మైండ్ గేమ్
గంపెడు పుస్తకాలు.. ఊపిరి సలపని క్లాసులు.. ఇంటికొస్తే అసైన్మెంట్ల పాట్లు.. కార్పొరేట్ స్కూళ్లు పెరిగిపోయాక విద్యార్థి దశ ఓ యాంత్రిక జీవనమైపోతోంది. ఇక మానసిక ఉల్లాసాన్నిచ్చి.. ఫిజికల్‌గా వ్యాయామాన్ని అందించే అవుట్డోర్ గేమ్స్‌కు తీరిక ఎక్కడుంటుంది! ఆపై చేతిలో మొబైల్స్, ట్యాబ్‌లు వచ్చి పడటంతో ఖాళీ దొరికితే వీడియో గేమ్‌లకే పరిమితమైపోతున్నారు చిన్నారులు.
సొంతగా ఆలోచించి.. మెదడుకు పదును పెట్టే వెసులుబాటే ఉండటం లేదు వారికి. ఈ పరిణామాలను గమనించి.. పిల్లల్లో జనరల్ నాలెడ్జ్, ఆలోచనా శక్తిని పెంచేందుకు కృషి చేస్తున్నాయి నగరంలోని క్విజ్ క్లబ్‌లు. వాటిల్లో ‘కె-సర్కిల్, హైదరాబాద్ క్విజ్ క్లబ్’లు ముందున్నాయి. కాలేజీ విద్యార్థులూ వీటిల్లో భాగస్వాములవుతున్నారు.
‘కె’ అంటే నాలెడ్జ్. నాలెడ్జ్ కోసం తాపత్రయపడే కొంతమంది కలసి ఏర్పాటు చేసిందే కె-సర్కిల్ క్లబ్. ఈ క్లబ్ 42 ఏళ్లుగా వందల సంఖ్యలో క్విజ్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్లబ్ ఆరంభమైన నాటి నుంచి నగరంలో రెగ్యులర్‌గా వివిధ రకాల క్విజ్ యాక్టివిటీస్ నిర్వహిస్తోంది.
కోటు వేసుకుని, గంభీరంగా ప్రశ్నలడిగే క్విజ్ మాస్టర్స్ ఇక్కడ కనిపించరు. బోర్డు మీద మార్కులతో ఉత్కంఠ కలిగించే వాతవరణమూ ఉండదు. కానీ అందరిలో క్విజ్ అంటే ఆసక్తి మాత్రం కామన్. ఔత్సాహికులెవరైనా ఈ క్విజ్‌ల్లో పాల్గొనవచ్చు. ఈ క్లబ్లో చేరవచ్చు. ఇందుకు ఎటువంటి ఎంట్రీ ఫామ్‌లు, రుసుములు అక్కర్లేదు.
వారం వారం...
ప్రతి శనివారం ఈ క్లబ్ ఆధ్వర్యంలో క్విజ్ కార్యక్రమాలు జరుగుతుంటాయి. సికింద్రాబాద్ వైఎంసీఏతో పాటు బంజారాహిల్స్ గోథెజెంత్రమ్, లామకాన్ వేదికలుగా వారాంతపు క్విజ్లు నిర్వహిస్తుంటారు. ఇవే కాకుండా ప్రతి నెలా క్విజ్ ఆఫ్ ది మంత్, అరే భాయ్ అనే స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తారు. క్విజ్ ఆఫ్ ది మంత్ విన్నర్‌కు బహుమతులు అందచేస్తారు.
అలాగే ‘అరే భాయ్’ క్విజ్ విజేతలకు ప్రతి నెలా వచ్చే పాయింట్స్ ఆధారంగా యాన్యువల్ విజేతకు స్పెషల్ ట్రోఫీ అందచేస్తారు. ఉన్నత తరగతి పిల్లలకు స్కూల్ క్విజ్లు, కాలేజ్ పిల్లలకు ఓపెన్ క్విజ్లు రెగ్యులర్‌గా నిర్వహిస్తున్నారు. ఏటా ఈ క్లబ్ నిర్వహించే ఓపెన్ క్విజ్‌లో వయోపరిమితి లేకుండా స్కూల్ పిల్లల నుంచి రిటైర్డ్ ఎంప్లాయీస్ వరకూ పాల్గొంటారు.
ఇక రెగ్యులర్‌గా వీరు నిర్వహించే క్విజ్‌లలో స్కూల్ పిల్లలు మొదలు, ఐఐటీ విద్యార్థులు, సైంటిస్టులు, ఫైనాన్స్, టీచింగ్, సైన్స్, సినిమా, ఐటీ రంగాలకు చెందిన నిపుణులు కూడా పాల్గొంటుంటారు. ఈ క్విజ్‌లలో పార్టిసిపేట్ చేయటమే కాదు, క్విజ్ మాస్టర్‌గా కూడా వ్యవహరించడం చాలా తేలిక. కె-సర్కిల్ వెబ్సైట్లో క్విజ్ కార్యక్రమ తేదీలుంటాయి. ఆ పట్టికలో వివరాలు చేర్చితే సరిపోతుందంటారు ఈ క్లబ్ సభ్యులు అనుపమ్.
హైదరాబాద్ క్విజ్ క్లబ్
ఎలక్ట్రానిక్ మీడియా ఎఫెక్టుతో పిల్లలు పుస్తకాలు చదవటం, చదివిన జ్ఞానాన్ని పంచుకోవటం, ఇంటరాక్షన్ ద్వారా వివిధ విషయాలు తెలుసుకోవటం లాంటి ప్రక్రియ పూర్తిగా తగ్గిపోయింది. ఇందుకు తగిన వాతావరణాన్ని కలిగించడానికి హైదరాబాద్ క్విజ్ క్లబ్‌ను ఏర్పాటు చేశారు శంకర్, నితి. ఈ క్లబ్ ఏర్పాటు చేసి ప్రతి నెలా వివిధ అంశాలపై క్విజ్లు నిర్వహిస్తున్నారు.
‘1900 నుంచి వరకు ప్రముఖులు, రాజకీయ పార్టీలు, నాయకులు, క్రీడలు.. ఇలా ఒక్కో అంశంపై క్విజ్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు కలసి నాలెడ్జ్ షేర్ చేసుకునే అవకాశం కల్పించాలి. అదే ఆలోచనతో ముందుకు వెళుతున్నాం. అందులో ఫన్ కూడా ఉంటుంది. యాక్టివిటీస్‌కు ప్రవేశం ఉచితం’ అని శంకర్ చెప్పారు.