raghu ramireddy
-
పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం వెనుకంజ
బ్రహ్మంగారిమఠం(వైఎస్సార్ కడప): సర్పంచ్ల పదవీకాలం రేపటితో ముగియనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో ముందుకు పోలేక టీడీపీ ప్రభుత్వం వెనుకంజ వేస్తోందని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. మంగళవారం బి. మఠం మండలంలోని 11 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లను స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధికి సర్పంచ్‌లు ఐదేళ్లపాటు ఎంతో కృషి చేశారన్నారు. ప్రభుత్వం వెంటనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రం నుంచి నిధులు అందుతాయన్నారు. ఓటమి భయంతో సీఎం ఎన్నికలకు వెనుకడుగు వేస్తున్నారన్నారు. అలాంటప్పుడు ప్రస్తుత సర్పంచ్‌లనే పర్సన్ ఇన్‌చార్జీలుగా నియమించాలన్నారు. దీనిపై ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ ప్రస్తుత సర్పంచ్‌లనే పర్సన్ ఇన్‌చార్జీలుగా కొనసాగించాలని లేఖ కూడా రాసినట్లు చెప్పారు. సర్పంచ్ల విధానాలు పార్టీలకు అతీతంగా జరుగుతాయని అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. సోమిరెడ్డిపల్లె సర్పంచ్ శ్రీదేవమ్మ, ముడమాల సర్పంచ్ పెంచలమ్మ, పలుగురాళ్లపల్లె సర్పంచ్ పుట్టా పోలమ్మ, చౌదరివారిపల్లె సర్పంచ్ చెవుల వెంకటమ్మ, తోట్లపల్లె సర్పంచ్ వాణి, రేకలకుంట సర్పంచి జోత్స్న, మల్లేపల్లె సర్పంచ్ నాగిపోగు పెంచలయ్య, నాగిశెట్టిపల్లె సర్పంచ్ నాగిపోగు ఏసురత్నం, దిరశవంచ సర్పంచ్ సుబ్బారెడ్డి, గోడ్లవీడు సర్పంచ్ జయరామిరెడ్డిల ఘనంగా ఎమ్మెల్యే సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని సర్పంచ్‌లు, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రామగోవిందరెడ్డి, ఎంపీపీ డి.చక్రవర్తి, బి.మఠం సింగిల్ విండో అధ్యక్షులు సి.వీరనారా యణరెడ్డి, ఎంపీడీఓ జగదీశ్వర్‌రెడ్డి, ఈఓపీఆర్డీ రామచంద్రారెడ్డి, పీఆర్ఏఈ సుబ్రమణ్యం, ఎంపీటీసీలు పసుపులేటి రామయ్య, బాలయ్య, గురువయ్య, బిజివేముల సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
అబద్ధాలు చెప్పడం చంద్రబాబు నైజం
ఖాజీపేట : అబద్ధాలు చెప్పడంచంద్రబాబు నైజం. ప్రజలను మోసం చేయడం కోసం రోజుకో అబద్ధం చెబుతున్నాడు. ఆయన మాటలను ప్రజలు నమ్మి మోసపోయే పరిస్థితిలో లేరని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. శనివారం మండల ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘వంచనపై గర్జన’ పేరుతో 14, 15 తేదీల్లో పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. పాదయాత్రలో అందరూ పాల్గొని చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రత్యేక హోదా విషయంలో పూటకోక మాట మాట్లాడింది చంద్రబాబు కాదా ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రత్యేక ప్యాకేజీ మేలని తీర్మాణం చేసి ఇప్పడు హోదా రాగం అందుకున్నారన్నారు. నేడు ప్రజలంతా ప్రత్యేక హోదా కావాలని గట్టిగా కోరుతున్నారని, ఇది గమనించి చంద్రబాబు మాట మార్చి హోదా డ్రామా అడుతున్నాడన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, రాబోవు ఎన్నికల్లో తగిన బుద్ధిచెబుతారన్నారు. కార్యక్రమంలో