R. R. Patil
-
గొలుసు దొంగల్ని పట్టిస్తే నగదు బహుమతి
రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించిన పోలీసు శాఖ సాక్షి, ముంబై: గొలుసు దొంగతనాలను అరికట్టేందుకు పోలీసు శాఖ ఓ వినూత్న యోచన చేసింది. దొంగల్ని పట్టించిన వారికి రూ.15 వేలు నగదు బహుమతి ప్రకటించింది. మరోవైపు గొలుసు దొంగతనాలకు అడ్డుకట్టవేసేందుకు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ఠాణే పోలీసు శాఖ సెంట్రల్ యూనిట్‌ను ఏర్పాటుచేసింది. పట్టుబడిన గొలుసు దొంగలపై మోకా చట్టం కింద కేసు నమోదు చేయడం ప్రారంభించింది. అయినప్పటి కీ ఎటువంటి ఫలితమూ లేకపోయింది. ఇది పోలీసుశాఖకు సవాలుగా మారింది. దీంతో గొలుసు దొంగల్ని పట్టుకునేందుకు అవసరమైతే ఆయుధాలను వినియోగించాలని హోం శాఖ మాజీ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ అప్పట్లో తన సిబ్బందిని ఆదేశించారు. మహిళలు రోడ్లపై నడవకుండా కార్పొరేషన్ సహాయంతో ఫుట్‌పాత్‌లను ఖాళీ చేయించాలని నిర్ణయించారు. అయితే ముంబై, ఠాణే లాంటి కీలక నగరాల్లో ఫుట్‌పాత్‌లను ఖాళీ చేయించడం సాధ్యం కాలేదు. దీంతో చేతులెత్తేసిన పోలీసు శాఖ ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. గొలుసు దొంగలను పట్టుకునే బాధ్యత నగర పౌరులకే వదిలే సింది. ఇందుకు పారితోషికం కింద రూ. 15 నగదు బహుమతిని అందజేసేందుకు సైతం సిద్ధపడింది. బహుమతి ప్రకటించే సమయంలో మహిళలకు కొన్ని సూచనలు కూడా చేసింది. గృహిణులు, ఉద్యోగం చేసే మహిళలు ఇంటి నుంచి బయట ముందు సాధ్యమైనంత వరకు తక్కువ నగలు ధరించాలి. నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంట రిగా నడవకూడదు. మంగళసూత్రం లేదా గొలుసు వేసుకుంటే మెడను చీర కొంగు లేదా దుప్పట్టా (చున్నీ)తో కప్పుకోవాలి. గొలుసు దొంగలు హెల్మెట్ ధరిస్తే కేకలు వేయడంతోపాటు వారు పారిపోతున్న వాహనం నంబరును నోట్ చేసుకోవాలని సూచించింది. ఇందువల్ల వారిని పట్టుకోవడం మరింత సులభమవుతుందని ఆ శాఖ భావిస్తోంది. -
సత్వర శిక్ష!
సాక్షి, ముంబై: వికలాంగులు, మతిస్థిమితం లేని, మైనార్టీ బాలికలపై జరిగిన అత్యాచారం కేసుల విచారణ ఇకపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో జరిగేలా చూస్తామని హోంమంత్రి ఆర్‌ఆర్‌పాటిల్ హామీ ఇచ్చారు. అంబేజోగాయి ప్రాంతంలో ఓ వికలాంగ, మైనార్టీ బాలికలపై జరిగిన అత్యాచారం కేసు విచారణ గురించి అసెంబ్లీలో సభ్యులు ఓం ప్రకాశ్ కడు, ప్రవీణ్ దరేకర్, మంగళ్ ప్రభాత్ లోఢా, వివేక్ పండిత్ అడిగిన ప్రశ్నలకు పాటిల్ పైవిధంగా సమాధానమిచ్చారు. ఈ కేసులకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేశామని, ప్రస్తుతం నిందితులు జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారని, బాధిత బాలికలకు పునరావసం కల్పించేందుకు ప్రభుత్వం కొత్త విధానాల ప్రకారం ఆర్థిక సాయం అందిస్తామన్నారు. వికలాంగులు, మతిస్థిమితం లేని, చిన్నపిల్లలపై జరిగే అత్యాచార కేసులన్నింటి విచారణ ఫాస్ట్ కోర్టుల ద్వారా చేపట్టడమేగాక వాటి దర్యాప్తును డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ అధికారి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తామని పాటిల్ వెల్లడించారు. బాధితులకు అవసరమైతే న్యాయపరమైన సహాయాన్ని కూడా అందిస్తామన్నారు. సముద్ర తీరాల వెంబడి అక్రమ కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వివిధ ఉద్యోగవకాశాల్లో భూమిపుత్రులకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. దేహూ- కాత్రోజ్ బైపాస్ రోడ్డు పనులు 2014లో పూర్తి... పుణే సమీపంలోని దేహూ రోడ్డు నుంచి కాత్రోజ్ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ పనులు 2014 డిసెంబరు వరకు పూర్తవుతాయని ప్రజా