Ragala 24 Gantallo
-
నా నమ్మకం నిజమైంది
ఈషారెబ్బా, సత్యదేవ్, శ్రీరామ్, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో..’. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస్ కానూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి కాస్త నిరాశకు లోనయ్యాం. కానీ శనివారం మార్నింగ్ షో, మ్యాట్నీ షోలు హౌస్‌ఫుల్ అవ్వడం, అన్ని చోట్ల కలెక్షన్స్ కూడా బాగుండటంతో చాలా హ్యాపీ ఫీలయ్యాం. సినిమా చూసినవాళ్లు బాగుంది చూడమని ఇంకో పదిమందికి చెబుతున్నారు. నేను ఏదైతే నమ్మి సినిమాను తీశానో అది నిజమైంది. బుధవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ టూర్ ప్లాన్ చేశాం. ఈషా, సత్యదేవ్ బాగా నటించారు. శ్రీనివాస్ రాజీ పడకుండా ఈ సినిమా నిర్మించారు. ఆయన బ్యానర్లోనే ‘భార్యదేవోభవ’ అనే సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాను. ఓ ప్రముఖ హీరో నటిస్తారు. పదిమంది హీరోయిన్లు ఉంటారు’’ అన్నారు. ‘‘విద్య’ పాత్రను బాగా చేశానని చెబుతుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు ఈషా రెబ్బా. ‘‘థ్రిల్లర్ సినిమాని బాగా గ్రిప్పింగ్‌గా తీశాడని కె.రాఘవేంద్రరావుగారు ఫోన్ చేసి చెప్పడం మరచిపోలేని అనుభూతి’’ అన్నారు శ్రీనివాస్ కానూరి. సత్యదేవ్, సంగీత దర్శకుడు రఘు కుంచె, గణేష్ వెంకట్రామన్, రవివర్మ, ముస్కాన్, కెమెరామన్ అంజి మాట్లాడారు. -
‘రాగల 24 గంటల్లో’ మూవీ రివ్యూ
మూవీ: రాగల 24 గంటల్లో జానర్: సస్పెన్స్ థ్రిల్లర్ నటీనటులు: ఈషా రెబ్బ, సత్య దేవ్, శ్రీరామ్, గణేశ్ వెంకట్రామన్, టెంపర్ వంశీ, ముస్కాన్ సేథీ, రవివర్మ, కృష్ణభగవాన్, అదిరే అభి తదితరులు దర్శకత్వం: శ్రీనివాస్ రెడ్డి సంగీతం: రఘు కుంచె మాటలు: కృష్ణభగవాన్ నిర్మాత: శ్రీనివాస్ కానూరు వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే క్రేజీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఈ సారి క్రైమ్ బాట పట్టాడు. అదేనండి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించాడు. ఈషా రెబ్బా లీడ్ రోల్లో సత్యదేవ్, శ్రీరామ్, ముస్కాన్ సేథీ, గణేశ్ వెంకట్రామన్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘రాగల 24 గంటల్లో’చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కథా బలం ఉండి కాస్త సస్పెన్స్, ఎంటర్టైన్ తోడైతే క్రైమ్ స్టోరీ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. మరి సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల మదిని దోచిందా? తన పంథా మార్చుకుని తొలిసారి క్రైమ్ బేస్డ్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు విజయవంతం అయ్యాడా? చూద్దాం. కథ: ఇండియాలోనే నంబర్ వన్ యాడ్ ఫిల్మ్ మేకర్ రాహుల్(సత్య దేవ్) ఎవరూ లేని అనాథ అయిన విద్య(ఈషా రెబ్బ)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే వివాహ బంధంతో ఒక్కటైన మూన్నాళ్లకే వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభం కావడం.. రాహుల్ ప్రవర్తనతో విద్య విసిగిపోతుంది. అయితే అనుకోని పరిస్థితుల్లో రాహుల్ హత్యకు