ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థిని ఆత్మహత్య
న్యూఢిల్లీ: నడుస్తున్న రైలు కిందపడి ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ విద్యార్థిని (20) ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానిక రేస్ కోర్సు మెట్రో స్టేషన్లో ఎల్లో మార్గం మంగళవారం సాయంత్రం గం. 3.45 నిమిషాలకు చోటుచేసుకుంది. రెండో నంబర్ ప్లాట్‌ఫాంకు చేరుకున్న విద్యార్థిని అప్పుడే స్టేషన్‌కు వచ్చిన విద్యార్థిని హుడా సిటీ సెంటర్ స్టేషన్ నుంచి జహంగీర్‌పుర దిశగా వెళుతున్న రైలును గమనించి వెంటనే పట్టాలపైకి దూకింది. తీవ్రగాయాలపాలైన బాధితురాలిని సమీపంలోని రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారని రైల్వే శాఖ డీసీపీ సంజయ్ భాటియా తెలిపారు.
అయితే ఈ చర్యకు గల కారణాలను నిర్ధారించాల్సి ఉందన్నారు. ఘటనాస్థలిలో తమకు ఎటువంటి సూసైడ్ నోటూ లభించలేదన్నారు. మృతురాలిని నైరుతి ఢిల్లీలోని నజఫ్‌గఢ్‌కు చెందిన మూర్తజాగా గుర్తించామన్నారు. కాళింది కళాశాలలో బీఏ చివరి సంవత్సరం చదువుతోందన్నారు. ఇందుకు సంబంధించిన గుర్తింపు కార్డు మృతురాలి దుస్తుల్లో లభించిందన్నారు. కాగా ఈ ఘటన కారణంగా ఎల్లో మార్గంలో రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.