పనుల శాఖ మంత్రి ఛగన్ భుజబల్ గురువారం అసెంబ్లీలో తెలిపారు. ఆదర్శ్ రిపోర్డును అసెంబ్లీ ముందుకు తెస్తామని కోర్టుకు చెప్పలేదు: సీఎం ఆదర్శ్ కుంభకోణం కేసుకు సంబంధించి దర్యాప్తు కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామంటూ హైకోర్టుకు ఎటువంటి వివరణ ఇవ్వలేదని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. స్పీకర్ దిలీప్ వల్సే పాటిల్‌కు రాసిన లేఖలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ప్రతిపక్ష సభ్యుడు దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ... ఆదర్శ్ కేసుకు సంబంధించి బీజేపీ హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వివరణ ఇచ్చిందని, దర్యాప్తు కమిషన్ రిపోర్డును అసెంబ్లీలో ప్రవేశపెడతామని కోర్టుకు తెలిపిందని, వారం రోజుల్లోగా రిపోర్డును సభలో ప్రవేశపెట్టేలా ఆదేశాలు జారీ చేయాలని స్పీకర్‌ను కోరారు. అప్పుడే ప్రతిపక్షాలు ఈ విషయమై చర్చ జరిపే అవకాశముంటుందన్నారు. వారం రోజుల తర్వాత నివేదికను సభ ముందుకు తీసుకొస్తే ఎటువంటి చర్చ జరగకుండానే సభ ముగుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ముఖ్యమంత్రి తనకు రాసిన లేఖను స్పీకర్ ఈ సందర్భంగా చదివి వినిపించారు. క్లస్టర్ల అభివృద్ధిపై నెలలో నిర్ణయం: చవాన్ ముంబైలో క్లస్టర్ అభివృద్ధి పథకంపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ హామీ ఇచ్చారు. ఠాణే క్లస్టర్ అభివృద్ధి పథకంపై డిమాండ్ చేస్తూ విధాన మండలిలో శివసేన, బీజేపీ, ఎమ్మెన్నెస్‌లు ఆందోళనకు దిగడంతో సభ అరగంటపాటు వాయిదా పడింది. అనంతరం ఇరుపక్షాలు సభ్యులతో స్పీకర్ మాట్లాడడంతో సభ ప్రారంభమైంది. అనంతరం ముఖ్యమంత్రి చవాన్ మాట్లాడుతూ... ఈ విషయమై సబ్-కమిటీ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాటికి అందజేస్తుందని తెలిపారు. ముంబైలో క్లస్టర్ల అభివృద్ధి విషయమై కేబినెట్ సమావేశంలో చర్చించి, నెలరోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. -
సంజయ్ పెరోల్‌పై విచారణకు ఆదేశించిన హోం మంత్రి
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు పెరోల్‌పై విడుదల చేయవద్దని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆయనకు నెల రోజులు పాటు పేరోల్‌పై విడుదల చేయడాన్ని ఆర్పీఐ తప్పు పట్టింది. శనివారం ఎర్రవాడ జైలు వద్ద పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. సంజయ్ దత్‌ను మిగిలిన ఖైదీలతో సమానంగా చూడాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. తన భార్య మన్యత అనారోగ్యంతో ఉందని, ఈ నేపథ్యంలో తనను నెల రోజులు పెరోల్‌పై విడుదల చేయాలని ఆయన జైలు అధికారులను అభ్యర్థించారు. అయితే జైలు అధికారులు ఆ విషయాన్ని కోర్టుకు నివేదించారు. దాంతో సంజయ్ దత్తు పెరోల్‌పై విడుదల చేసేందుకు కోర్టు అనుమతించింది. అయితే సంజయ్‌కు పెరోల్ రావడం పట్ల పలు ప్రజా సంఘాలు, వివిధ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బాలీవుడ్ నటుడు అయినంత మాత్రాన ఎప్పుడు కోరితే అప్పుడు సంజయ్ దత్‌ను పెరోల్‌పై విడుదల చేస్తారా అంటూ ధ్వజమెత్తాయి. దాంతో ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆ అంశంపై విచారణకు మహారాష్ట్ర హోంశాఖ మంత్రి ఆర్ ఆర్ పాటిల్ ఆదేశించారు. దీనిపై త్వరిత గతిన విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. తీవ్ర అనారోగ్యం కారణంగా ఇప్పటికే సంజయ్ దత్ రెండు సార్లు ఎర్రవాడ జైలు నుంచి పెరోల్‌పై విడుదల అయిన సంగతి తెలిసిందే. 1993 ముంబయి బాంబు పేలుళ్లలో సంజయ్ దత్ నిందితుడని సుప్రీంకోర్టు ధృవీకరించింది. ఆ కేసులో సంజయ్ దత్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం విదితమే.