The Quint
-
స్త్రీలోక సంచారం
ఇంత మంచి గుడ్ వరల్డ్‌లో ఉన్నాం కదా.. ‘కన్యత్వ పరీక్ష’ అనే బ్యాడ్ వర్డ్ ఇంకా వినిపిస్తూనే ఉంది! ఒక ఆడపిల్ల కన్యా, కాదా? అని తెలుసుకోడానికి చేసే అనాగరికమైన పరీక్ష ఇది. ఇందులోనే ఇంకా అనాగరికం.. కొందరు డాక్టర్లు చేసే ‘టూ–ఫింగర్ టెస్ట్’. సాధారణంగా.. ఒక యువతి, లేదా బాలికపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణల్లో నిజముందా లేదా నిర్థారించడానికి చేసే పరీక్షల్లో టూ–ఫింగర్ టెస్ట్ ఒకటి. బాధితురాలి జననావయవంలోకి రెండు వేళ్లు చొప్పించి, ఆ వేళ్లు సులువుగా లోపలికి ప్రవేశించగలిగితే ఆమె కన్య కాదనీ, వేళ్ల ప్రవేశం కష్టం అయితే ఆమె కన్య అని ఒక కంక్లూజన్‌కి వస్తారు! ఈ టెస్ట్‌లోనే వేళ్లకు కన్నెపొర (జననావయవ అంతర్ ముఖద్వారంలో ఉండే పొర) అడ్డుపడితే ఆమె కన్య అయినట్లు, పొర అడ్డుపడకపోతే ఆమె కన్య కానట్లు భావిస్తారు. ఇదొక అర్థం లేని పరీక్ష అని నికార్సైన వైద్య నిపుణులు ఏనాడో తేల్చి పారేసినప్పటికీ.. ఇప్పటికీ చాలాచోట్ల అత్యాచారం కేసులలో అధికారికంగా, నూతన వరుడు సందేహపడిన సందర్భంలో అనధికారికంగా ఈ ‘టూ–ఫింగర్ టెస్ట్’ చేస్తున్నారు. కన్నెపొర లేకపోవడానికి, జననాంగ గోడలు వదులుగా ఉండడానికి కన్యత్వాన్ని కోల్పోవడమే కారణమవక్కర్లేదు. పొర, వదులు అన్నవి ఆటల్లో పోవచ్చు. ఇప్పుడీ బ్యాడ్ టాపిక్ ఎందుకొచ్చిందంటే.. ఓ గుడ్ డాక్టర్ ఈ ‘టూ–ఫింగర్ టెస్ట్’ను వైద్య పాఠ్యాంశాలలోనే లేకుండా తొలగించాలని కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాశారు. ఆ డాక్టరు గారి పేరు ఇంద్రజిత్ ఖండేకర్. మహారాష్ట్రలోని సేవాగ్రామ్‌లో ఉన్న ‘మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ లో ఫోరెన్సిక్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. అయినా ‘టూ–ఫింగర్ టెస్ట్’ అనే ఈ పరీక్ష.. వైద్యపుస్తకాల్లో ఎందుకు ఉన్నట్లు? మొదట ఎవరో చేర్చారు. తర్వాత ఎవరూ మార్చలేదు. డాక్టర్ ఖండేకర్ ఆరోగ్య శాఖకు మాత్రమే రాయలేదు. భార త వైద్య మండలికి, కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖకు, మహారాష్ట్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కూ.. ఈ టూ–ఫింగర్ టెస్ట్ ప్రస్తావనను పుస్తకాల్లోంచి తొలగించాలని విజ్ఞప్తులు పంపారు. ‘ఇదొక బుద్ధిలేని, అసంబద్ధమైన పరీక్ష’ అని ఆయన ‘టూ–ఫింగర్ టెస్ట్’ను వర్ణించారు. ఆడపిల్లను ఫిజికల్‌గా బాధ పెట్టి, అవమానించే ఈ పరీక్ష మహిళపై జరిగే హింస కంటే కూడా ఎక్కువే అని అంటారు ఖండేకర్. 2018 అక్టోబర్‌లో ఐక్యరాజ్యసమితి విభాగం అయిన ‘యు.