రాహుల్ చెప్పులు మోసిన మాజీ మంత్రి!
పుదుచ్చేరి: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం పుదుచ్చేరిలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా రాహుల్ కోసం సాక్షాత్తూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ వీ నారాయణస్వామి చెప్పులు మోస్తూ కనిపించారు. వీ నారాయణస్వామి యూపీఏ హయాంలో ప్రధానమంత్రి కార్యాలయ మంత్రిగా ఉన్నారు. వరద ప్రాంతాలకు చేరుకున్న తర్వాత రాహుల్ తన బూట్లు విప్పారు. అప్పటివరకు తన చేతుల్లో పట్టుకొని ఉన్న చెప్పులను వీ నారాయణస్వామి రాహుల్ కు అందించారు. ఆయన కూడా మోహమాట పడకుండా వాటిని వేసుకున్నారు.
ఈ వీడియో దృశ్యాలు వెలుగులోకి రావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో వ్యక్తి వీరపూజకు ఈ ఘటన నిదర్శనమంటూ విమర్శలు రాగా.. వాటిని పుదుచ్చేరి ఎంపీ అయిన నారాయణస్వామి తోసిపుచ్చారు. వరద నీళ్లలో రాహుల్ గాంధీ వట్టి పాదాలతో నడిస్తే బాగుందని భావించి.. మర్యాదపూర్వకంగా ఆయనకు తన చెప్పులు ఇచ్చానని, కాంగ్రెస్ పార్టీ వ్యక్తి భజన లేనేలేదని ఆయన చెప్పారు. వరద ప్రాంతాల్లో సందర్శించే సందర్భంగా రాహుల్ తన బూట్లను తానే చేతుల్లో పట్టుకున్నారని, భద్రతా సిబ్బందికి ఇచ్చేందుకు కూడా ఒప్పుకోలేదని చెప్పారు.