ragulapadu
-
రాగులపాడు లిఫ్ట్ ముట్టడిని విజయవంతం చేయండి
ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి వజ్రకరూరు: ఉరవకొండ నియోజకవర్గంలోని 80 వేల ఎకరాలకు హంద్రీనీవా కాలువ ద్వారా సాగు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న తలపెట్టిన రాగులపాడు లిప్ట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం చిన్నహోతురు, పొట్టిపాడు గ్రామాల్లో ఆయన రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హంద్రీనీవా ఆయకట్టుకు సాగు నీటి సాధనకు ప్రతి ఒక్క రైతు నడుం బిగించాలన్నారు. నాలుగేళ్ల నుంచి హంద్రీనీవాకు కృష్ణా జలాలు వస్తున్నా ఆయకట్టుకు మాత్రం నీరు అందించలేదని అన్నారు. మన కళ్లేదుటే హంద్రీనీవా కాలువలో కృష్ణా జలాలు పారుతున్నా మనం ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నామన్నారు. ఆయకట్టు సాగు నీటి సాధనకు ప్రభుత్వంపై పోరాడితే తప్ప సాగునీటిని సాధించలేమన్నారు. ప్రభుత్వం వెంటనే సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన రాగులపాడు పంప్‌హౌస్ ముట్టడి కార్యక్రమానికి రైతులు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. వెనుకబడిన ప్రాంతాలపై ఇంత నిర్లక్ష్యమా..? వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. ఒక పక్క నిధులు లేవంటూనే తాత్కాలిక సచివాలయంలో వాస్తు పేరుతో కోట్ల రుపాయలు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. రెండు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలకు రూ. 750 కోట్లు ఇచ్చిందని, అయితే ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలు మాని గ్రామాల్లో తిరిగితే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయన్నారు. -
పరుగులు తీస్తున్న కృష్ణమ్మ
వజ్రకరూరు : మండలపరిధిలోని రాగులపాడు గ్రామసమీపంలోని హంద్రీనీవా ప్రధాన కాలువలో కృష్ణాజలాలు పరుగులు తీస్తున్నాయి. ఈ నెల10న కర్నూలు జిల్లా మాళ్యాలనుంచి కృష్ణా జలాలు రాగులపాడులిఫ్ట్కు చేరుకున్నాయి. అప్పటినుంచి లిఫ్ట్ ద్వారా జీడిపల్లి రిజర్వాయర్‌కు పంపుతున్నారు. లిఫ్ట్‌కు నీటి ఉధృతి పెరగడంతో అధికారులు మంగళవారం నాలుగు పంపులద్వారా నీటిపంపింగ్ చేపడుతున్నారు. ఒక్కో పంపు నుంచి 350 క్యూసెక్కులమేర నీరు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. హంద్రీనీవా కాలువలో కృష్ణాజలాలు ప్రవహిస్తుండటంతో పొట్టిపాడు, పీసీ.ప్యాపిలి, రాగులపాడు, కడమలకుంట పరిసర ప్రాంతాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.