మూవీ: రాగల 24 గంటల్లో
జానర్: సస్పెన్స్ థ్రిల్లర్
నటీనటులు: ఈషా రెబ్బ, సత్య దేవ్, శ్రీరామ్, గణేశ్ వెంకట్రామన్, టెంపర్ వంశీ, ముస్కాన్ సేథీ, రవివర్మ, కృష్ణభగవాన్, అదిరే అభి తదితరులు
దర్శకత్వం: శ్రీనివాస్ రెడ్డి
సంగీతం: రఘు కుంచె
మాటలు: కృష్ణభగవాన్
నిర్మాత: శ్రీనివాస్ కానూరు
వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే క్రేజీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఈ సారి క్రైమ్ బాట పట్టాడు. అదేనండి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించాడు. ఈషా రెబ్బా లీడ్ రోల్‌లో సత్యదేవ్, శ్రీరామ్, ముస్కాన్ సేథీ, గణేశ్ వెంకట్రామన్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘రాగల 24 గంటల్లో’చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కథా బలం ఉండి కాస్త సస్పెన్స్, ఎంటర్‌టైన్ తోడైతే క్రైమ్ స్టోరీ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. మరి సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల మదిని దోచిందా? తన పంథా మార్చుకుని తొలిసారి క్రైమ్ బేస్డ్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు విజయవంతం అయ్యాడా? చూద్దాం.
కథ:
ఇండియాలోనే నంబర్ వన్ యాడ్ ఫిల్మ్ మేకర్ రాహుల్(సత్య దేవ్) ఎవరూ లేని అనాథ అయిన విద్య(ఈషా రెబ్బ)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే వివాహ బంధంతో ఒక్కటైన మూన్నాళ్లకే వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభం కావడం.. రాహుల్ ప్రవర్తనతో విద్య విసిగిపోతుంది. అయితే అనుకోని పరిస్థితుల్లో రాహుల్ హత్యకు గురవుతాడు. అది ఎవరు చేశారు? ఆ మిస్టరీని ఏసీపీ నరసింహం(శ్రీరామ్) చేధించాడా? విద్య, గణేశ్, అభిల మధ్య ఉన్న పరిచయం ఏంటి? ఈ మిస్టరీ కేసుకు దాస్(రవివర్మ), పుణీత్, వినీత్, అద్వైత్, మేఘన(ముస్కాన్ సేథీ)లకు ఏంటి సంబంధం? అనేదే మిగతా కథ.
నటీనటులు:
ప్రస్తుత కుర్ర హీరోలు కెరీర్ ఆరంభంలోనే నెగటీవ్ రోల్స్‌కూ సై అంటున్నారు. మొన్న కార్తికేయ.. నేడు సత్యదేవ్. ఇప్పటివరకు సత్యదేవ్‌ను పాజిటివ్ యాంగిల్లోనే చూసిన అభిమానులు తొలిసారి విలన్‌గా చూస్తారు. సత్యదేవ్ నటన చూశాక సైకోయిజం, కన్నింగ్, అనుమానం ఇలా ఏదనుకున్న యాప్ట్ అవుతుంది. తొలిసారి నెగటీవ్ షేడ్‌లో కనిపించిన సత్యదేవ్ విలనిజంలో పూర్తిగా లీనమవుతాడు. సినిమాలో లీనమైన వారు అతడు బయట కనిపిస్తే అసహ్యించుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రేంజ్‌లో నటించాడు. సారీ జీవించాడు. ఇక ఈషా రెబ్బ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
చాలా కాలం తర్వాత టాలీవుడ్‌లో కనిపించిన ‘ఒకరికి ఒకరు’హీరో శ్రీరామ్ ఈ సినిమాలో నెగటీవ్ షేడ్‌లో కనిపించాడు. తొలుత సిన్సియర్ ఏసీపీగా కనిపించినా చివరకు అసలు రంగు బయటపడుతుంది. ఇక గణేశ్ వెంకట్రామన్ కనిపించేది రెండు మూడు సీన్లలోనైనా మెప్పించాడు. ఇక సెకండాఫ్‌లో కాసేపు కనిపించి కథకు ప్రధానమైన ముస్కాన్ సేథీ అలరించింది. అంతేకాకుండా తన అందచందాలతో యూత్ కలల రాణిగా మారేలా చేసుకుంది. రవివర్మ, టెంపర్ వంశీ, అదిరే అభి, తదితరులు తమ పాత్రల మేరకు మెప్పించారు.
విశ్లేషణ:
‘అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు, విలన్లు లేరు ఈ నాటకంలో’ఈ డైలాగ్ కాస్త అటూ ఇటూగా ఈ సినిమాకు సెట్ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో హీరోలు అనుకునే వారు మంచి వారు కాదు.. విలన్లు అనుకునే వారు చెడ్డ వారు కాదు. ఇలా విలక్షణమైన స్టోరీ లైన్ పట్టుకుని పూర్తి కథను అల్లాడు రచయిత. దీనికి క్రైమ్, సస్పెన్స్‌కు తోడు ఫుల్ గ్లామర్ వడ్డించిన సినిమాను ప్రేక్షకుల ముందు పెట్టాడు దర్శకుడు. ఊహకందని ట్విస్టులతో డైరెక్టర్ తన మ్యాజిక్ చూపించాడు.
తొలి అర్థభాగంలో ముగ్గురు నేరస్తులు పారిపోవడం, విద్య ఇంట్లోకి చొరబడటం, అప్పటికే అతను హత్యకు గురవడం లాంటి అంశాలు ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్‌లో తన పూర్తి అనుభవాన్ని రంగరించిన దర్శకుడు ఎవరూ ఊహించని విధంగా కథను మలుపుతిప్పుతాడు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌లకు లాజిక్ మిస్ అయితే ప్రేక్షకుడికి రుచించదు. కానీ ఈ విషయంలో దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కామెడీ సినిమాల డైరెక్టర్‌గా ముద్ర పడిపోయినా.. మధ్యలో ఢమరుకం, శివమ్ వంటి డిఫరెంట్ మూవీలను తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ తాజాగా క్రైమ్ థ్రిల్లర్‌తోనూ ప్రేక్షకులను మెప్పించడంలోనూ విజయం సాధించాడు.
ఇక తన నటన, అందంతో సినిమాకు ప్రాణం పోసింది ఈషా రెబ్బ. సరైన అవకాశం దక్కాలే కాని తన నట విశ్వరూపం ప్రదర్శిస్తానని ఈ సినిమాతో టాలీవుడ్ దర్శకనిర్మాతలకు సవాల్ విసిరింది ఇషా రెబ్బ. ఆనందం, భయం, కోపం, జాలి, బాధ, శృంగారం ఇలా నవరసాలను ఇషా రెబ్బ అవలీలగా పండించింది. కెమెరామెన్ గరుడవేగ అంజి సినిమాను రిచ్ లుక్‌లో చూపించాడు. ముఖ్యంగా ఈషా రెబ్బ అందచందాలను చూపించడంలో కెమెరామన్ పనితనం సినిమాలో కనిపిస్తుంది.
ఇక ఈ సినిమాకు మాటలు అందించి, నటించిన కృష్ణ భగవాన్ రెండింటిలోనూ తన మార్క్ చూపించుకున్నాడు. ‘నాపై ఉన్న ప్రేమను చెప్పడానికి నీకు పదాలు చాలవు.. నాకు గిప్ట్ ఇద్దామనుకున్నా నన్ను మించిన గొప్పది నీకు దొరకదు, మనసులో టెన్షన్.. ఇంట్లో శవం రెండూ భయంకరమే’ వంటి డైలాగ్‌లు అలరిస్తాయి. సంగీత దర్శకుడు రఘు కుంచె ఇచ్చిన పాటలు ఉన్నంతలో పర్వాలేదనిపిస్తాయి. భాస్కరబట్ల, శ్రీమణిల కలం పనితనం పాటల్లో కనిపిస్తుంది. కాదు వినిపిస్తుంది. ఇక ఎడిటింగ్, నిర్మాణ విలువుల సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. ఓవరాల్‌గా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుల మదిని థ్రిల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్లస్ పాయింట్స్:
ఈషా రెబ్బ నటన
సత్య దేవ్ విలనిజం
సస్పెన్స్
దర్శకత్వం
కెమెరా పనితనం
మైనస్ పాయింట్స్
ఊహకందే పలు ట్విస్టులు
సాగదీత సీన్లు
- సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment