
పుష్కరాలకు వెళ్లి వస్తూ..
► అనంతపురం జిల్లా గుత్తిలో డివైడర్‌ను ఢీకొట్టిన క్వాలిస్
► మేడ్చల్ జిల్లాకు చెందిన ఇద్దరు మృతి.. మరో ఆరుగురికి గాయాలు
► కావేరి పుష్కరాల కోసం కర్ణాటకకు వెళ్లి వస్తుండగా ఘటన
గుత్తి రూరల్: కావేరి పుష్కరాలకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాల య్యాయి. అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊబిచెర్లలో 44వ నంబరు జాతీయరహదారిపై ఆదివారం వేకువజామున క్వాలిస్ వాహనం డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన కళా శారద(60), ఆమె అన్న లక్ష్మణరావు(65) మృతిచెందారు.
లక్ష్మణరావు భార్య అనురాధ, బంధువులు సత్యనారాయణ, అరుణ, విజయలక్ష్మితో పాటు డ్రైవర్ కృష్ణారెడ్డి, సోహైల్, శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. ఈ నెల 15న సాయంత్రం క్వాలిస్ వాహనంలో కర్నాటకలోని శ్రీరంగపట్టణంలో జరిగే కావేరి పుష్కరాలకు వీరంతా బయలుదేరారు. పుణ్యస్నానాలు చేసి శనివారం రాత్రి 8.30 గంటలకు మైసూర్ నుంచి తిరుగుపయనమయ్యారు.
డ్రైవర్ కునుకుపాటే కారణం..
ఆదివారం వేకువ జామున 5.10 నిమిషాలకు వారు ప్రయాణిస్తున్న క్వాలిస్ గుత్తి మండలం ఊబిచెర్ల శివారులో ప్రమాదానికి గురైంది. సుదీర్ఘ ప్రయాణంలో డ్రైవర్ కునుకు తీయడం తో స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయాడు. దీంతో డివైడర్‌ను ఢీకొట్టిన కారు పల్టీలు కొట్టి ఆగిపోయింది. ఒక్కసారిగా వాహనం నుంచి భారీగా పొగలు వ్యాపించాయి. కారులోని వారు హాహాకారాలు చేయడంతో స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.
వాహనంలోనే శారద మృతి చెందగా.. తీవ్రగాయాల పాలైన లక్ష్మణరావు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. కారులోని వారిని ప్రైవేటు వాహనాల్లో గుత్తి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వీరిలో తీవ్రంగా గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన శారద వెంకటేశ్వర స్వామి భక్తురాలు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని నెమురగొముల గ్రామంలో రూ.కోటి 50 లక్షలతో సాయి గోవింద క్షేత్రం నిర్మించారు. మూడ్రోజుల క్రితం ఆలయానికి వచ్చి వెళ్లిన శారద ప్రమాదంలో మరణించారని తెలియడంతో ఆ గ్రామంలో విషాదం అలుముకొంది.