రైల్ నీల్ కుంభకోణంలో చార్జిషీటు
న్యూఢిల్లీ: సంచలనం రేపిన రైల్ నీల్ కుంభకోణంలో సీబీఐ శుక్రవారం చార్జ్‌షీటు దాఖలుచేసింది. మంచినీటి సీసాల సరఫరా వ్యవహారంలో భారీ అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణల నేపథ్యంలో సీబీఐ విచారణ చేపట్టింది. నార్తరన్ రైల్వే మాజీ చీఫ్ కమర్షియల్ మేనేజర్లు ఎం.ఎస్. ఛలియా, సందీప్ సిలాస్లపై చార్జిషీటు నమోదు చేసింది. వివిధ ప్రైవేటు కంపెనీ అధిపతులు సహా మరికొందరిపైనా కేసులు నమోదు చేసినట్టు సీబీఐ ఉన్నతాధికారి దేవ్ ప్రీత్ సింగ్ తెలిపారు.
భారతీయ రైల్వేల ద్వారా సరఫరా చేసే నాణ్యమైన మంచినీటి సీసాలకు బదులుగా చౌకరకం బాటిళ్లు సరఫరా చేసిన విషయంలో అప్పట్లో చీఫ్ కమర్షియల్ మేనేజర్లుగా ఉన్న అధికారులిద్దరిపైన తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించి భారతీయ రైల్వే సంస్థకు సుమారు 20 కోట్ల మేర నష్టం కలిగించినట్టు ఆరోపణలున్నాయి. రాజధాని, శతాబ్ది లాంటి ప్రధాన రైళ్లలో తప్పనిసరి చేసిన 'రైల్ నీర్'ను కాకుండా చౌకరకం బాటిళ్లను సరఫరా చేసిన వ్యవహారంలో సీబీఐ శుక్రవారం 13 ప్రాంతాల్లో తనిఖీలు చేసి రూ.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది.
ఆర్కే అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, సత్యం కేటరర్స్, అంబుజ్ హోటల్ అండ్ రియల్ ఎస్టేట్, పీకే అసోసియేట్స్, సన్‌షైన్ ప్రైవేట్ లిమిటెడ్, బృందావన్ ఫుడ్ ప్రొడక్ట్, ఫుడ్‌వరల్డ్ సంస్థలపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదుచేసింది. మంచినీటిని సరఫరా చేసిన ఆర్కే అసోసియేట్స్, బృందావన్ ఫుడ్ ప్రొడక్ట్‌ల యజమానులైన శ్యాంబిహారీ అగర్వాల్, ఆయన కుమారులు అభిషేక్, రాహుల్‌ల నివాసాల నుంచి రూ.20 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ అధికారి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులకు భారీ ముడుపులు అందాయని, ప్రైవేటు క్యాటరర్లు చౌకరకం బాటిళ్లతో భారీగా లాభాలను ఆర్జించారని సీబీఐ ఆరోపిస్తోంది. తద్వారా ఖజనాకు భారీనష్టం కలిగిందని సీబీఐ అధికారి తెలిపారు. తమ విచారణను మిగతా 16 జోన్లకు కూడా విస్తరిస్తామమన్నారు.