
పంట పొలాల్లో ఉన్న క్వాలీస్ వాహనం
వైఎస్‌ఆర్ జిల్లా , కమలాపురం : కమలాపురం రైల్వే స్టేషన్–చెరువు కట్ట మధ్యలో పంట పొలాల్లో క్వాలిస్ వాహనం కలకలం రేపింది. గత మూడు రోజులుగా రైల్వే స్టేషన్–చెరువు కట్ట మధ్యలోని పంట పొలాల్లో ఈ క్వాలిస్ (ఏపీ03–ఎక్యూ 4386) వాహనం ఉండటంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ వాహనం పంట పొలాల్లోకి ఎందుకు వచ్చింది? ప్రధాన రహదారిని వదిలేసి పట్టణ శివారులోని చెరువు కట్ట వైపు ఎవరు వచ్చారు? రోడ్డు లేదని తెలిసి కూడా పంట పొలాల్లోకి వాహనం ఎందుకు పోనిచ్చారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్థానికులైతే కాదని, కొత్త వ్యక్తులే ఈ వాహనాన్ని తీసుకు వచ్చి ఉంటారని తెలుస్తోంది. ఇటీవల వరి పైరు కోత కోసిన ప్రాంతం కావడంతో కారు బురదలో ఇరుక్కు పోయింది.
కారును బయటకు లాగడానికి జాకీ సాయంతో కూడా ప్రయత్నం చేశారు. అయితే వాహనం రాక పోవడంతో వదిలి వెళ్లి పోయారు. రాత్రిళ్లు ఎర్ర చంద్రనం తరలించే స్మగ్లర్లు ఎవరైనా నైట్ బీట్ చేస్తున్న పోలీసులను చూసి వాహనాన్ని ఇష్టమొచ్చిన రూట్లలో తీసుకెళ్లి చివరకు పంట పొలాల్లో వదిలే శారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. వాహనం వదిలేసి మూడు రోజులైనా ఎవరూ రాకపోవడంతో ఈ పని ఎర్ర స్మగ్లర్లదే అయి ఉంటుందని స్థానికులకు అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఈ వాహనాన్ని బుధవారం స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయంపై ఎస్‌ఐ మహమ్మద్ రఫీని వివరణ కోరగా పంట పొలాల్లో క్వాలీస్ వాహనం ఉన్నది వాస్తవమేనని, దానిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment