మద్యం పట్టివేత
పెద్దపల్లి, న్యూస్‌లైన్ :అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం పెద్దపల్లిలో ఎస్సై కిశోర్ వాహనాలు తనిఖీ చేస్తుండగా 526 క్వాటర్ బాటిళ్ల మధ్యం పట్టుబడింది.ఎలిగేడుకు చెందిన డీ.కొండాల్‌రావు ఈ మద్యాన్ని పెద్దపల్లి నుంచి అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డాడు. ఎన్నికల నేపథ్యంలో మద్యాన్ని ఇంట్లో నిల్వ చేసి అధిక ధరలకు అమ్ముకునేందుకు తరలిస్తున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
పట్టుకున్న టీఆర్ఎస్ నాయకులు
కమాన్‌పూర్/మహాముత్తారం : కమాన్‌పూర్, మహాముత్తారం మండలాల్లో ఆదివారం అక్రమంగా సరఫరా చేస్తున్న మద్యాన్ని టీఆర్ఎస్ నాయకులు పట్టుకున్నారు. కమాన్‌పూర్ ఎక్స్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనంపై అక్రమంగా తరలిస్తున్న రూ.10 వేల విలువగల మద్యాన్ని టీఆర్ఎస్ నాయకులు పట్టుకున్నారు.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏఎస్సై అన్వర్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహాముత్తారం మండలం కోనంపేటలో మడప సమ్మయ్య ఇంటివద్ద అక్రమంగా నిల్వ చేసిన 30 బీరు సీసాలను టీఆర్ఎస్ నాయకులు పట్టుకున్నారు. సమ్మయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రూ.4.26లక్షలు పట్టివేత
గంభీరావుపేట, న్యూస్‌లైన్: అధికారుల తనిఖీలో రూ. 4.26లక్షలు పట్టుబడ్డాయి. ఆదివారం మండలంలోని కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల సరిహద్దులో ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు నాగభూషణం, కుమార్ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ డబ్బు పట్టుబడింది. నిజామాబాద్ జిల్లా బైంసా నుంచి వస్తున్న డీసీఎంలో ఈడబ్బును తరలిస్తుండగా పట్టుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సదరు డబ్బును సీజ్ చేసి ఎస్సై రవీందర్‌కు అప్పగించినట్లు డెప్యూటీ తహశీల్దార్ నాగభూషణం తెలిపారు.
రూ.1.10 లక్షలు పట్టివేత
కమలాపూర్ : మండలంలోని వంగపల్లిలో ఆదివారం కారులో తరలిస్తున్న రూ.1.10 లక్షల నగదును ఎస్ఎస్టీ-1 టీం అధికారులు పట్టుకున్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన ఈద రంజిత్‌రెడ్డి హన్మకొండ నుంచి కారులో వస్తుండగా, అధికారులు కారు ఆపి తనిఖీ చేయగా రూ.1.10 లక్షలు లభ్యమయ్యాయి. ఆ డబ్బులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో డబ్బులు సీజ్ చేసి ఐటీ శాఖకు అప్పగించారు.
రూ. 2.90 లక్షలు పట్టివేత
బెజ్జంకి : మండలంలోని గునుకుల కొండాపూర్‌లో ఆదివారం రాత్రి అధికారులు రూ.2.90లక్షలు పట్టుకున్నారు. మాదాపూర్ గ్రామానికి చెందిన భూపెల్లి దిలీప్ కారులో డబ్బులు తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. అయితే తాను గుండ్లపల్లిలో పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నానని, ఈడబ్బు పెట్రోల్ విక్రయించగా వచ్చిందేనని అధికారులకు తెలిపాడు. అయితే ఇందుకు ఆధారాలు లేకపోవడంతో డబ్బు సీజ్ చేసి, ఎస్సై ఉపేందర్రావుకు అప్పగించారు