ర్యాగింగ్ భయంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ఎనిమిది మందిపై కేసు నమోదు
తిరువళ్లూరు: మెరైన్ ఇంజినీరింగ్ కళాశాలలోని హాస్టల్ విద్యార్థిపై ర్యాగింగ్ చేసిన సంఘటనలో కళాశాల నిర్వాహకుడితో ఎనిమిది మందిపై కేసు నమోదు చేస్తూ తిరువళ్లూరు ఎస్పీ శ్యామ్సన్ ఆదేశాలు జారీ చేశారు. తిరువళ్లూరు జిల్లా వెళ్లవేడు సమీపంలోని పుదుసత్రం వద్ద ప్రైవేటు మెరైన్ కళాశాల ఉంది. ఈ కళాశాలలో ఈరోడ్డు జిల్లా రాసాపాళ్యంకు చెందిన శరవణప్రభు హాస్టల్ ఉంటూ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శరవణ ప్రభును హాస్టల్లోని మూడవ సంవత్సరం చదువుతున్న కొందరు సీనియర్ విద్యార్థులు తమ రూమ్‌కు పిలిపించుకుని ర్యాగింగ్ చేసినట్టు తెలుస్తుంది.
తనకు జరిగిన ర్యాగింగ్‌పై శరవణప్రభు కళాశాలల్లో ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించగా, సీనియర్ల నుంచి మరింత వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో మనస్థాపం చెందిన శరవణప్రభు 19న ఆత్మహత్యకు పాల్పడగా సహా విద్యార్థులు గమనించడంతో అతను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. శరవణప్రభును చికిత్స నిమిత్తం చెన్నై వైద్యశాలకు తరలించారు. ఈ నేపథ్యంలో తనపై ర్యాగింగ్ చేసిన వారిపై పిర్యాదు చేసినా కళాశాల నిర్వాహకం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ శరవణప్రభు హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశాడు.
విద్యార్థి పిటిషన్‌పై సిరియస్ అయిన హైకోర్టు వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీ శ్యామ్‌సన్‌ను ఆదేశించింది. ఈ క్రమంలో కళాశాలల్లో నేరుగా వెళ్లి విచారణ చేపట్టి పూర్తి నివేదికను సమర్పించాలని ఎస్పీ శ్యామ్సన్ డీఎస్పీ విజయకుమార్‌ను ఆదేశించారు. కళాశాలకు వెళ్లిన డీఎస్పీ విజయకుమార్ నేరుగా విచారణ చేపట్టారు. విచారణలో మూడవ సంవత్సరం విద్యార్థులు తిరుచ్చికి చెందిన దీనదయాళన్, మదురై ప్రాంతానికి చెందిన లోకనాథన్, మంగళం ప్రాంతానికి చెందిన నితీష్, చెన్నై పరంగిమలై ప్రాంతానికి చెందిన శ్రీనాథ్‌పాల్, అరుంబాక్కం ప్రాంతానికి చెందిన ధనశేఖర్, నామక్కల్ ప్రాంతానికి చెందిన రాజశేఖర్, కాంచీపురం సమీపంలోని తండలం ప్రాంతానికి చెందిన అభిషేక్ దినేష్‌రాజ్ తదితర ఏడుగురు ర్యాగింగ్ చేసినట్టు నిర్ధారించారు. దీంతో పాటు విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదుపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల డీన్ మాథ్యూజాకబ్ సహా ఎనిమిదిమందిపై డీఎస్పీ చేసిన సిఫారసు మేరకు ఎస్పీ కేసు నమోదు చేస్తూ వెళ్లవేడు పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు.