వెయ్యికి పైగా ఇంజనీర్ ఉద్యోగాలు
న్యూఢిల్లీ: చైనీస్ ఇంటర్నెట్ సంస్థ లే ఎకో భారీ సంఖ్యలో ఇంజనీర్లను నియమించుకునేందుకు యోచిస్తోంది. భారతదేశంలో ఆర్ అండ్ డి సెంటర్ కు దాదాపు 1100 మందికి పైగా ఇంజనీర్ కేటగిరీ ఉద్యోగులు అవసరమని ప్రకటించింది. వచ్చే ఏడాదికల్లా వీరిని ఎంపిక చేయనుంది. ప్రధానంగా వీరిని టైర్ 1 ఇంజనీరింగ్ కాలేజీలనుంచి సెలెక్ట్ చేయనున్నట్టు వెల్లడించింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్ ఐటీలనుంచి వీరినుంచి ఎంపిక చేయనున్నామని లె ఎకో ఒక ప్రకటనలో వెల్లడించింది.
బెంగుళూరులో గత వారం నిర్వహించిన ఫ్రెషర్స్ డ్రైవ్ లో అత్యున్నత ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు నుంచి 2,000 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని కంపెనీ తెలిపింది. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన సంస్థ మోడెమ్ సాంకేతికతలు, బీఎస్పి, మల్టీమీడియా, టీవీ బ్రాడ్ కాస్ట్ , ఇంటర్నెట్ టెక్నాలజీస్ తదితర అంశాల్లో నైపుణ్యం ఉన్నవారికోసం అన్వేషిస్తున్నామని లే ఎకో ఇండియా హెడ్( ఆర్ అండ్ డి) శ్రీనివాస్ బైరి చెప్పారు.
కాగా భారత్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ 2017లో నెలకొల్పనున్నట్టు ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే.