రైల్వే గ్రీవెన్స్‌కు ఒక్క ఎస్సెమ్మెస్ చాలు
8121281212 నంబర్‌కు విశేష స్పందన ఠమూడేళ్లలో లక్షా 50 వేల ఫిర్యాదులు
సిటీబ్యూరో: ఒకే ఒక్క ఎస్సెమ్మెస్. క్షణాల్లో స్పందన.. కచ్చితమైన పరిష్కారం. దక్షిణమధ్య రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం ఇది. ప్రయాణికుల నుంచి వెల్లువెత్తే ఫిర్యాదులకు పరిష్కార వేదిక...‘8121281212’. ఈ నెంబర్‌కు ప్రయాణికుల నుంచి విశేష స్పందన వస్తోంది. ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కార కేంద్రాన్ని ప్రవేశపెట్టిన మూడేళ్లలో లక్షా 50 వేల ఫిర్యాదులు ఎస్సెమ్మెస్‌ల రూపంలో అందాయి. వాటిలో 80 శాతానికిపైగా అధికారులు పరిష్కరించారు. సలహాలు, సూచనలు, సమస్యలపై ఫిర్యాదులు... ఇలా అనేక రకాల ఎస్సెమ్మెస్‌లపై దక్షిణమధ్య రైల్వేలోని వివిధ విభాగాలు వెంటనే స్పందించి పరిష్కారాన్ని చూపుతున్నాయి. ట్రైన్‌కు, ప్రయాణికుడికి మధ్య ఏర్పడిన ఈ గ్రీవెన్స్ బంధంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం...
వేగంగా దూసుకెళ్తున్న సికింద్రాబాద్-బెంగ ళూర్ ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగిలో ఉన్నట్టుండి కలకలం మొదలైంది. ఓ మహిళ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుంది. ప్రయాణికులు చాలామంది ఉన్నా ఏం చేయాలో తోచలేదు. ఓ ప్రయాణికుడు ‘8121281212’ నంబర్‌కు ఎస్సెమ్మెస్ చేశాడు. రైలు సమీపంలోని స్టేషన్‌కు చేరుకునే సమయానికి అక్కడ వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఇది ఇటీవల జరిగిన సంఘటన.
ఎంఎంటీఎస్ హైటెక్‌సిటీ నుంచి నాంపల్లి వైపు వెళ్తుంది. రెండు, మూడు బోగీలకు తలుపులు సరిగ్గా పని చేయడం లేదు. ఎక్కడానికి, దిగడానికి కష్టంగా ఉందని ఓ ప్రయాణికుడు ఎస్సెమ్మెస్ చేశాడు. అధికారులు వెంటనే స్పందించడంతో రెండు రోజుల్లోనే ఆ సమస్య పరిష్కారమైంది. ఇలా ఇతర సమస్యలపై కూడా ఎస్సెమ్మెస్ చేయవచ్చు.
ఫిర్యాదులు ఇలా..
8121281212 నంబర్‌కు ప్రయాణికులు ఎస్సెమ్మెస్ చేస్తారు. ఈ సమాచారాన్ని సెంట్రల్ సర్వర్ స్వీకరిస్తుంది. ప్రయాణికులకు కేటాయించిన యూనిక్ ఐడీ నంబర్‌కు వెంటనే సమాచారం అందుతుంది. ప్రయాణికుల నుంచి స్వీకరించిన ఫిర్యాదు/సలహాలను సంబంధిత విభాగానికి చేరవేస్తారు. ఈ వ్యవస్థ డివిజన్ స్థాయి అధికారుల నుంచి జోనల్ స్థాయిలోని ఉన్నతాధికారుల వరకు కేంద్రీకృతమై ఉంటుంది.