గురవుతాడు. అది ఎవరు చేశారు? ఆ మిస్టరీని ఏసీపీ నరసింహం(శ్రీరామ్) చేధించాడా? విద్య, గణేశ్, అభిల మధ్య ఉన్న పరిచయం ఏంటి? ఈ మిస్టరీ కేసుకు దాస్(రవివర్మ), పుణీత్, వినీత్, అద్వైత్, మేఘన(ముస్కాన్ సేథీ)లకు ఏంటి సంబంధం? అనేదే మిగతా కథ. నటీనటులు: ప్రస్తుత కుర్ర హీరోలు కెరీర్ ఆరంభంలోనే నెగటీవ్ రోల్స్‌కూ సై అంటున్నారు. మొన్న కార్తికేయ.. నేడు సత్యదేవ్. ఇప్పటివరకు సత్యదేవ్‌ను పాజిటివ్ యాంగిల్లోనే చూసిన అభిమానులు తొలిసారి విలన్‌గా చూస్తారు. సత్యదేవ్ నటన చూశాక సైకోయిజం, కన్నింగ్, అనుమానం ఇలా ఏదనుకున్న యాప్ట్ అవుతుంది. తొలిసారి నెగటీవ్ షేడ్‌లో కనిపించిన సత్యదేవ్ విలనిజంలో పూర్తిగా లీనమవుతాడు. సినిమాలో లీనమైన వారు అతడు బయట కనిపిస్తే అసహ్యించుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రేంజ్లో నటించాడు. సారీ జీవించాడు. ఇక ఈషా రెబ్బ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. చాలా కాలం తర్వాత టాలీవుడ్లో కనిపించిన ‘ఒకరికి ఒకరు’హీరో శ్రీరామ్ ఈ సినిమాలో నెగటీవ్ షేడ్‌లో కనిపించాడు. తొలుత సిన్సియర్ ఏసీపీగా కనిపించినా చివరకు అసలు రంగు బయటపడుతుంది. ఇక గణేశ్ వెంకట్రామన్ కనిపించేది రెండు మూడు సీన్లలోనైనా మెప్పించాడు. ఇక సెకండాఫ్‌లో కాసేపు కనిపించి కథకు ప్రధానమైన ముస్కాన్ సేథీ అలరించింది. అంతేకాకుండా తన అందచందాలతో యూత్ కలల రాణిగా మారేలా చేసుకుంది. రవివర్మ, టెంపర్ వంశీ, అదిరే అభి, తదితరులు తమ పాత్రల మేరకు మెప్పించారు. విశ్లేషణ: ‘అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు, విలన్లు లేరు ఈ నాటకంలో’ఈ డైలాగ్ కాస్త అటూ ఇటూగా ఈ సినిమాకు సెట్ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో హీరోలు అనుకునే వారు మంచి వారు కాదు.. విలన్లు అనుకునే వారు చెడ్డ వారు కాదు. ఇలా విలక్షణమైన స్టోరీ లైన్ పట్టుకుని పూర్తి కథను అల్లాడు రచయిత. దీనికి క్రైమ్, సస్పెన్స్‌కు తోడు ఫుల్ గ్లామర్ వడ్డించిన సినిమాను ప్రేక్షకుల ముందు పెట్టాడు దర్శకుడు. ఊహకందని ట్విస్టులతో డైరెక్టర్ తన మ్యాజిక్ చూపించాడు. తొలి అర్థభాగంలో ముగ్గురు నేరస్తులు పారిపోవడం, విద్య ఇంట్లోకి చొరబడటం, అప్పటికే అతను హత్యకు గురవడం లాంటి అంశాలు ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్‌లో తన పూర్తి అనుభవాన్ని రంగరించిన దర్శకుడు ఎవరూ ఊహించని విధంగా కథను మలుపుతిప్పుతాడు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్లకు లాజిక్ మిస్ అయితే ప్రేక్షకుడికి రుచించదు. కానీ ఈ విషయంలో దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కామెడీ సినిమాల డైరెక్టర్‌గా ముద్ర పడిపోయినా.. మధ్యలో ఢమరుకం, శివమ్ వంటి డిఫరెంట్ మూవీలను తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ తాజాగా క్రైమ్ థ్రిల్లర్‌తోనూ ప్రేక్షకులను మెప్పించడంలోనూ విజయం సాధించాడు. ఇక తన నటన, అందంతో సినిమాకు ప్రాణం పోసింది ఈషా రెబ్బ. సరైన అవకాశం దక్కాలే కాని తన నట విశ్వరూపం ప్రదర్శిస్తానని ఈ సినిమాతో టాలీవుడ్ దర్శకనిర్మాతలకు సవాల్ విసిరింది ఇషా రెబ్బ. ఆనందం, భయం, కోపం, జాలి, బాధ, శృంగారం ఇలా నవరసాలను ఇషా రెబ్బ అవలీలగా పండించింది. కెమెరామెన్ గరుడవేగ అంజి సినిమాను రిచ్ లుక్‌లో చూపించాడు. ముఖ్యంగా ఈషా రెబ్బ అందచందాలను చూపించడంలో కెమెరామన్ పనితనం సినిమాలో కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు మాటలు అందించి, నటించిన కృష్ణ భగవాన్ రెండింటిలోనూ తన మార్క్ చూపించుకున్నాడు. ‘నాపై ఉన్న ప్రేమను చెప్పడానికి నీకు పదాలు చాలవు.. నాకు గిప్ట్ ఇద్దామనుకున్నా నన్ను మించిన గొప్పది నీకు దొరకదు, మనసులో టెన్షన్.. ఇంట్లో శవం రెండూ భయంకరమే’ వంటి డైలాగ్‌లు అలరిస్తాయి. సంగీత దర్శకుడు రఘు కుంచె ఇచ్చిన పాటలు ఉన్నంతలో పర్వాలేదనిపిస్తాయి. భాస్కరబట్ల, శ్రీమణిల కలం పనితనం పాటల్లో కనిపిస్తుంది. కాదు వినిపిస్తుంది. ఇక ఎడిటింగ్, నిర్మాణ విలువుల సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. ఓవరాల్‌గా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుల మదిని థ్రిల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్లస్ పాయింట్స్: ఈషా రెబ్బ నటన సత్య దేవ్ విలనిజం సస్పెన్స్ దర్శకత్వం కెమెరా పనితనం మైనస్ పాయింట్స్ ఊహకందే పలు ట్విస్టులు సాగదీత సీన్లు - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
నా గత వైభవాన్ని తీసుకొచ్చే సినిమా ఇది
ఈషా రెబ్బా లీడ్ రోల్లో సత్యదేవ్, శ్రీరామ్, ముస్కాన్ సేథీ, గణేశ్ వెంకట్రామన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కానూరి శ్రీనివాస్ నిర్మించారు. నేడు ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ–రిలీజ్ వేడుకలో దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘నా గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా హిట్ కొట్టి సక్సెస్ఫుల్ దర్శకుడిగా వెలుగొందుతాననే నమ్మకం ఉంది. నా గత వైభవాన్ని తీసుకొచ్చే సినిమా ఇది. నా పక్కనే నిలబడి నన్ను నడిపించారు నిర్మాత కానూరి శ్రీనివాస్. బతికున్నంత కాలం అతన్ని వదలను. మంచి సినిమా తీశామనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘అనుష్క, కాజల్, రెజీనా లాంటి హీరోయిన్స్ కథ విన్నా డేట్స్ కుదరక చేయలేదు. తెలుగందం ఈషారెబ్బాతో పని చేశామని గర్వంగా చెబుతున్నాం. శ్రీనివాస్‌రెడ్డిగారు అద్భుతమైన సినిమా చేశారు’’ అన్నారు నిర్మాత శ్రీనివాస్ కానూరి. ‘‘కథ విన్న తర్వాత ఈ పాత్రకు న్యాయం చేయగలనా? అని భయపడ్డాను. అద్భుతమైన కథ. మంచి పాత్రలను డిజైన్ చేశారు శ్రీనివాస్‌రెడ్డిగారు’’ అన్నారు సత్యదేవ్. ‘‘తెలుగు అమ్మాయిలకు లేడీ ఓరియంటెడ్ సినిమాలు రావాలంటే అదృష్టం కావాలి. తెలుగమ్మాయిలకు అవకాశాలు రావడం లేదు. శ్రీనివాస్ రెడ్డిలాంటి దర్శకులు ఉండబట్టే మేం ఇండస్ట్రీలో ఉన్నాం. శ్రీనివాసరెడ్డిగారు చాలా కూల్. సత్యదేవ్ మన తెలుగు విక్కీకౌశల్. ఇలాంటి టీమ్‌తో పని చేయడం సంతోషంగా అనిపించింది’’ అన్నారు ఈషా రెబ్బా. శ్రీరామ్, ముస్కాన్ సేథీ, గణేశ్ వెంకట్రామన్, రఘు కుంచె తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నేను హాట్ గాళ్‌నే!
