rahul padayatra
-
ఆత్మహత్యలు వద్దు.. భరోసా ఇచ్చేందుకే వచ్చా..
భరోసా యాత్రలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రైతు భరోసా యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘రైతన్నలు, చేనేతలు, కార్మికులు చమటోడ్చి దేశాన్ని నిలుపుతుంటే వారికి అండగా ఉండాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరం... కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతుల భూములను ఆక్రమించుకునేందుకు చట్టాన్నే మార్చాలని చూస్తోంది. లెక్కలేనన్ని హామీలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ అన్ని వర్గాలను ఘోరంగా మోసం చేసింది’ అని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దుయ్యబట్టారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్‌గాంధీ శుక్రవారం అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. అనంతరం ఓ.డి.చెరువులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకే వచ్చానన్నారు. రైతుల అనుమతి లేనిదే భూసేకరణ చేయకూడదని, ఆ భూమిలో ఐదేళ్లలోపు పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే వాటిని తిరిగి రైతులకు ఇచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేస్తే... నరేంద్రమోదీ పారిశ్రామికవేత్తలకు భూములను కట్టబెట్టేందుకు చట్టాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా నిధులు పూర్తిచేసే విధంగా తాము చట్టం తెస్తే.. ప్రధానమంత్రి వాటిని వెనక్కులాక్కొంటున్నారని ఆరోపించారు. ఇంత అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఎందుకు మాట్లాడటంలేదో అర్థం కావడం లేదన్నారు. వాటిని సాధించే వరకు కేంద్రంపై పోరాటం చేస్తానని చెప్పడానికే వచ్చానన్నారు. అనంతరం డబురవారిపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఏపీలో డ్వాక్రా సంఘాలు బలోపేతంగా ఉంటే తప్పుడు హామీలతో చంద్రబాబు ఒక్కసారిగా నిర్వీర్యం చేశాడన్నారు. అధికారం కోసం చంద్రబాబు కోలుకోలేని దెబ్బ వేశాడన్నారు. రైతులకు, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేశాడన్నారు. కాంగ్రెస్ హయాంలో రేషన్ షాపుల ద్వారా 9 రకాల సరుకులు పంపిణీ చేయగా చంద్రబాబు ఆ పథకాన్ని ఎత్తివేసి ప్రస్తుతం ఏడాదికి ఒకసారి హిందువులకు ఉగాదికి, ముస్లింలకైతే రంజాన్, క్రిస్టియన్లకైతే క్రిస్ట్మస్కు సరుకులు ఇస్తున్నారని ఆరోపించారు. కొండకమర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం కళ్లారా చూసిన సోనియాగాంధీ.. ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి మొట్టమొదటి సారిగా అనంతపురం జిల్లాలో అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నరేంద్రమోదీ ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. ఆప్యాయంగా పలకరిస్తూ... కష్టాలు తెలుసుకుంటూ.. భరోసా యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: రైతు, చేనేత, వలస కూలీల ఇబ్బందులను తెలుసుకునేందుకు శుక్రవారం అనంతపురం జిల్లాలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భరోసా యాత్రలో భాగంగా గ్రామ గ్రామాన ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. బెంగళూరు నుంచి ఆయన ఓ.డి.చెరువుకు ఉదయం 9.30 గంటలకు చేరుకొని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కోసం అప్పట్లో శాశ్వతంగా నిర్మించిన వేదిక వద్ద ఒక మొక్కను నాటి అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. తర్వాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభ వేదిక వద్ద ఆత్మహత్యలు చేసుకున్న 38 మంది రైతు, చేనేత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం రైతులతో, విద్యార్థులతోనూ ముచ్చటించారు. ఆతర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతు హరినాథరెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. డబురవారిపల్లిలో డ్వాక్రా గ్రూపు సభ్యులతో మాట్లాడారు. -
అనంతపురంలో రాహుల్ గాంధీ పాదయాత్ర
-
'వాళ్లంతా అవకాశవాదులు.. అందుకే వెళ్లారు'
గతంలో కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించిన కె.కేశవరరావు, డి.శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ తదితరులు అవకాశవాదులని, అందుకే వాళ్లు పార్టీని వీడారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. శుక్రవారం ఆయన అనంతపురం జిల్లాలో పాదయాత్ర ముగిసిన అనంతరం పుట్టపర్తిలో మీడియాతో మాట్లాడారు. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ మనుగడ సాగిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని సూచించారు. ఆ రెండూ సాధిస్తే రాష్ట్రం ముందంజలో ఉంటుందని అన్నారు. అన్ని పార్టీలూ ఆమోదం తెలిపిన తర్వాతే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పుడు వసుంధరా రాజె, సుష్మా స్వరాజ్, శివరాజ్ సింగ్ చౌహాన్ దేశాన్నే దోచేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతల అవినీతి పాలనను కాంగ్రెస్ బయటపెడుతుందనే ప్రధాని యోగా, అంతరిక్షం, విదేశీ పర్యటనలంటూ తప్పించుకుని తిరుగుతున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. అయితే.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఎప్పుడు తీసుకుంటారని విలేకరులు ప్రశ్నించినప్పుడు మాత్రం రాహుల్ సమాధానాన్ని దాటవేశారు. మీడియా సమావేశం ముగిసిన తర్వాత ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలతో రాహుల్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై సమీక్షించారు. నిన్నటి గురించి మర్చిపోవాలని, రేపటి గురించి ఆలోచించాలని ఉద్బోధించారు. విలువలతో కూడిన సిద్ధాంతాలు గల పార్టీ కాంగ్రెస్ అని చెబుతూ సీనియర్లకు దిశా నిర్దేశం చేశారు. ఈ భేటీలో కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు. భేటీ అనంతరం రాహుల్ గాంధీ పుట్టపర్తి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరారు. -
కాంగ్రెస్ నేతలతో రఘువీరా సమావేశం
అనంతపురం: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ చీఫ్ రఘువీరా శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నేతలతో అనంతపురం జిల్లా మడకశిరలో సమావేశమయ్యారు. రాహుల్ పాదయాత్రపై వారు ఈ సందర్భంగా చర్చిస్తున్నారు. రాహుల్ గాంధీ జూన్ నెలాఖరులో అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. సదరు నియోజకవర్గంలో 15 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేయనున్నారు. అలాగే అప్పులు బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శిస్తారు. విభజనకు కారణం కాంగ్రెస్ పార్టీనే కారణం అన్న బలమైన వాదన సీమాంధ్ర ప్రజల్లో గూడు కట్టుకుని ఉంది. దాంతో గత ఎన్నికల్లో ఓ ఎమ్మెల్యే కానీ... ఓ ఎంపీ కానీ ఎన్నిక కాలేదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో పునర్జీవింప చేయాలని సీమాంధ్రలోని ఆ పార్టీ నేతలు కంకణం కట్టుకున్నారు. అందులోభాగంగా సీమాంధ్ర నేతలు రాహుల్ పర్యటన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ దిశగా పావులు కదిపారు. రాహుల్ పాదయాత్ర చేసేందుకు అంగీకరించారు. అదికాక తన సొంత జిల్లాలో రాహుల్ పాదయాత్రను నిర్వహిస్తున్నారు... ఆ పాదాయత్రను ఎలాగైనా విజయవంతం చేయాలని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఇప్పటికే రాహుల్ పరామర్శించిన సంగతి తెలిసిందే. రాహుల్ పాదయాత్రను విజయవంతం చేయడానికి ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ నేతలు సమాయత్తమైయ్యారు.