ప్రస్తుత ధరకే రిలయన్స్ కేజీ డీ6 గ్యాస్ విక్రయం
న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం నాచురల్ గ్యాస్ ధరల సవరణపై నిర్ణయం తీసుకునేంత వరకు కేజీ డీ6 క్షేత్రంలో ఉత్పత్తయ్యే గ్యాస్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత రేటుకే విక్రయించనుంది. ప్రస్తుతం మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్లకు (ఎంబీటీయూ) 4.2 డాలర్లుగా ఉన్న ధరను ఏప్రిల్ 1 నుంచి 8 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించిన సంగతి విదితమే. అయితే, ఎన్నికల సంఘం సలహా మేరకు, మేలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ధరల పెంపును వాయిదా వేయాలని చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ నిర్ణయించారని అధికార వర్గాలు తెలిపాయి.
ఓఎన్జీసీ వంటి సంస్థలు గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు గ్యాస్‌ను 4.2 డాలర్ల ధరకే అమ్ముతాయి. అయితే, కేజీ డీ6 గ్యాస్‌పై రిలయన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. కొత్త కాంట్రాక్టులు కుదుర్చుకోవాలంటే ఇరు పక్షాలూ సంతకాలు చేయాల్సి ఉంది. నూతన విక్రయ ఒప్పందాలకు సంబంధించిన అనేక అంశాలను రిలయన్స్ - కేజీ డీ6 గ్యాస్ కొనుగోలుదారుల సమావేశంలో పరిష్కరించుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుత గ్యాస్ అమ్మకం, కొనుగోలు ఒప్పందం (జీఎస్‌పీఏ) మాదిరే కొత్త జీఎస్‌పీఏ కూడా ఐదేళ్లపాటు అమల్లో ఉండడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అంగీకరించిందని ఆవర్గాలు పేర్కొన్నాయి.