Racing car
-
నిజమే..! తాను తొమ్మిదేళ్ల సూపర్ రేసర్!!
‘రోటాక్స్ మ్యాక్స్ ఛాలెంజ్’ ప్రతి ఏటా జరిగే అంతర్జాతీయ స్థాయి గోకార్ట్ రేసింగ్. 7 నుంచి 15 ఏళ్ల లోపు వయసు పిల్లలు అనేక దేశాల నుంచిపాల్గొంటారు. 9 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లల ‘మైక్రో మ్యాక్స్’ రేస్‌లో ఈసారి విజేతగా నిలిచింది మన కశ్మీర్ చిన్నారి అతికా మీర్. దాదాపు గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గోకార్ట్ నడుపుతూ డ్రైవింగ్ మెళకువలు ప్రదర్శిస్తూ ఈ విజయం సాధించింది. మోటర్‌స్పోర్ట్స్ చరిత్రలో గోకార్ట్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో రేస్ గెలిచిన ఫస్ట్–ఫిమేల్ రేసర్‌గా చరిత్ర సృష్టించింది అతికా మీర్..ప్రతిష్ఠాత్మకమైన రోటాక్స్ మాక్స్ ఛాలెంజ్(ఆర్ఎంసీ) ఇంటర్నేషనల్ ట్రోపీలో మైక్రో మాక్స్ కేటగిరీ రేస్ 2లో అతికా మీర్ విజయం సాధించింది. గోకార్ట్ ఇంటర్నేషనల్ సర్క్యూట్(ఫ్రాన్స్)లోపాల్గొనడం మీర్‌కు ఇదే తొలిసారి. ముందస్తు ప్రాక్టీస్ లేక΄ోయినప్పటికీ కొత్త బ్రాండ్ కార్ట్‌ను వేగంగా ఎడాప్ట్ చేసుకొని తన ప్రతిభ చాటుకుంది. రోటాక్స్ మాక్స్ చాలెంజ్ ప్రతిష్ఠాత్మకమైన రేస్. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన కార్ట్ డ్రైవర్స్‌కు వేదిక. రేస్ 2లో అతికా విజయాన్ని ‘స్పీడ్ అండ్ స్ట్రాటజీ’కి సంబంధించి మాస్టర్‌క్లాస్ అంటున్నారు విశ్లేషకులు.‘రేస్ విన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. యూరప్‌లో ఇది నా తొలి విజయం. ఈ విజయం కోసం చాలా శ్రమ పడ్డాను. నా టీమ్ ఎంతో సహకారాన్ని అందించింది. నా తల్లిదండ్రుల ్ర΄ోత్సాహం నాకెంతో బలం’ అంటుంది అతికా మీర్. దుబాయ్‌లోని మాల్స్‌లో మీర్ సరదాగా ఎలక్ట్రిక్ కార్లు నడిపేది. మీర్ డ్రైవింగ్ స్కిల్స్‌ను చూసి తండ్రితో సహా మాల్లో ఉన్న వాళ్లు ముక్కున వేలేసుకునేవారు. మీర్ తండ్రి ఆసిఫ్ నజీర్ మీర్ మన దేశ తొలి నేషనల్ కార్టింగ్ ఛాంపియన్. డ్రైవింగ్‌కు సంబంధించి తండ్రి ఇచ్చిన రకరకాల టైమ్ చాలెంజ్‌లను బీట్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేది మీర్.‘ఇక టైమ్ వృథా చేయవద్దు. మీర్‌ను కార్టింగ్ ప్రపంచంలోకి తీసుకురా వాల్సిందే’ అనుకున్నాడు ఆసిఫ్ నజీర్. ఇక ఆరోజు నుంచి మీర్‌లో కార్టింగ్పై మొదలైన ఇష్టం అంతకంతకూ పెరుగుతూ ΄ోయింది. ఫిట్నెస్ స్కిల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఫార్ములా వన్‌లో విజయకేతనం ఎగరేసి చరిత్ర సృష్టించాలని కల కనేలా చేసింది.ఆరు సంవత్సరాల వయసులో ఎఫ్ఐఏ ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్న ఫస్ట్ అండ్ యంగెస్ట్ ఫిమేల్ డ్రైవర్‌గా రికార్డ్ సృష్టించింది. మీర్ తొలి ఫుల్ సీజన్ రేసింగ్ యూఏయిలో జరిగిన మినీ ఆర్ కేటగిరితో మొదలైంది. ఈ రేస్‌లో వైస్–చాంపియన్ టైటిల్ గెలుచుకుంది.వచ్చే ఆగస్ట్‌లో మీర్ యూకేలోని వరల్డ్–ఫేమస్ ‘కార్ట్మాస్టర్స్’లో డ్రైవింగ్ చేయనుంది. ఇటలీలోని ఐరన్ డేమ్స్ యంగ్ టాలెంట్ ఈవెంట్‌కు కూడా ఎంపికైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ΄ోటీకి ఎంపికైన 11 మంది బాలికలలో ఆసియా నుంచి ఎంపికైన ఏకైక బాలిక మీర్. ‘రేస్‌కు ముందు నెర్వస్‌గా ఉంటాను. కారులో కూర్చున్న తరువాత మాత్రం పరిస్థితి మరోలా ఉంటుంది. ఎలాగైనా ఈ రేస్‌లో గెలవాల్సిందే అనే పట్టుదల పెరుగుతుంది. భయాలు కొట్టుకు΄ోతాయి’ అంటుంది మెరిసే కళ్లతో అతికా మీర్. ఈ చిన్నారి భవిష్యత్‌లో ఎన్నెన్ని మెరుపులు మెరిపించనుందో వేచిచూద్దాం! -
తుక్కు రేసింగ్ కారుకు వేలంలో రూ.15 కోట్లు
కాలిఫోర్నియా: 1960వ దశకంలో రేసింగ్‌లో పాల్గొంటుండగా మంటల్లో చిక్కుకొని తుక్కుగా మారిన ఫెరారీ కారు తాజాగా వేలంలో రూ.15 కోట్ల(1.8 మిలియన్ డాలర్లు) ధర పలికింది. ఈ ‘ఫెరారీ 500 మాండియార్ స్పైడర్ సిరీస్–1’ కారును 1954లో తయారు చేశారు. ప్రముఖ ఇటాలియన్ రేసర్ అల్బర్టో అస్కరీ 1952, 1953లో ఫార్ములా వన్ వరల్డ్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో సాధించిన విజయాలకు గుర్తుగా ఫెరారీ సంస్థ దీన్ని తయారు చేసింది. రేసింగ్ డ్రైవర్ ఫ్రాంకో కోర్టెస్ 1954లో కారును కొనుగోలు చేశాడు. అనంతరం 1958లో ఇది అమెరికాకు చేరుకుంది. 1960లలో ఓ రేసులో ప్రమాదానికి గురై మంటల్లో కాలిపోయింది. 1978 వరకూ పలువురి చేతులు మారుతూ వచి్చంది. పూర్తిగా ధ్వంసమైన స్థితిలో ఉన్న ఈ కారును ఓ వ్యక్తి కొనుగోలు చేసి, దాదాపు 45 ఏళ్లపాటు అలాగే కాపాడుతూ వచ్చాడు. ఇటీవల ఆర్ఎం సోథ్‌బీ సంస్థ ఈ కారును వేలం వేసింది. ఏకంగా రూ.15 కోట్లు పలికింది. కారును బాగుచేసి, మళ్లీ రేసింగ్ ట్రాక్‌పై తీసుకొస్తానని దాన్ని కొనుక్కున్న వ్యక్తి చెప్పాడు. -
మహీంద్రా ఈ-రేసింగ్ జనరేషన్ త్రీ కార్ షోలో కేటీఆర్, రామ్‌చరణ్ (ఫొటోలు)
-
వరల్డ్ ఫస్ట్..రేసింగ్ కార్ కన్నా వేగంగా పని..
