అహంకారం స్థానే సహకారం
అమెరికా అధ్యక్షుడు ఒబామా తన పొరుగుదేశం క్యూబాని సందర్శించడం చారిత్రాత్మకం. అభినందనీయం. పొరుగునే తొంబైమైళ్ళ దూరాన ఉన్న దేశాన్ని, అమెరికా అధ్యక్షుడు పర్యటించడానికి దాదాపు తొంబైఏళ్ళు పట్టడం విదేశాంగ విధానాలో్ల కరడుగట్టిన హ్రస్వదృష్టికి నిదర్శనం. దేశాల మధ్య సైద్ధాంతిక భేదాలు శతృత్వ భావనల్ని ప్రేరేపించడం వల్ల చివరకు ఇరువర్గాలూ నష్టపోవడమేకాక ప్రపంచ శాంతి ఎండమావిగా తయారైంది. తన పక్కనే ఉన్న చిన్న దేశం క్యూబాపై అమెరికా తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధించి ఇన్నాళ్ళూ శత్రు పూరిత వైఖరిని ప్రదర్శించింది. అందుకు ముఖ్యకారణం పాలనలో తనకు భిన్నమైన సిద్ధాంతాన్ని అవలంభిస్తోన్న దేశాన్ని మెడలు వంచి తన దారికి తెచ్చుకోవాలన్న అహంకార పూరిత వైఖరి. దశాబ్దాలపాటు సాగిన ఆర్థిక ఇబ్బందుల్ని లెక్క చెయ్యకపోవడమేగాక వైద్య, ప్రజారోగ్య రంగాల్లో, మానవ వనరుల అభివృద్ధిలో ముందంజ వేయడం క్యూబా విజయం.
అయితే ప్రస్తుతం అహంకార వైఖరి స్థానే సహకారం, సుహృద్బావం ప్రోది చేసే దిశగా అమెరికా అధ్యక్షుడు మొదటి అడుగు వేయడం మేలిమలుపు. ఉమ్మడి ప్రయోజనాలకు, తద్వారా ప్రపంచ శాంతికి దేశాలు తమతమ సిద్ధాంతాలకు, స్వప్రయోజనాలకు అతీతంగా స్పందించాల్సిన అవసరముంది. ఆ దిశగా జరిగిన ఈ ప్రయత్నానికి అందరూ మద్దతు పలకాలి. దశాబ్దాలుగా క్యూబాపై మనం అమలుపరిచిన ఏకాకి విధానం ఫలితాలను ఇవ్వలేదు కాబట్టి క్యూబా ప్రజలకు మరింత దగ్గరవడం ద్వారానే ఇరుదేశాల సంబంధాలను మార్చగలం అని హిల్లరీ క్లింటన్ చెప్పారు. దీన్ని కేవలం మాటల్లోనే కాకుండా ఆచరణలోనూ పాటిస్తే అమెరికా, క్యూబా రెండింటికీ ప్రయోజనం కలిగిస్తోంది.
- డా ॥డి.వి.జి. శంకరరావు,
మాజీ ఎంపీ, పార్వతీపురం 9440836931