డివైడర్‌ను ఢీకొట్టిన క్వాలిస్ ► మేడ్చల్ జిల్లాకు చెందిన ఇద్దరు మృతి.. మరో ఆరుగురికి గాయాలు ► కావేరి పుష్కరాల కోసం కర్ణాటకకు వెళ్లి వస్తుండగా ఘటన గుత్తి రూరల్: కావేరి పుష్కరాలకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాల య్యాయి. అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊబిచెర్లలో 44వ నంబరు జాతీయరహదారిపై ఆదివారం వేకువజామున క్వాలిస్ వాహనం డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో మేడ్చల్ జిల్లా ఘట్కేసర్కు చెందిన కళా శారద(60), ఆమె అన్న లక్ష్మణరావు(65) మృతిచెందారు. లక్ష్మణరావు భార్య అనురాధ, బంధువులు సత్యనారాయణ, అరుణ, విజయలక్ష్మితో పాటు డ్రైవర్ కృష్ణారెడ్డి, సోహైల్, శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. ఈ నెల 15న సాయంత్రం క్వాలిస్ వాహనంలో కర్నాటకలోని శ్రీరంగపట్టణంలో జరిగే కావేరి పుష్కరాలకు వీరంతా బయలుదేరారు. పుణ్యస్నానాలు చేసి శనివారం రాత్రి 8.30 గంటలకు మైసూర్ నుంచి తిరుగుపయనమయ్యారు. డ్రైవర్ కునుకుపాటే కారణం.. ఆదివారం వేకువ జామున 5.10 నిమిషాలకు వారు ప్రయాణిస్తున్న క్వాలిస్ గుత్తి మండలం ఊబిచెర్ల శివారులో ప్రమాదానికి గురైంది. సుదీర్ఘ ప్రయాణంలో డ్రైవర్ కునుకు తీయడం తో స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయాడు. దీంతో డివైడర్‌ను ఢీకొట్టిన కారు పల్టీలు కొట్టి ఆగిపోయింది. ఒక్కసారిగా వాహనం నుంచి భారీగా పొగలు వ్యాపించాయి. కారులోని వారు హాహాకారాలు చేయడంతో స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలోనే శారద మృతి చెందగా.. తీవ్రగాయాల పాలైన లక్ష్మణరావు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. కారులోని వారిని ప్రైవేటు వాహనాల్లో గుత్తి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వీరిలో తీవ్రంగా గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన శారద వెంకటేశ్వర స్వామి భక్తురాలు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని నెమురగొముల గ్రామంలో రూ.కోటి 50 లక్షలతో సాయి గోవింద క్షేత్రం నిర్మించారు. మూడ్రోజుల క్రితం ఆలయానికి వచ్చి వెళ్లిన శారద ప్రమాదంలో మరణించారని తెలియడంతో ఆ గ్రామంలో విషాదం అలుముకొంది. -
తార్నాకలో క్వాలిస్ వాహనం బీభత్సం:8 మందికి గాయాలు
హైదరాబాద్: నగరంలో క్వాలిస్ వాహనం బీభత్సం సృష్టించింది. తార్నాకలో నడిరోడ్డుపై క్వాలిస్ వాహనం అదుపు తప్పి జనాలపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఎనిమిది మందికి పైగా గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. గాయపడిన వారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాహనానికి బ్రేక్స్ విఫలం కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.