'పట్టిసీమ' బెంగతోనే కర్రి శంకరయ్య మృతి
ఏలూరు: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చి... పోలవరం ప్రాజెక్టుకి నిధులు వెంటనే విడుదల చేయాలని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ ఎన్. రఘువీరారెడ్డి... కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఏలూరులో రఘువీరారెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రత్యేక హోదాపై ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తీసుకు వచ్చిందని రఘువీరారెడ్డి ఆరోపించారు. ఎత్తిపోతల పథకంలో రాయలసీమకు ప్రయోజనం శూన్యమన్నారు.
పట్టిసీమ వద్దు, పోలవరాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆయన చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని రఘువీరారెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించడంలో బీజేపీ కుంటి సాకులు చెబుతోందని ఆయన విమర్శించారు. పట్టిసీమ పథకంతో భూమి కోల్పోనున్నమన్న బెంగతో మృతి చెందిన రైతు కర్రి శంకరయ్యది సర్కార్ హత్యే అని రఘువీరా ఆరోపించారు. శంకరయ్య కుటుంబాన్ని ఆదుకుని... రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని రఘువీరా డిమాండ్ చేశారు.