
మృతి చెందిన చిన్నారి
నవమాసాలు తల్లి గర్భంలో స్వేచ్ఛగా ఉన్న శిశువుకు బయట ప్రపంచం గురించి తెలియదు. తెలిసింటే బయటకు వచ్చేది కాదేమో..పుట్టగానే అమ్మ పొత్తిళ్లు కూడా చూడకుండా చిదిమేశారు. కళ్లు తెరవకుండానే కాటికి సాగనంపిన ఆ తల్లి మనస్సు ఎంత కఠినమైందో.. లోకం ఎరుగని ఆ పసిగుడ్డు చేసిన పాపం ఆడ బిడ్డగా జన్మించడమే.. ఈ హృదయ విదారక సంఘటన జమ్మలమడుగులో శుక్రవారం చోటు చేసుకుంది.
వైఎస్‌ఆర్ జిల్లా, జమ్మలమడుగు : తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన ఓ ఆడశిశువు లోకాన్ని చూడకముందే శాశ్వతంగా కన్ను మూసింది. భూమి మీదకు వచ్చి 48 గంటలకు కూడా పూర్తికాకుండానే నూరేళ్లు నిండాయి. కాదు..కాదు.. ఆడ జన్మ ఎత్తినందుకు ఆ బిడ్డ ఆయువును అనంత వాయువుల్లో కలిపేశారు. జమ్మలమడుగు పట్టణ శివార్లలో శుక్రవారం ఉదయం వెలుగు చూసిన ఈ హృదయ విదారక సంఘటన స్థానికులను కలచివేసింది. వివరాలిలా..జమ్మలమడుగు రైల్వేస్టేషన్ సమీపంలోని తాడిపత్రి బైపాస్‌రోడ్డు పక్కన ఉన్న ముళ్లపొదల్లో రెండు రోజుల వయసు ఉన్న పసికందు శవమై కనిపించింది. శుక్రవారం ఉదయం బహిర్భుమికి వెళ్లిన స్థానికుడు ఆ శిశువును గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రెండు రోజుల క్రితం జమ్మలమడుగు చుట్టూ పక్కల ఆసుపత్రులల్లో ఎంత మంది ఆడపిల్లలు జన్మించారని ఇటు పోలీసులు, అటు వైద్యులు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఇక్కడ జన్మించిన శిశువులందరూ వారి తల్లిదండ్రుల వద్ద క్షేమంగా ఉన్నట్లు నిర్ధారించారు. దీనిని బట్టి సుదూర ప్రాంతంలో జన్మించిన శిశువును ఏ అర్థరాత్రో ఇక్కడికి తీసుకొచ్చి ముళ్లపొదల్లో పడేసి ఉండవచ్చు అని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.
కేవలం ఆడబిడ్డ అనే ఒకే ఒక కారణంతోనే ఇలా కడతేర్చినట్లు తెలుస్తోంది. సమాజంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న నిందితులకు కఠిన శిక్షలు అమలు కానంత వరకు ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయని పెద్దలు అభిప్రాయ పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment