కాంగ్రెస్ నేతలతో రఘువీరా సమావేశం
అనంతపురం: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ చీఫ్ రఘువీరా శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నేతలతో అనంతపురం జిల్లా మడకశిరలో సమావేశమయ్యారు. రాహుల్ పాదయాత్రపై వారు ఈ సందర్భంగా చర్చిస్తున్నారు. రాహుల్ గాంధీ జూన్ నెలాఖరులో అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. సదరు నియోజకవర్గంలో 15 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేయనున్నారు.
అలాగే అప్పులు బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శిస్తారు. విభజనకు కారణం కాంగ్రెస్ పార్టీనే కారణం అన్న బలమైన వాదన సీమాంధ్ర ప్రజల్లో గూడు కట్టుకుని ఉంది. దాంతో గత ఎన్నికల్లో ఓ ఎమ్మెల్యే కానీ... ఓ ఎంపీ కానీ ఎన్నిక కాలేదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో పునర్జీవింప చేయాలని సీమాంధ్రలోని ఆ పార్టీ నేతలు కంకణం కట్టుకున్నారు. అందులోభాగంగా సీమాంధ్ర నేతలు రాహుల్ పర్యటన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ దిశగా పావులు కదిపారు. రాహుల్ పాదయాత్ర చేసేందుకు అంగీకరించారు.
అదికాక తన సొంత జిల్లాలో రాహుల్ పాదయాత్రను నిర్వహిస్తున్నారు... ఆ పాదాయత్రను ఎలాగైనా విజయవంతం చేయాలని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఇప్పటికే రాహుల్ పరామర్శించిన సంగతి తెలిసిందే. రాహుల్ పాదయాత్రను విజయవంతం చేయడానికి ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ నేతలు సమాయత్తమైయ్యారు.