కార్ల రేస్‌లకు సంబంధించిన పోటీలను టీవీలో చూస్తున్నప్పుడు కొన్ని అత్యంత వేగంగా పల్టీలు కొడుతుండటం చూస్తుంటాం. ప్రమాదానికి గురైన కార్లను రేస్‌కు అడ్డు రాకుండా అంతే వేగంగా తొలగించే కార్యక్రమం కూడా జరుగుతుంటుంది. ఇప్పటివరకు ఈ పనిని పురుషులే చేసేవారు. కానీ, ఈ ప్రపంచంలోకీ ఓ మహిళ అడుగుపెట్టి, తన సత్తా చాటుతోంది. దీంతో వరల్ట్ ఫస్ట్ ఫిమేల్ క్రేన్ డ్రైవర్‌గా 30 ఏళ్ల మరియన్ అల్–బజ్ గుర్తింపు పొందింది. రేస్ పోటీల్లో క్రేన్ డ్రైవర్‌గా ఓ మహిళ నియమితురాలవడం ప్రపంచమంతా గుర్తించదగిన విషయంగా అరబ్ ట్రిబ్యూన్ ప్రకటించింది. ‘మోటార్ ఇంజిన్ల పట్ల ఆమెకున్న మక్కువే ఈ ఏడాది దిరియా ఇ–ప్రిక్స్ 2022లో పాల్గొనేలా చేసింద’ని స్పష్టం చేసింది. పురుషాధిపత్య రంగంలో ఆల్–బజ్ చూపిన సాహసం ఎంతోమంది మహిళల్లో స్థైర్యాన్ని నింపుతోంది. అల్–బజ్ 13 ఏట నుండి వాహనాలను నడపడంలో ఆసక్తి చూపింది. ఈ విషయాల గురించి ఆమె ఇలా ప్రస్తావిస్తుంది. ఆసక్తి నేర్పిన పాఠం ‘ఒక మహిళ ఈ రంగంలోకి ప్రవేశించగలదని ఎవరూ ఎప్పుడూ అనుకొని ఉండరు. మెకానికల్ ప్రపంచమంటేనే పురుషుల ఆధిపత్య వృత్తి. మా నాన్నకు మెకానిక్ పని అంటే చాలా ఇష్టం. ఆయన వద్ద చాలా పాత కార్లు ఉన్నాయి. వాటిని రిపేర్ చేసి, మళ్లీ మార్కెట్లోకి తీసుకువస్తాడు. నా చిన్నప్పటి నుంచి నాన్న చేసే పనిని ఆసక్తిగా చూస్తుండేదాన్ని. మెల్ల మెల్లగా నైపుణ్యాలను తెలుసుకుంటూ, పెంచుకుంటూ వచ్చాను. ఎప్పుడైనా, దేనిలోనైనా ప్రతిభ చూపాలనుకుంటే మా పేరెంట్స్ నాకు పూర్తి మద్దతు ఇస్తారు. అలా చదువుతోపాటు మెకానిక్ పరిజ్ఞానం కూడా అబ్బింది. సాధనతోనే చేరువైన కల ప్రతి కార్తోనూ ఎగ్జిబిషన్స్ లేదా రేసుల్లో పాల్గొనేదాన్ని. దీంతో నా కలను మరింత ముందుకు తీసుకెళ్లగలిగాను. నా ఇన్నేళ్ల జీవితంలో కార్లనే అపరిమితంగా ఇష్టపడ్డాను. రేసింగ్, డ్రిఫ్టింగ్‌లో తగినంత అనుభవం ఉంది. జూన్, 2018లో అరబ్ కంట్రీలో మహిళల డ్రైవింగ్‌పై నిషేధం ఎత్తివేయడంతో రేస్, డ్రైవర్, మెకానిక్ ల వంటి పాత్రలు మహిళలకు అవకాశాలు దక్కేలా చేశాయి. మెకానిక్‌ను కావాలనే నా లక్ష్య సాధనకు ఇది కూడా ఉపయోగపడింది. ఇప్పుడు వీధిలోంచి వెళ్తే చాలు... చుట్టూ ఉన్నవారు నా గురించి తెలుసుకోవడం, గుర్తుపట్టి పలకరించడం, ప్రోత్సహించడం, నా నుంచి నేర్చుకోవాలని ఆసక్తి చూపుతుండటం నాకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. కష్టమైన ఛాలెంజ్ ఈ ఏడాది జరిగిన ఇ–ప్రిక్స్‌లో ఫైర్, రికవరీ, ఫాగ్, ట్రాక్‌సైడ్ వంటి నాలుగు రకాల మార్షల్స్ ఉన్నాయి. వీటిలో నా సామర్థ్యాలను చూసి అధికారులు రికవరీ మార్షల్ బృందానికి రిఫర్ చేశారు. రేసు జరిగేటప్పుడు ట్రాక్‌పై ప్రమాదం జరిగితే వెనువెంటనే వారు తగిన చర్యలు తీసుకుంటారు. ఇన్నాళ్లూ రికవరీ మార్షల్‌గా ఉండటం మహిళలకు కష్టమైన పనిగా పరిగణించ బడింది. సర్క్యూట్లో ప్రమాదం జరిగినప్పుడు వీలైనంత త్వరగా కార్లను తీయడానికి క్రేన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. నా పని ఎంత వేగంగా చేయాలంటే రేసు ప్రవాహానికి అడ్డుపడనంత స్పీడ్‌గా ఉండాలి. ఏదైనా కారు రోడ్ బ్లాక్‌కు కారణమయితే, ఇతర రేసర్లకు అడ్డు అవుతుంది. అందుకే, ఈ వృత్తిలో ఏమాత్రం అలక్ష్యం చేయకుండా ప్రతి క్షణం అలర్ట్‌గా ఉండాలి’ అని తన పని గురించి వివరిస్తుంది అల్–బజ్. ఈ యువ డ్రైవర్ నేర్చుకున్నది మెకానిక్ పని. చదువు మాత్రం పూర్తి భిన్నమైది. లెబనాన్‌లో సైకాలజీ అండ్ మీడియాకు సంబంధించిన కోర్సులు పూర్తి చేసింది. కానీ, మోటార్ కార్ల ప్రపంచంలో తనని తాను నిరూపించుకోవడానికి ముందుంటుంది. తన మెకానిక్ నైపుణ్యాలతో ఇతరులకు శిక్షణ కూడా ఇస్తోంది. సొంతంగా ఆటోమొబైల్ రిపేర్ షాప్‌ను నిర్వహించాలనుకుంటున్న అల్–బజ్ డేరింగ్ డ్రైవర్‌గా మన్ననలు అందుకుంటోంది. -
రేసింగ్‌కు పాల్పడితే లైసెన్స్ రద్దు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఖరీదైన వాహనాలతో రోడ్లపై రేసింగ్, ఛేజింగ్‌లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు రవాణా శాఖ సిద్ధమవుతోంది. గతంలో రాత్రి వేళల్లో మాత్రమే యువకులు రేసింగ్‌లకు పాల్పడేవారు. కానీ ఇప్పుడు ఉదయం, మధ్యాహ్నం వేళల్లోనూ రేసింగులకు పాల్పడుతున్నారు. నెక్లెస్ రోడ్డు, పీవీ ఎలివెటెడ్ ఎక్స్‌ప్రెస్ వే, ఔటర్ రింగురోడ్లపై వారు రెచ్చిపోతున్నారు. ఆదివారం ఉదయం పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై 2 ఖరీదైన స్పోర్ట్స్ కార్లలో విపరీతమైన వేగంతో దూసుకుపోతున్న వారిని పోలీసులు వెంబడించి మరీ పట్టుకున్నారు. దీనిపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పందించారు. నగరంలో ఇలాంటి వాహనాలు ఎన్ని ఉన్నాయో గుర్తించి వాటి యజమానులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఒకసారి కౌన్సెలింగ్ ఇచ్చాక కూడా వాహనాలను పరిమితికి మించిన వేగంతో నడిపినట్లు తేలితే వారి లైసెన్స్ రద్దు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. వాహనాలను కూడా సీజ్ చేస్తారు. -
అదరహో!
మేడ్చల్ రూరల్: మండలంలోని సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కళాశాలవిద్యార్థులు తక్కువ బడ్జెట్‌తో రేసింగ్ కారును తయారు చేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు. మెకానికల్ విభాగంలో 3వ, 4వ సంవత్సరం చదువుతున్న 27 మంది విద్యార్థులు ఈ కారును రూపొందించారు. దీనిని గురువారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల డెరైక్టర్ సరోజారెడ్డి మాట్లాడుతూ... ఈ సంవత్సరం జనవరి నెలలో భువనేశ్వర్‌లో సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజినీర్స్ (ఎస్‌ఏఈ) ఆధ్వర్యంలో రేసింగ్ కార్ల తయారీ కోసం ‘సుప్ర 2014’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న తమ కళాశాల విద్యార్థులకు కారు తయారు చేయడానికి అనుమతి లభించిందని తెలిపారు. తక్కువ ధరతో రేసింగ్ కారును తయారు చేయడానికి విద్యార్థులు నానో కారు ఇంజిన్‌కు ఇతర విడి భాగాలు అమర్చారని, రూ. లక్షా 97 వేల ఖర్చుతో కారును తయారు చేశారన్నారు. ఎస్‌ఏఈ సంస్థ తిరిగి గత జుైలై నెలలో చెన్నైలో కార్ల ప్రదర్శన నిర్వహించంగా.. అందులో పాలుపంచుకున్న తమ విద్యార్థుల కారు అతి తక్కువ ధరతో తయారైన కారుగా నిలిచిందన్నారు. 590 సీసీతో రూపొందిన ఈ కారును రిమోబుల్ స్టీరింగ్, సస్పెన్షన్ సిస్టమ్‌తో పూర్తి స్థాయిలో తయారుచేసి ప్రదర్శించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కళాశాల పిన్సిపాల్ డాక్టర్ ఈఎల్ నగేష్, అధ్యాపకుడు నాగేంద్ర, విద్యార్థులు పాల్గొన్నారు.