మాజీ మండల ఉపాధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ గంగాధర్‌రెడ్డి, ఎంపీటీసీ గోపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు గురివిరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ గాలిపోతు మనోహర్, జిల్లా బీసీసెల్ ప్రధాన కార్యదర్శి వెంకటయ్యనాయుడు, జల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, దస్తగిరిబాబు, నాయకులు వెంకట శివానందకుమార్‌రెడ్డి, శ్రీరాములనాయక్, మండల ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, తుడుమలదిన్నె కృష్ణారెడ్డి, దుంపలగట్టు వెంకటరామిరెడ్డి, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
19 మంది ఎస్ఐలకు స్టేషన్ల కేటాయింపు
కర్నూలు, న్యూస్‌లైన్: కొంతకాలంగా వీఆర్‌లో ఉన్న ఎస్ఐలతో పాటు ఏడాదిలోపు సర్వీసు ఉన్న ర్యాంకర్ ఎస్ఐలకు స్టేషన్లను కేటాయిస్తూ ఎస్పీ రఘురామిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ర్యాంకర్ ఎస్ఐలకు ఏఎస్పీ వెంకటరత్నం తన చాంబర్లో కౌన్సెలింగ్ నిర్వహించి జాబితాను సిద్ధం చేసి ఎస్పీకి అందజేశారు. కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలో చేరి పదోన్నతి పొంది ప్రస్తుతం ర్యాంకర్ ఎస్ఐలుగా పని చేస్తున్న కర్నూలు, కడప జిల్లాలకు సంబంధించిన వారికి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు కౌన్సెలింగ్ నిర్వహించి వారు కోరుకున్న ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తూ నియమించారు. -
ఎస్పీ బదిలీకి బ్రేక్
కర్నూలు, న్యూస్‌లైన్: జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి బదిలీ వ్యవహారం ఉత్కంఠకు తెరపడింది. ఈయనను హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా బదిలీ చేసి రమేష్ నాయుడును జిల్లా ఎస్పీగా నియమిస్తూ గత నెల 27న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. అయితే కర్నూలులో బాధ్యతలు చేపట్టి మూడున్నర మాసాలు గడవక మునుపే నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారంటూ ఎస్పీ కేంద్ర ప్రభుత్వ ట్రిబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించారు. ఎలాంటి ఆరోపణలు లేని ఐపీఎస్ అధికారిని రెండేళ్లలోపు బదిలీ చేయరాదనే నిబంధన నేపథ్యంలో క్యాట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ప్రకాషింగ్ కమిటీ, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా బదిలీ ఉండాలని క్యాట్‌లో ఎస్పీ తన వాదనను వినిపించారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన కారణాలను వెల్లడించకపోవడంతో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు రఘురామిరెడ్డినే ఎస్పీగా కొనసాగించాలని క్యాట్ ఆదేశించింది. ఎస్పీ బదిలీ నేపథ్యంలో సంబరాలు చేసుకున్న సొంత శాఖలోని ఆయన వ్యతిరేకులు, కొందరు రాజకీయ నాయకులు తాజా తీర్పును జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది. -
ఆపేవారెవరు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తుంగభద్ర నది. జిల్లాకు సాగు, తాగునీటిని అందించే వరప్రదాయిని. అంతేకాదు.. ఇటీవల కాలంలో ఒళ్లంతా గుళ్ల చేసుకొని అక్రమార్కులకు కాసుల వర్షం కూడా కురిపిస్తోంది. అధికారం ‘చేతి’లో పెట్టుకొని.. అధికారులను కనుసైగలతో శాసిస్తూ నదీ పరీవాహక ప్రాంతాల్లోని చోటామోటా నాయకులు సైతం ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తుతున్నారు. ముఖ్య నాయకుల అండదండలతో వీరి హవా కొనసాగుతోంది. ఇక వీఆర్వో నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు తృణమోపణమో ముడుతుండటంతో వారు కూడా ఇటువైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి. వివిధ స్థాయిల్లో నెల మామూళ్లే కోటి రూపాయలకు పైమాటే కావడం అక్రమ రవాణా ఏ స్థాయిలో సాగుతుందో తెలియజేస్తోంది. జిల్లాతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు, నాయకులు కూడా తుంగభద్రపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఎక్కడ.. ఎవరు అడ్డొచ్చినా అంతమొందించేందుకూ వెనుకాడకపోవడం ఆందోళన కలిగించే విషయం. సీమ ముఖద్వారమైన కర్నూలు కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ రవాణాతో పర్యావరణానికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నా నోరు మెదిపేందుకు ఎవరూ సాహసించకపోవడం గమనార్హం. అక్రమార్కులు పక్కా ప్రణాళికతో ఇసుకను సరిహద్దులు దాటిస్తున్నారు. వ్యాపారం ఉన్నా.. లేకపోయినా ముందుగానే ఇసుకను తోడి నిల్వ చేసుకుంటున్నారు. ప్రధానంగా పంచలింగాల, గొందిపర్ల, దేవమడ, ఇ.తాండ్రపాడు, నిడ్జూరు, పుల్లూరు, కలుగొట్ల, నెంపాడు, మద్దూరు, కొర్రిపాడు తదితర ప్రాంతాల్లో ఈ తరహా వ్యవహారం సాగుతోంది. నిల్వ చేసుకున్న ఇసుకను చీకటి వేళ 12 టైర్ల లారీల్లో నింపి హైదరాబాద్‌కు చేరవేస్తున్నారు. రోజూ 500 లారీలతో పాటు వందలాది ట్రాక్టర్లలో ఇసుక తరలిపోతున్నా నిలువరించలేని పరిస్థితి నెలకొంది. ఒక లారీలో ఇసుకను నింపేందుకు రూ.36వేలు చెల్లిస్తుండగా.. 100 టన్నుల ఇసుకను హైదరాబాద్‌లో రూ.1.20 లక్షలకు విక్రయిస్తున్నారు. ఇక ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఆయా ప్రాంతాల్లోని పోలీసుస్టేషన్ల ఎస్ఐలకు నెలకు రూ.లక్ష, కానిస్టేబుళ్లకు రూ.50వేల చొప్పున చెల్లిస్తున్నట్లు సమాచారం. వీఆర్వో విషయానికొస్తే లారీ రోడ్డెక్కితే రూ.2వేలు ముట్టజెబుతున్నారు. అలా ఎన్ని లారీలు వెళితే అంత డబ్బు ఇవ్వాల్సిందే. అక్రమ రవాణా చేస్తున్న లారీల యజమానులంతా కలసి రెవెన్యూ, పోలీసు, మైన్స్, అధికార పార్టీ నాయకులకు ప్రతి నెలా కోటి రూపాయలకు పైగా ‘మామూళ్లు’ ఇస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ఈ విషయంలో అక్రమార్కులకు అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నెల మామూళ్లు అందకపోతే.. కేసులు బనాయించి హడావుడి చేయడం పరిపాటిగా మారింది. రోజూ ఎన్ని లారీల ద్వారా ఇసుక తరలిస్తున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రజాప్రతిధులకు చెందిన రెండు సుమోలు నిత్యం పర్యవేక్షిస్తుండటం ఈ దంత ఏ స్థాయిలో సాగుతుందో తెలియజేస్తోంది. ఇటీవల కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఎస్పీ రఘురామిరెడ్డి సంయుక్తంగా దాడులు నిర్వహించి హద్దు మీరితే ఊరుకోబోమని హెచ్చరించారు. అయితే ఆ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడం అధికారులంటే వారికి ఏమాత్రం భయం ఉందో అద్దం పడుతోంది.