‘‘తెలుగు అమ్మాయిని కాబట్టి మన సంప్రదాయాలకు తగ్గ పాత్రలు చేసే అవకాశాలే దక్కాయి. నటిగా నాకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. గ్లామరస్ పాత్రలకూ సిద్ధమే. నేను హాట్గాళే (నవ్వుతూ)’’ అన్నారు ఈషా రెబ్బా. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో...’. ఈషా రెబ్బా ప్రధాన పాత్రధారి. కానూరి శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈషా రెబ్బా చెప్పిన సంగతులు. ►ఇందులో నా పాత్ర పేరు విద్య. భావోద్వేగంతో కూడిన పాత్ర ఇది. నేను నటించిన తొలి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ కూడా కావడంతో మానసిక ఆందోళనకు గురయ్యాను. ఈ సినిమా సమయంలోనే మరో తమిళ సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి వచ్చింది. ►ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. 24 గంటల్లో జరిగే కథ ఇది. నా పాత్ర చుట్టూ అన్ని పాత్రలు తిరుగుతుంటాయి. అలా అని మిగతా పాత్రలకు ప్రాధాన్యం లేదని కాదు. అందరి పాత్రలు కీలకమే. స్క్రీన్‌ప్లే ఉత్కంఠగా ►‘‘ఢమరుకం’ మినహాయించి అన్నీ కామెడీ సినిమాలు చేసిన శ్రీనివాస్‌రెడ్డి తొలిసారి సస్పెన్స్ థ్రిల్లర్ చేస్తున్నారు. ఎలా డైరెక్ట్ చేస్తున్నారు’’ అని నన్ను కొందరు అడిగారు. ఆయన అద్భుతంగా తెరకెక్కించారు. ఈ జానర్లో అనుభవం ఉన్న దర్శకుడిలాగానే చేశారు. ►దర్శకుడు నన్ను నయనతారతో పోల్చారు అంటే అందుకు ఆయనకు థ్యాంక్స్. కానూరి శ్రీనివాస్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ►నా కెరీర్ సంతృప్తికరంగానే సాగుతోంది. నాకు వచ్చిన అవకాశాల్లో ఫలానా పాత్ర సూట్ అవుతుందనుకుంటేనే గ్రీన్‌సిగ్నల్ ఇస్తాను. కానీ డైరెక్టర్, హీరో, క్యారెక్టర్.. ఈ మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుని కథకు ఓకే చెప్తాను. స్టార్ హీరో, పెద్ద డైరెక్టర్, సినిమా అంటే కథ ఓ మోస్తరుగా ఉన్నా ఓకే చెబుతాను. ఎందుకంటే అది నా కెరీర్‌కు హెల్ప్ అవుతుందని నమ్మకం. ►నెట్‌ఫ్లిక్స్ కోసం తెలుగు ‘లస్ట్ స్టోరీస్’లో నటించాను. హిందీ ‘లస్ట్ స్టోరీస్’కి ఇది డిఫరెంట్. సంకల్ప్ దర్శకత్వం వహించారు. తమిళంలో జీవీ ప్రకాశ్‌తో కలిసి చేసిన సినిమా విడుదలకు సిద్ధమైంది. కన్న డలో శివరాజ్‌కుమార్ సినిమాలో నటించబోతున్నాను. ఓ తెలుగు సినిమాకు చర్చలు జరుగుతున్నాయి. -
నిర్మాతే నా హీరో
‘‘నేను గతంలో చేసిన సినిమాలన్నీ కామెడీ టచ్ ఉన్నవి. ‘రాగల 24 గంటల్లో..’ సినిమాతో మొదటిసారి పూర్తిస్థాయి థ్రిల్లర్ జానర్లో సినిమా చేశా. స్క్రీన్‌ప్లే ప్రధానమైన సినిమా ఇది. తర్వాత ఏం జరుగుతుంది? అనే సస్పెన్స్‌లో ప్రేక్షకుడు ఉంటాడు’’ అన్నారు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. ఈషారెబ్బా ప్రధాన పాత్రలో సత్యదేవ్, శ్రీరామ్, గణేశ్ వెంకట్రామన్, కృష్ణభగవాన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో..’. కానూరి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న రిలీజ్ కానుంది. చిత్ర దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి పంచుకున్న విశేషాలు... ► నేను, కృష్ణభగవాన్ రెండు స్క్రిప్ట్స్ తయారు చేస్తున్నాం. ఆ సమయంలో ‘రాగల 24 గంటల్లో..’ కథను శ్రీనివాస్ వర్మ తీసుకొచ్చారు. మా అందరికీ నచ్చడంతో ఈ సినిమాని ప్రారంభించాం. 24గంటల్లో జరిగే కథ ఇది. ► హీరోయిన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈషారెబ్బా నటన చూశాక నయనతారలా చేసింది అంటారు. సత్యదేవ్ నట విశ్వరూపం చూస్తారు. శ్రీరామ్ ఏసీపీ పాత్ర చేశారు. ఈ సినిమాలో కామెడీ చొప్పించాలనే ప్రయత్నం చేయలేదు. ► ‘ఢమరుకం’ తర్వాత నాగచైతన్యతో ‘హలో బ్రదర్’ రీమేక్ చేయాలనుకున్నాం. సమంత, తమన్నా హీరోయిన్లు. 10 నెలలు స్క్రిప్ట్ వర్క్ చేశాం. అది సెట్స్ మీదకు వెళ్లలేదు. చైతన్యతోనే ‘దుర్గా’ అనే సినిమా అనుకున్నాం. హన్సిక హీరోయిన్గా. అదీ వర్కౌట్ కాలేదు. అక్కడ నాకు రెండేళ్ల గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ‘మామ మంచు అల్లుడు కంచు’ చేశా. ఆ సినిమా చేసిన రెండేళ్లకు ఈ సినిమాతో వస్తున్నాను. ► శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ డైరెక్టర్ కావడం స్వామికి సేవ చేసుకునే అవకాశం వచ్చిందనుకుంటున్నాను. త్వరలోనే యస్వీబీసీ చానల్ హెచ్డీ ప్రసారాలు అందించనున్నాం. కన్నడ, తమిళ, హిందీ భాషల్లోనూ ఈ చానల్ని విస్తరించాలనుకుంటున్నాం. దర్శకుడన్నాక ఎలాంటి సినిమా అయినా డీల్ చేయాలి. కోడి రామకృష్ణగారు, ఈవీవీగారు అన్ని రకాల సినిమాలు చేశారు. నేను కూడా వారిలా అన్నీ చేయాలనుకుంటున్నాను. ► నేను ఫామ్‌లో లేకపోయినా నన్ను నమ్మి ఈ సినిమా తీశాడు కానూరి శ్రీనివాస్. నా నిర్మాతే నా హీరో. సినిమా అంటే తనకు చాలా ప్యాషన్. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా మా సినిమా రిలీజ్ అవుతోంది. శ్రీనివాస్ కానూరి ప్రొడక్షన్లోనే మరో రెండు సినిమాలకు దర్శకత్వం వహిస్తాను. -
ప్రేక్షకులను అలా మోసం చేయాలి
‘‘చాలా రోజులు కష్టపడి ఓ సినిమాను తెరకెక్కిస్తాం. ముందుగా చెప్పిన విడుదల తేదీకే సినిమాను విడుదల చేయాలని కొందరు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో రాజీ పడుతుంటారు. అది తప్పు అని నా అభిప్రాయం. సమయం ఉన్నప్పుడు రీ–రికార్డింగ్‌కు మరింత సృజనాత్మకతను జోడించి ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉంటుంది’’ అన్నారు సంగీత దర్శకుడు రఘు కుంచె. ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస్ కానూరు నిర్మించారు. సత్యదేవ్, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. చిత్ర సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ... ► ఓ హత్య నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈషా రెబ్బా పాత్ర చుట్టూ మిగిలిన పాత్రలు తిరుగుతుంటాయి. ఇందులో మూడు పాటలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ప్రమోషనల్ సాంగ్. ‘మామ మంచు అల్లుడు కంచు’ సినిమాకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి పని చేశాను. ‘ఢమరుకం’ మినహా ఆయన ఎక్కువగా హాస్యభరిత చిత్రాలు తీశారు. ‘రాగల 24 గంటల్లో’ చిత్రం థ్రిల్లర్ జానర్లో ఉంటుంది. ► కెమెరా, నేపథ్య సంగీతం ఈ సినిమాకు రెండు కళ్లు లాంటివి. థ్రిల్లర్ చిత్రాల్లో స్క్రీన్ ప్లే కూడా చాలా ముఖ్యం. స్క్రీన్‌ప్లే ఉత్కంఠగా సాగేందుకు మంచివారిని చెడ్డవారిగా, చెడ్డవారిని మంచి వారిగా చూపిస్తూ ప్రేక్షకులను మోసం చేయాలి. కొన్నిసార్లు సౌండ్‌తోనే ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యేలా చేయాలి. ఈ సినిమా కోసం దాదాపు 30 రోజులు ఆర్ఆర్(రీరికార్డింగ్) వర్క్ చేశాం. ► ఇప్పటి వరకు 18 సినిమాలకు సంగీతం అందించాను. దర్శకుడికి నచ్చలేదని ఇప్పటి వరకు రెండో ట్యూన్ చేసింది లేదు. మొదటి ట్యూనే కరెక్టుగా వచ్చేందుకు కష్టపడతా. నా కెరీర్ పట్ల సంతృప్తికరంగానే ఉన్నాను. అనుకున్నంత వేగం లేదు. కానీ, ఏడాదికి రెండుమూడు సినిమాలు చేస్తూ రేస్‌లోనే ఉన్నాను. కొన్ని సార్లు సంగీతం బాగున్నప్పటికీ సినిమా ఆడకపోతే ఆ ప్రభావం సంగీత దర్శకుడిపై పడే అవకాశం ఉంది. ► ఒక సినిమాకు ఒకరు ఆర్ఆర్ మరొకరు మ్యూజిక్ ఇవ్వడం సరికాదన్నది నా భావన. ఆర్ఆర్, మ్యూజిక్కు కలిపి ప్యాకేజ్డ్గా నేను ఓ సినిమాను ఒప్పుకున్నాను. కానీ ఒకరు జోక్యం చేసుకుని ఆర్ఆర్ ఇచ్చి, మూవీ బిజినెస్ విషయంలోనూ సహాయం చేస్తాననడంతో యూనిట్ వారు ఆయనకు అవకాశం ఇచ్చారు. అలా రెండు సినిమాలు దూరమయినప్పుడు చాలా బాధపడ్డాను. ► ప్రస్తుతం ‘పలాస’ సినిమాలో నటిస్తూ, సంగీతం అందిస్తున్నాను. ఈ సినిమా విడుదల తర్వాత నటుడిగా నాకు మంచి అవకాశాలు వస్తే తప్పక చేస్తాను. -
రాగల 15 రోజుల్లో...