ఎన్. ఉమెన్’ కూడా ఇదే మాట చెప్పింది. అయితే మొత్తం అన్ని రకాలైన కన్యత్వ పరీక్షల గురించి చెప్పింది. ఇలాంటి పరీక్షలకు ముగింపు పలకాలని సభ్య దేశాలకు పిలుపునిచ్చింది. ‘ది క్వింట్’ భారతదేశంలో పేరున్న న్యూస్ వెబ్సైట్. ఇంగ్లిష్, హిందీ భాషల్లో వస్తోంది. క్వింట్ ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన ‘మి, ది ఛేంజ్’ క్యాంపెయిన్ని ప్రారంభించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయబోతున్న 18–23 ఏళ్ల మధ్య వయసు గల యువతులలోంచి ‘ఉమన్ అచీవర్’ని ఎంపిక చేయడం కోసం నామినేషన్లను ఆహ్వానిస్తోంది. సైట్లోకి వెళ్లి, నామినేషన్ ఫారమ్‌లో మీకు తెలిసిన యంగ్ ఉమెన్ అచీవర్ వివరాలను పొందుపరిస్తే చాలు. మీరు నామినేట్ చేస్తున్నప్పుడు మీ పేరును వెల్లడించడం తప్పనిసరేం కాదు. మీ ఇ–మెయిల్, మీ కాంటాక్ట్, మీరు సూచిస్తున్న యువతి పేరు, ఆమె వయసు, ఆమె సాధించిన విజయం, ఆమె వివరాలు ఇస్తే సరిపోతుంది. మీ ఫ్రెండ్స్, మీ సోదరి.. వారెవరైనా సరే మీరు నామినేట్ చెయ్యొచ్చు. ‘మి, ది ఛేంజ్’ కాంపెయిన్‌కి ప్రముఖ మలయాళీ నటి పార్వతి తన సహకారం అందిస్తున్నారు. -
మీడియా కింగ్‌కు ఐటీ సెగ
సాక్షి,న్యూఢిల్లీ: మీడియా దిగ్గజానికి ఆదాయ పన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. ది క్వింట్ న్యూస్‌పోర్టల్, న్యూస్ 18 గ్రూపు వ్యవస్థాపకుడు రాఘవ్ బాల్ ఇంటిపై ఐటీ అధికారులు ముమ్మర దాడులు నిర్వహించారు. దీంతోపాటు క్వింట్ కార్యాలయంపై కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు. పన్ను ఎగవేతపై ఆరోపణలతో నోయిడాలోని బాల్ నివాసం, ఆఫీసుపై గురువారం ఐటీ అధికారులు దాడులు చేశారు. పన్ను ఎగవేత కేసు విచారణంలో ఆయన నివాసంలో వివిధ డాక్యుమెంట్లను ఇతర పత్రాలను పరిశీలిస్తున్నామనీ, ఇతర ప్రాంతాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయని ఐటీ శాఖ వెల్లడించింది. మరోవైపు ఐటీ దాడులపై రాఘవ్ బాల్ స్పందించారు. తాను ఈ ఉదయం ముంబైలో ఉండగా, డజన్ల కొద్దీ ఐటీ అధికారులు తన నివాసం క్విన్ట్ కార్యాలయంపై దాడికి దిగారని ఆందోళన వ్యక్తంచేశారు. అదే సందర్భంలో కొన్నిముఖ్యమైన డాక్యుమెంట్లను ,ఇతర పాత్రికేయ సమాచారాన్ని దుర్వినియోగం చేయొద్దని ఐటీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ఫోన్ల ద్వారా తమ సమాచారాన్ని సేకరించవద్దని, అలా చేస్తే ప్రతిచర్య తప్పదన్నారు. ఈ విషయంలో ఎడిటర్స్ గిల్డ్ తమకు అండగా ఉంటుందని ఆశిస్తున్నానన్నారు. తద్వారా భవిష్యత్‌లో ఇతర పాత్రికేయ సంస్థపై