raghavendar
-
సీనియర్ నటుడు కన్నుమూత
చెన్నై: సీనియర్ తమిళ నటుడు, గాయకుడు టీఎస్ రాఘవేంద్ర(75) కన్నుమూశారు. కొంతకాలంగా వయో భారంతో బాధ పడుతున్న ఆయన బుధవారం రాత్రి మరణించారు. ఈ క్రమంలో ఆయన భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం కేకే నగర్‌లోని నివాసంలో ఉంచారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా రాఘవేంద్ర మరణానికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇక రాఘవేందర్‌గా సినీ ప్రేమికులకు సుపరిచితమైన ఆయనకు భార్య సులోచన, ఇద్దరు కూతుళ్లు కల్పన, షేకీనా శవాన్(ప్రసన్న) ఉన్నారు. వీరు ముగ్గురు కూడా గాయనీమణులే కావడం విశేషం. కాగా నటి సుహాసినికి పలు అవార్డులు తెచ్చిపెట్టిన సింధు భైరవి సినిమాలో.. రాఘవేంద్ర ఆమెకు తండ్రిగా నటించారు. అదే విధంగా రేవతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన వైదేహి కాత్రిరుందల్ సినిమాలోనూ కీలక పాత్ర పోషించారు. విక్రం, హరిశ్చంద్ర, నీ వేరువై ఎన తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. ఆయన నటించిన చివరి చిత్రం పోన్ మేఘాలై 2005లో విడుదలైంది. నటుడిగానే కాకుండా గాయకుడిగా, స్వరకర్తగా రాఘవేంద్ర గుర్తింపు తెచ్చుకున్నారు. -
అనుమానాస్పదరీతిలో వైద్యుడి మృతి
హైదరాబాద్‌లో ఘటన కారులో శవమై కనిపించిన రాఘవేందర్రావు హైదరాబాద్: అనుమానాస్పదరీతిలో ఓ వైద్యుడు కారులో శవమై కనిపించాడు. నగరంలోని బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగుచూసిన ఈ ఘటన సంచనలం సృష్టించింది. పేట్ బషీరాబాద్‌లోని గేటేడ్ కమ్యూనిటీ కాలనీలో నివాసం ఉండే డాక్టర్ రాఘవేందర్రావు(60) గత 12 ఏళ్లుగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఈఎన్టీ విభాగం అధిపతిగా పనిచేస్తున్నారు. ఆయన మంగళవారం ఉదయం 11.40 గంటలకు ఇంటి నుంచి ఆసుపత్రికి బయలుదేరారు. సాయంత్రం 6.30 గంటలైనా ఆయన ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పలువూర్లు ఆయున సెల్‌కు ఫోన్ చేశారు. ఆయన ఫోను తీయుకపోవడంతో పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అమెరికాలో ఉన్న రాఘవేందర్రావు కుమారుడు సుదీప్‌కు సమాచారమిచ్చారు. సుదీప్ జీపీఎస్ టెక్నాలజీ ద్వారా బోయినపల్లి హర్షవర్ధన్ కాలనీలో తన తండ్రికి సంబంధించిన బీఎండబ్ల్యూ కారు (ఏపీ 28 బీఎక్స్ 5675) ఉన్నట్లు గుర్తించి, తల్లి స్వర్ణలతకు చెప్పారు. కుటుంబసభ్యులు హర్షవర్ధన్ కాలనీలో వెతకగా పార్క్ చేసి ఉన్న కారును గుర్తించారు. కారులో రాఘవేందర్రావు మృతి చెంది కనిపించాడు. అతని ముక్కు, చెవి నుంచి రక్తం కారుతూ కనిపించింది. బోయిన్పల్లి పోలీసులకు సమాచారమివ్వగా వారు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కారులో రూ.14,500 నగదు, సెల్‌ఫోన్, మద్యంసీసా, ల్యాప్‌టాప్, కొన్ని మాత్రలు లభించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాఘవేంద్రరావు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. కడుపులో మత్తు, విషపదార్థాల అనవాళ్లు లేవని చెబుతున్నారు. -
బీఎండబ్ల్యూ కారులో మృతదేహం...
-
భర్త కళ్లల్లో జిల్లేడు పాలు
ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం చూపు కోల్పోయిన భర్త నిందితుల రిమాండ్ నాగోలు: వివాహేతర సంబంధం పెట్టుకొని.. కట్టుకున్న భర్త కళ్లల్లో జిల్లేడు పాలు పోసి కళ్లు పోవడానికి కారణమైన భార్యను, ఆమె ప్రియుడిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ కాశీవిశ్వనాథ్ కథనం ప్రకారం... ఎల్బీనగర్ మెడికేర్ ఆసుపత్రి సమీపంలోని పరిమళ అపార్ట్మెంట్లో నివాసముండే కొత్తకొండ రాఘవేందర్ (40), సరిత (32) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. రాఘవేందర్ వివాహాలకు డెకరేషన్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన స్టీల్ వ్యాపారి గోపాల్‌రెడ్డి (37) ఇంట్లో ఓ శుభకార్యానికి డెకరేషన్ చేశాడు. నగరానికి వచ్చిన గోపాల్‌రెడ్డి ఓసారి ఎల్బీనగర్లోని రాఘవేందర్ ఇంటికి వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో ల్యాండ్‌లైన్‌తో పాటు రాఘవేందర్ భార్య సరిత ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. తరచూ ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ లోబర్చుకున్నాడు. తమ ఆనందానికి అడ్డుగా ఉన్న రాఘవేందర్‌ను హత్య చేయాలని సరిత తన ప్రియుడు గోపాల్‌రెడ్డితో కలిసి పథకం వేసింది. 2012, డిసెంబర్, 29న రాఘవేందర్ ఇంట్లో పడుకొని ఉండగా... ఇద్దరూ కలిసి కంట్లో జిల్లేడు పాలు పోశారు. కళ్లు ఎంతకూ తెరుచుకోకపోవడంతో సమీపంలోని ఆసుపత్రిలో చూపించుకున్నాడు. అదే సమయంలో సరిత కొడుకును హయత్‌నగర్‌లోని ప్రైవేట్ హాస్టల్లో చేర్పించి కూతురిని తీసుకుని గోపాల్‌రెడ్డి వద్దకు వెళ్లిపోయింది. కళ్లు కోల్పోయిన రాఘవేందర్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఈనెల 13న ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అలాగే, గోపాల్‌రెడ్డి తనకు డెకరేషన్ పని నిమిత్తం రూ. 5 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. రూ. లక్ష మాత్రమే చెల్లించాడని, మిగతాది ఎగ్గొట్టాడని రాఘవేంద్ర తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాఘవేందర్‌ను హత్య చేయడానికి ప్రయత్నించిన భార్య సరిత, గోపాల్‌రెడ్డిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)