‘ఢమరుకం’ ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. సత్యదేవ్, ఈషా రెబ్బా జంటగా, శ్రీరామ్, గణేశ్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీ నవ్‌హాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ బానర్స్‌పై ఈ చిత్రాన్ని కానూరు శ్రీనివాస్ నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ పూర్తయింది. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నన్ను నమ్మి ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్లు ఎంతో కష్టపడి పనిచేశారు. ముఖ్యంగా కానూరు శ్రీనివాస్ అభిరుచి గల నిర్మాత. కెమెరా, మ్యూజిక్ ఈ చిత్రానికి రెండు కళ్లు. స్క్రిప్ట్ నచ్చి కృష్ణభగవాన్ ఈ చిత్రానికి డైలాగులు రాశారు’’ అన్నారు. ‘‘మా చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 15న చిత్రాన్ని విడుదల చేయనున్నాం. సినిమాలపై ఆసక్తితో ఈ చిత్రాన్ని నిర్మించాను’’ అన్నారు కానూరు శ్రీనివాస్. ఈ చిత్రానికి కెమెరా: ‘గరుడవేగ’ అంజి, సంగీతం: రఘు కుంచె. -
ప్రేమకథలంటే ఇష్టం
‘‘రాగల 24 గంటల్లో’ చిత్రంలో అందరికంటే చివరిగా వచ్చింది నేనే. ‘అసలేం జరిగింది’ అనే తెలుగు సినిమా షూటింగ్లో పాల్గొని చెన్నైకి వెళ్లిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేసి, ఈ సినిమా లైన్ చెప్పడంతో నచ్చి, చేసేందుకు ఒప్పుకున్నాను’’ అని శ్రీరాం (ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ఫేం) అన్నారు. సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రల్లో శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్ కానూరు నిర్మించిన ఈ సినిమా నవంబరులో విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీరాం చెప్పిన విశేషాలు. ► శ్రీనివాస్ రెడ్డిగారు నాకు ఫోన్ చేసినప్పుడు నా పాత్ర కాదు, పూర్తి కథ చెప్పమన్నాను. ఈ సినిమాలో కథే హీరో. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటూ ఉత్కంఠగా సాగే కథ ఇది. సీరియస్ క్రైమ్ థ్రిల్లర్. ఒక హత్య చుట్టూ కథ నడుస్తుంది. ఓ రకంగా లేడీ సెంట్రిక్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. చాలా ఉత్కంఠగా సాగుతుంది. ► ఈ చిత్రం స్క్రిప్ట్ మొత్తం 24 గంటల్లో నడిచే కథ. వాతావరణ విషయాల గురించి రేడియోలలో చెప్పేటప్పుడు ‘రాగల 24 గంటల్లో’ అని చెబుతుండటం మనకు తెలిసిందే. అందుకే ఈ కథకు ఆ టైటిల్ కరెక్టుగా సరిపోతుందని పెట్టాం. ఈ చిత్రంలో పోలీస్ పాత్ర చేశా. నా గత పోలీస్ చిత్రాలతో పోలిస్తే ఇందులో నా పాత్ర ఇంకా డెప్త్‌గా ఉంటుంది. తమిళంలో కూడా ఓ చిత్రంలో ఇలాంటి పోలీస్ పాత్ర చేస్తున్నాను. ► మర్డర్ మిస్టరీ కథాంశంతో చాలా సినిమాలు గతంలో వచ్చాయి. అయితే ప్రతి దర్శకుడు కొత్తగా చెప్పాలని ప్రయత్నిస్తారు. శ్రీనివాస్ రెడ్డి ఒక భిన్నమైన ట్రీట్మెంట్తో ఈ సబ్జెక్ట్‌ని తెరకెక్కించారు. పేర్లు అయిపోగానే నేరుగా అసలు కథలో లీనమవుతారు ప్రేక్షకులు. ఎక్కడా సాగతీత ఉండదు. ► తెలుగు సినిమాల్లో నటించడానికి నేనెప్పుడూ సిద్ధమే. అయితే మంచి కథలు కుదరకపోవడం వల్లే చేయడం లేదు. ప్రస్తుతం తెలుగులో ‘అసలేం జరిగింది’ చిత్రంతో పాటు కొత్త దర్శకుడు మధుకర్‌తో ఓ సినిమా చేస్తున్నాను. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. లవ్ ఎంటర్టైనర్లలో నటించడం నాకు చాలా ఇష్టం. తెలుగులో ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. కానీ తమిళంలో మాత్రం రావడం లేదు. ► తమిళంలో లక్ష్మీరాయ్ హీరోయిన్గా ఒక చిత్రం, హన్సికతో మరో సినిమా.. ఇంకా 4 చిత్రాల్లో హీరోగా చేస్తున్నాను. ఆరు చిత్రాల్లోనూ నావి మంచి పాటలే. -
సినిమా ప్రమోషన్ అందరి బాధ్యత
‘‘ఇండస్ట్రీలో చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ ఉండదు. మంచి సినిమా, చెడ్డ సినిమా అన్నదే ఉంటాయి. అందరూ మంచి సినిమా తీయాలనే చేస్తారు. ఒక్కోసారి ప్రేక్షకులు తిరస్కరిస్తుంటారు. ‘రాగల 24 గంటల్లో’ టీమ్ చాలా కష్టపడ్డారు. తప్పకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి.. అవుతుంది కూడా’’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. సత్యదేవ్, ఈషా రెబ్బా జంటగా, శ్రీరామ్, ముస్కాన్ సేథ్, గణేశ్ వెంకట్రామన్ కీలక పాత్రల్లో శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్ కానూరు నిర్మించిన ఈ సినిమా ప్రచార పాటని దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలోని ప్రచార పాటని విడుదల చేసినందుకు శ్రీనివాస్‌రెడ్డిగారు నాకు థ్యాంక్స్ చెబుతున్నారు.. నిజం చెప్పాలంటే ఇది నా అదృష్టం. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకే నేను థ్యాంక్స్ చెబుతున్నా. సినిమాని ప్రమోట్ చేయడం నటీనటులు, సాంకేతిక నిపుణుల బాధ్యత. సరిగ్గా ప్రమోట్ చేసి చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లినప్పుడే విజయం సాధించి మరో సినిమా రూపంలో అందరికీ పని దొరుకుతుంది. సినిమా బాగా ఆడుతుందని నమ్మకం ఉన్నా కూడా ప్రమోషన్ చేయాలి. ఎవరికైనా విజయాలు, అపజయాలు సాధారణం. అయితే శ్రీనివాస్ రెడ్డిగారు అందరితో మంచివాడు అనే ట్యాగ్‌లైన్ పొందడం సంతోషం. ఆయన ఎన్నో సక్సెస్‌లు కొడుతూనే ఉండాలి’’ అన్నారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకి నేను, రఘు కుంచె ప్రమోషనల్ సాంగ్ చేద్దామనుకున్నప్పుడు దేవిశ్రీగారి ప్రత్యేక పాటలే గుర్తొచ్చాయి. మా ఈ పాటకి ఆయన పాటలే స్ఫూర్తి. అందుకే ఈ పాటని ఆయనతో విడుదల చేయించాం. ప్రస్తుతం యాక్టర్స్, టెక్నీషియన్స్ ప్రమోషన్స్‌కి రావడానికి ఇష్టపడటం లేదు. అందరూ రావాల్సిన అవసరం ఉంది. నిర్మాతలను కాపాడాల్సిన బాధ్యత నటీనటులు, సాంకేతిక నిపుణులు, మీడియాపై ఉంది. నిర్మాత బాగున్నప్పుడే మరో సినిమా చేస్తారు.. దాని ద్వారా కొన్ని వందల మందికి పని దొరుకుతుంది. శ్రీనివాస్‌లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం’’ అన్నారు. ‘‘సినిమాలంటే చాలా ప్యాషన్. కనీసం ఓ టీవీ సీరియల్ అయినా తీయలేనా? అనుకునేవాణ్ణి. సినిమా నిర్మిస్తానని కలలో కూడా అనుకోలేదు. కానీ, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ భగవాన్గార్ల వల్లే ‘రాగల 24 గంటల్లో’ సినిమా తీయగలిగాను. ఈ ఏడాదిలో వచ్చిన మంచి చిత్రాల్లో మా ‘రాగల 24 గంటల్లో’ సినిమా కూడా నిలుస్తుంది’’ అన్నారు శ్రీనివాస్ కానూరు. ‘‘నాకు మంచివాళ్లంటే ఇష్టం. అందుకే.. శ్రీనివాస్‌రెడ్డిని బ్రదర్ థెరిస్సా అని పిలుస్తుంటా. ఈ సినిమాతో ఆయన స్టార్ డైరెక్టర్ కావాలి.. శ్రీనివాస్ కానూరు పెద్ద నిర్మాత అవ్వాలి’’ అన్నారు నటుడు కృష్ణభగవాన్. చిత్ర సంగీత దర్శకుడు రఘు కుంచె, కెమెరామన్ అంజి, పాటల రచయిత శ్రీమణి, నటుడు రవివర్మ తదితరులు పాల్గొన్నారు. -
పాట పరిచయం!
‘పైసా వసూల్’ సినిమాతో హీరోయిన్గా తెలుగు స్క్రీన్కు పరిచయం అయ్యారు ముస్కాన్ సేతి. రెండో సినిమాలో తన యాక్టింగ్‌తో పాటు మరో కొత్త టాలెంట్‌ను పరిచయం చేయబోతున్నారు. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతున్న చిత్రం ‘రాగల 24 గంటల్లో’. ఈ సినిమాలో ముస్కాన్ ఓ కీలక పాత్రలో చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా ముస్కాన్ గాయనిగా మారారు. ఇందులో ‘ఆకాశం..’ అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను ముస్కాన్ ఆలపించారు. ఈ విషయం గురించి ముస్కాన్ మాట్లాడుతూ – ‘‘రాగల 24 గంటల్లో’ సినిమాలో నేను మోడల్‌గా కనిపిస్తాను. నా వాయిస్ బావుందని వాయిస్ టెస్ట్ చేశారు దర్శకుడు. బావుండటంతో నాతోనే పాడించారు. ఈ మెలోడీ పాట నా పాత్ర పరిచయ గీతం అవడం సంతోషంగా ఉంది. పాట పాడటాన్ని ఎంజాయ్ చేస్తాను కానీ రెండో సినిమాలోనే సింగర్‌గా మారతానని ఊహించలేదు’’ అన్నారు. -
టీజర్ చూసి థ్రిల్ ఫీలయ్యాను : త్రివిక్రమ్ శ్రీనివాస్
‘సినిమా టీజర్ చాలా బావుంది. ఖచ్చితంగా ఆడియన్స్ థ్రిల్ ఫీలవుతారు’ అంటున్నారు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ సమర్పణలో శ్రీ నవ్‌హాస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ కానూరు నిర్మించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. సత్యదేవ్, ఇషా రెబ్బా జంటగా నటించిన ఈ చిత్రానికి ‘ఢమరుకం’ శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వం వహించారు. శ్రీరామ్, గణేశ్ వెంకట్రామన్, కృష్ణ భగవాన్ ముఖ్య పాత్రల్లో నటించారు. అక్టోబర్ 18న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు త్రివిక్రమ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘సినిమా టైటిల్ బావుంది. టీజర్ చూశాను. నిజంగా చాలా థ్రిల్ ఫీలయ్యాను. రఘు కుంచె మ్యూజిక్, కెమెరామేన్ అంజి వర్క్ బావుంది. దర్శకుడు శ్రీనివాస్ రెడ్డికి, నిర్మాత శ్రీనివాస్ కానూరుకు ఆల్ ది బెస్ట్’ అన్నారు. టీజర్‌ను విడుదల చేసిన త్రివిక్రమ్‌కు దర్శక, నిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి, నిర్మాత శ్రీనివాస్ కానూరుతో పాటు సంగీత దర్శకుడు రఘు కుంచె, కెమెరామేన్ ‘గరుడవేగ’ ఫేమ్ అంజి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాబా అలీ పాల్గొన్నారు.