జరగబోయే ఈ తరహా దాడులను నివారించాలని బాల్ కోరారు. క్వింట్ పెట్టుబడులు పెట్టిన ది న్యూస్ మినిట్ బెంగళూరు కార్యాలయంలో కూడా ఐటీ బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. అయితే ఐటీ చట్టం సెక్షన్ 133ఏ క్రింద ఇది సర్వేమాత్రమే నని, తనిఖీలు లేదా దాడి కాదని తెలిపారు. ఆర్థిక పత్రాలు, ఆడిట్ పుస్తకాలు వారికి చూపించాలని అక్కడి సిబ్బందిని కోరారు. ఐటీ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నామని ది న్యూస్ మినిట్ ఎడిటర్ ఇన్ ఛీఫ్ ధన్య రాజేంద్రన్ చెప్పారు. మండిపడ్డ ప్రశాంత్ భూషణ్ రాఘవ్ బాల్ నివాసం, కార్యాలయాల్లో ఐటీ దాడులను ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తప్పుబట్టారు. కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న మీడియాను భయపెట్టడానికే ఈ దాడులని విమర్శించారు. ఇంతకుమందెన్నడూ లేని విధంగా ఐటీ, ఈడీ, సీబీఐ లను ప్రభుత్వ అక్రమంగా వాడుకుంటోందని మండిపడ్డారు. -
మహిళా జర్నలిస్టుకు 'రేప్', హత్య బెదిరింపులు!
అసభ్య పాటను తప్పుబట్టినందుకు ఆన్లైన్లో బెదిరింపులు సాక్షి, న్యూఢిల్లీ: లైంగికంగా అసభ్యంగా అశ్లీలంగా ఉన్న ఓ మ్యూజిక్ వీడియోను తప్పుబడుతూ వీడియో పెట్టడమే ఆమె నేరం అయింది. దీంతో ఆమెకు ఆన్లైన్లో బెదిరింపులు వస్తున్నాయి. తనను రేప్ చేసి.. హత్య చేస్తామని కొందరు మెసేజ్‌లు పంపుతున్నారని, బెంగళూరులో హత్యకు గురైన ప్రముఖ జర్నలిస్టు గౌరీలంకేశ్‌కు పట్టిన గతే తనకూ పడుతుందని వాట్సాప్‌లో బెదిరిస్తున్నారని జర్నలిస్ట్ దీక్ష శర్మ తెలిపారు. ఓం ప్రకాశ్ మెహ్రా అనే యూట్యూబర్ 'బోల్నా ఆంటీ ఆహు క్యా' పేరిట ఓ అసభ్య మ్యూజిక్ వీడియోను పోస్టు చేశాడు. డబుల్ మీనింగ్.. అసభ్య పదజాలంతో మహిళలను కించపరిచేలా ఉన్న ఈ పాటను చాలామంది యూట్యూబ్‌లో చూశారు. దీనికి 28వేల లైకులు వచ్చాయి. అయితే, ఈ అసభ్య వీడియోపై పలువురు ఫిర్యాదు చేయడంతో యూట్యూబ్ దీనిని తొలగించింది. అయితే, ఈ వీడియోను తప్పుబడుతూ ఆన్లైన్ వెబ్సైట్ 'క్వింట్'లో కథనాన్ని రాసిన దీక్ష శర్మకు బెదిరింపులు వెల్లువెత్తాయి. కాపీరైట్ హక్కుల ఉల్లంఘన, పలువురు నెటిజన్ల ఫిర్యాదుల వల్లే ఈ వీడియోను యూట్యూబ్ తొలగించిందని, ఇందుకు తమ కథనం ఒక్కటే కారణం కాదని దీక్ష శర్మ అంటున్నారు. మరోవైపు ఈ వీడియోను యూట్యూబ్ తొలగించినప్పటికీ ఇతర యూజర్లు దీనిని మళ్లీ అప్లోడ్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ వీడియో అభిమానులు 'ద క్వింట్' కార్యాలయం ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి.