నేడు రాహుల్ దూతతో కాంగ్రెస్ నేతల సమావేశం
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దూత సోమవారం భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని జనగామ సెగ్మెంట్ నేతలతో సమావేశం కానున్నారు. భువనగిరిలో సోమవారం ఉదయం 10 గంటలకు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నాయకుల నుంచి సమాచారం సేకరించనున్నారు. ఈ సమావేశానికి రాహుల్దూతగా, ఏఐసీసీ పరిశీలకుడిగా మహారాష్ట్రకు చెందిన మాజీ ఎమ్మెల్యే సేవక్వాగిల్ పాటిల్ హాజరవుతున్నారు. జిల్లాలో మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానం నల్లగొండ జిల్లా పరిధిలోని భువనగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ సమావేశానికి జనగామ పరిధిలోని నియోజకవర్గ నాయకులు, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు, అనుబంధ సంఘాల నాయకులు హాజరుకానున్నారు. ఈ మేరకు జిల్లా పీసీ సీ పరిశీలకులు రాపోలు జయప్రకాష్, లక్ష్మణ్‌రావుగౌడ్ ఇప్పటికే నియోజకవర్గ నాయకులకు స మాచారం అందజేశారు. సంక్రాంతి తర్వాతే ఈ సమాచారం సేకరించాలని పీసీసీ కోరినప్పటికీ ఏఐసీసీ పరిశీలకుని కోరిక మేరకు సోమవారం ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.
సంక్రాంతి తర్వాత వరంగల్, మహబూబాబాద్
జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులకు సంబంధించిన సమాచారం సేకరించనున్న ఏఐసీసీ పరిశీలకులు సంక్రాంతి తర్వాత వచ్చే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మూడు రోజులుగా రాహుల్ దూతల కోసం జిల్లా కాంగ్రెస్ నేతలు ఎదురుచూశారు. ఎప్పుడు వస్తారనే స్పష్టమైన సమాచారం లేకపోవడంతో నేతల్లో సందిగ్ధత నెలకొంది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు ముందస్తుగా లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు ఢిల్లీ నుంచి పరిశీలకులను పంపిస్తున్నారు. ఈ నెల 14వ తేదీ వరకు జిల్లాలోని లోక్ సభ అభ్యర్థులపై నివేదికలు సమర్పించాలని రాహుల్ ఆదేశించినప్పటికీ వీలుకాలేదు.
ఏఐసీసీ పరిశీలకులు జిల్లాలో పర్యటించి, పార్టీ నేతలు, శ్రేణులు నుంచి అభిప్రాయాలు సేకరిం చి సమర్థుడైన అభ్యర్థి పేరును రాహుల్‌కు నివేదించనున్నారు. మహారాష్ట్రకు చెందిన అగర్వాల్‌ను జిల్లాకు పంపించాలని నిర్ణయించినప్పటికీ స్వల్ప అనారోగ్య కారణాలతో ఆయన రాలేక పోయినట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత రాహుల్ దూతలు జిల్లాలో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు వచ్చినా సమాచా రం అందించేందుకు పీసీసీ నుంచి జిల్లా పరిశీల కులుగా ఉన్న జయప్రకాష్, లక్ష్మణ్‌రావుతో పాటు, జిల్లా నాయకులు సిద్ధమయ్యారు.